Share News

Ration Rice: బియ్యం దొంగలు దొరికారు!

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:09 AM

పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయని చౌక దుకాణాల డీలర్లను ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా కనిపెట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 40 టన్నుల రేషన్‌ బియ్యం కార్డుదారులకే చేరలేదని నిగ్గు తేల్చింది. ఆయా వివరాలను ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు పంపించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు.

Ration Rice: బియ్యం దొంగలు దొరికారు!

  1. రేషన్‌ పంపిణీపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించిన ప్రభుత్వం

  2. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 15,681 కార్డుదారులకు కాల్‌

  3. రేషన్‌ బియ్యం తీసుకున్నారా అని ప్రశ్న

  4. తీసుకోలేదని 2,940 మంది సమాధానం

  5. సర్వే ప్రకారం 40 టన్నుల బియ్యం మాయం

  6. ఎన్టీఆర్‌, కృష్ణా జేసీలకు ఐవీఆర్‌ఎస్‌ జాబితాలు

  7. రేషన్‌ దుకాణం డీలర్లను విచారించనున్న అధికారులు

పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయని చౌక దుకాణాల డీలర్లను ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా కనిపెట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 40 టన్నుల రేషన్‌ బియ్యం కార్డుదారులకే చేరలేదని నిగ్గు తేల్చింది. ఆయా వివరాలను ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు పంపించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లో భాగంగా జరుగుతున్న రేషన్‌ బియ్యం పంపిణీకి సంబంధించి కార్డుదారుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించింది. ఈ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కార్డుదారులకు బియ్యం అందుతుందా లేదా అన్న ప్రశ్నకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్డుదారులు తమకు బియ్యం అందటం లేదని చెప్పారు.

కార్డుదారులకు చేరని 40 టన్నుల బియ్యం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 1,821 రేషన్‌ దుకాణాల పరిధిలో కార్డుదారులకు ‘మీకు రేషన్‌ అందుతుందా’ అని ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 889 రేషన్‌ దుకాణాల పరిధిలో 8,253 కార్డుదారులకు సంబంధించి బియ్యం తీసుకున్నారా అన్న ప్రశ్నకు 6,782 మంది తీసుకున్నామని చెప్పగా, 1,471 మంది తీసుకోలేదని చెప్పారు. కృష్ణాజిల్లాలో 932 రేషన్‌ దుకాణాల పరిధిలోని 7,428 కార్డుదారుల్లో 5,959 మంది తీసుకున్నామని చెప్పగా, 1,469 మంది తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. రెండు జిల్లాలో కలిపి 15,681 కార్డుదారులను బియ్యం తీసుకున్నారా అని ప్రశ్నించగా, 12,741 మంది తీసుకున్నామని, 2,940 మంది తీసుకోలేదని చెప్పారు. ప్రతి ఇంట్లో కనిష్టంగా నలుగురు సభ్యులు ఉంటారు. ఇంటికి ముగ్గురి చొప్పున పరిగణనలోకి తీసుకుంటే 2,940 మంది కార్డుదారులను మూడుతో హెచ్చవేస్తే మొత్తంగా 44,100 మందికి రావాల్సిన బియ్యం అందలేద ని తేలుతుంది. ఈ బియ్యాన్ని క్వింటాళ్ల లెక్కన చూస్తే 441 క్వింటాళ్లు, టన్నుల ప్రాతిపదికన చూస్తే 40 టన్నులుగా తేలింది. అంటే.. నాలుగు రేషన్‌ దుకాణాలకు వచ్చే కోటాతో సమానం.

బయోమెట్రిక్‌ వేయించుకున్నా ఇవ్వలేదని వెల్లడి

సర్వే ప్రకారం చూస్తే కార్డుదారులు తమ దగ్గర బయోమెట్రిక్‌ వేయించుకున్నా బియ్యం ఇవ్వలేదని సమాధానం చెప్పినట్టు తెలిసింది. బయోమెట్రిక్‌ వేయించుకుని కార్డుదారుల దగ్గర బియ్యం కొనే డీలర్లు ఉన్నారు. ఇది బహిరంగ రహస్యం. నిరంతర ప్రక్రియ కూడా. తమ దగ్గర బయోమెట్రిక్‌ వేయించుకుని అమ్ముకోకపోయినా బియ్యం ఇవ్వలేదని చెప్పటం గమనార్హం. జిల్లాలో రేషన్‌ కార్డుల పోర్టబిలిటీ అమల్లో ఉంది. విజయవాడ నగరంలో అయితే దాదాపుగా సగానికి పైగా పోర్టబిలిటీనే నడుస్తోంది. ఒక రేషన్‌ దుకాణానికి చెందిన వారు ఏ రేషన్‌ దుకాణంలో అయినా నిత్యావసరాలు తీసుకోవచ్చు. దీనినే పోర్టబిలిటీ అంటారు. ఈ పోర్టబిలిటీ విధానంలో తను నివశించే డిపో పరిధిలో కాకుండా బయట మరెక్కడైనా డిపోలో బయోమెట్రిక్‌ వేసి.. బియ్యం తీసుకోకపోయి ఉంటే.. ఐవీఆర్‌ఎస్‌ సమాధానాలలో కొంత అస్పష్టత ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ‘ఎక్స్‌’ అనే చౌక దుకాణం పరిధిలోని డీలర్‌ను ప్రశ్న అడిగితే.. ఆ కార్డుదారుడు ‘వై’ అనే చౌకదుకాణం డీలర్‌ దగ్గర బయోమెట్రిక్‌ వేసి బియ్యం తీసుకోకుండా ఉంటే.. సమస్య వస్తుంది. ఐవీఆర్‌ఎస్‌లో దీనికి సంబంధించి స్పష్టంగా అడిగి ఉంటే.. ఈ సమస్య కూడా ఉండే అవకాశం లేదు.

వీడిన ‘గుట్టు’

ఐవీఆర్‌ఎస్‌ సర్వే నూటికి నూరు శాతం ఖచ్చితత్వం అనిచెప్పకపోయినా.. చాలా వరకు జరుగుతున్న అంశాలనే తెలుపుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఉన్న లో ’గుట్టు’ను బహిర్గతం చేసింది. దీనిని బట్టి చూస్తే.. కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యాన్ని రేషన్‌ డీలర్లు ఏ విధంగా బొక్కేస్తున్నారో తేటతెల్లం అవుతోంది.

విచారణ జరపనున్న జేసీలు

ఐవీఆర్‌ఎస్‌ నివేదికల ప్రకారం రెండు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం రేషన్‌ డీలర్లను విచారించే అవకాశం ఉంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Jul 23 , 2025 | 10:46 AM