Share News

Rice Growth Level: వరి గేమ్‌ చేంజర్‌.. ఆర్‌జీఎల్‌

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:41 AM

సన్న బియ్యానికి రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్వాలయం డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ ఆర్‌జీఎల్‌ 7034 పేరుతో నూతన వరి వంగడానికి జీవం పోశారు.

Rice Growth Level: వరి గేమ్‌ చేంజర్‌.. ఆర్‌జీఎల్‌

  • బీపీటీని తలదన్నే రీతిలో కొత్త వంగడం

  • ‘సన్న’ బియ్యం సమస్యకు పరిష్కారం

  • మొంథా తుఫాన్‌లోనూ పడిపోని పంట

  • దోమ పోటు, తెగుళ్ల బెడదా తక్కువే

(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)

సన్న బియ్యానికి రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్వాలయం డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ ‘ఆర్‌జీఎల్‌ 7034’ పేరుతో నూతన వరి వంగడానికి జీవం పోశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో సన్న బియ్యం సమస్యను అధిగమించేందుకు ఈ కొత్త వంగడం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ రకం రెండో సంవత్సరం పరిశీలనలో అత్యధిక దిగుబడి సాధించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బీపీటీ 5204 కంటే మెరుగ్గా దిగుబడి ఇవ్వటం మాత్రమే కాకుండా దోమ పోటును, ఎండాకు తెగులును తట్టుకొన్నట్లు పరిశీలనలో తేలింది. అంతే కాకుండా ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌లో కూడా పొలాల్లో పంట పడిపోకుండా ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు. సత్యనారాయణ చేతిలో రూపుదిద్దుకున్న వరి వంగడాలు దేశంలోని 16 రాష్ర్టాల్లో విస్తారంగా సాగవుతున్నాయి. సన్న బియ్యం సమస్యను అధిగమించే లక్ష్యంతో తయారు చేసిన ఆర్‌జీఎల్‌ 7034 వరి వంగడం 43వది కావటం విశేషం. ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ పీవీ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే సమయంలో ఆర్‌జీఎల్‌ 7034కు అంకురార్పణ చేశారు. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకంతో చిట్టి ముత్యాలను సంకరణం చేసి.. ఆర్‌జీఎల్‌ 7034ను ఆవిష్కరించారు. 140 రోజుల వ్యవధిలో పంట చేతికొచ్చే ఈ రకం.. ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడి ఇస్తుంది. బీపీటీతో పోలిస్తే ఎకరాకు 10-15 బస్తాల అధిక దిగుబడి వచ్చినట్లేనని చెబుతున్నారు. గుంటూ రు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో ఆళ్ల మోహన్‌రెడ్డి అనే రైతు ఆర్‌జీఎల్‌ 7034 వరి వంగడాన్ని ఈ ఏడాది సాగు చేశారు. గింజ రాలిపోవడం తక్కువగా ఉండటంతో పాటు మొన్న వచ్చిన మొంథా తుఫాన్‌కు సైతం పైరు పడిపోకుండా ఉంది. పక్కన సాగు చేసిన బీపీటీ రకాలు పూర్తిగా పడిపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లింది.


పెట్టుబడి, తెగుళ్లూ తక్కువే..

నేను ఇప్పటికి వరిలో 40 సన్న రకాలు సాగు చేశాను. ఆర్‌జీఎల్‌ 7034 నిజంగా గేమ్‌ చేంజర్‌ అనిపిస్తోంది. తక్కువ పెట్టుబడి అయింది. తెగుళ్లు తక్కువగానే ఆశించాయి. ఎకరాకు ఒక్క బస్తా యూరియా వేశాను. ఒక్కసారి పురుగు మందు పిచికారీ చేశాను. తుఫాన్‌కు కూడా పైరు పడిపోలేదు.

- ఆళ్ల మోహన్‌రెడ్డి,

వీర్లపాలెం, దుగ్గిరాల మండలం

Updated Date - Nov 17 , 2025 | 03:45 AM