TDP Parliamentary Party: విధేయతకు పట్టం
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:20 AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేశారు.
టీడీపీ పార్లమెంటరీ సారథులు ఖరారు
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం
సామాజిక సమీకరణలతో పదవుల కూర్పు
8 మంది బీసీలు, నలుగురు ఎస్సీలకు చోటు
11 మంది ఓసీలు..ఎస్టీ, మైనారిటీలకు చెరొకటి
ఐదుగురు మహిళలకు బాధ్యతలు
నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి చాన్సు
ఆరుగురు నామినేటెడ్ చైర్మన్లకు కూడా..
శ్రేణుల సూచనలతో ఐదుగురి మార్పు
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేశారు. వారి జాబితాను పార్టీ నాయకత్వం ఆదివారం విడుదల చేసింది. ఇందులో విధేయతకు, సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చారు. సామాజిక సమీకరణలతో పదవుల కూర్పు జరిగింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకుగాను 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అధ్యక్షులుగా నియమించారు. మిగిలిన 11 స్థానాలను ఓసీలకు కేటాయించారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా సుదీర్ఘ కసరత్తు తర్వాత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను చంద్రబాబు నియమించారు. అధ్యక్షులుగా నియమితులైన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసేవారికి, సీనియర్లకు ఈసారి పదవుల్లో పెద్దపీట వేశారు. ప్రస్తుత జాబితా ప్రకారం 11మంది ఓసీలకు 8 మంది బీసీలకు, నలుగురు ఎస్సీలకు, ఒక ఎస్టీకి, ఒక మైనార్టీకి అవకాశం కల్పించారు. ఓసీల్లో కాపులు, రెడ్లు, కమ్మవర్గానికి మూడేసి చొప్పున, క్షత్రియులు, బలిజలకు చెరొకటి దక్కింది. కొద్దిరోజుల క్రితం ఖరారైన వారిలో కొందరిపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తంచేయడం.. మరికొందరు అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు సుముఖత చూపకపోవడం, సామాజిక సమీకరణలు కారణాలుగా ఐదుగురిని మార్చి తుది జాబితాను ఖరారు చేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవుల్లో సీనియర్లతోపాటు పదవులతో సంబంధం లేకుండా తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారికీ అవకాశమిచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గట్టిగా పోరాడిన వారికీ ప్రాధాన్యమిచ్చారు. కీలక పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు. గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణల ఆధారంగా పదవులు కేటాయించారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వారిలో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఆరుగురు నామినేటెడ్ చైర్మన్లు ఉన్నారు.
మార్పుచేర్పులు ఇలా..
అనకాపల్లికి తొలి జాబితాలో పరిశీలనలో ఉన్న బాలాజీపై స్థానికంగా పెద్ద సానుకూలత రాకపోవడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న బత్తుల తాతయ్యబాబునే కొనసాగించాలని నిర్ణయించారు. కర్నూలుకు పరిశీలనలో ఉన్న వహీద్ హుస్సేన్ విషయంలోనూ అదే పరిస్థితి రావడంతో ఆయన స్థానంలో గుడిశె కృష్ణమ్మకు అవకాశం కల్పించారు. కర్నూలులో వహీద్‌ను మార్చడంతో నరసరావుపేటలో కొమ్మాలపాటి శ్రీధర్ స్థానంలో షేక్ జానే సైదాకు అవకాశం ఇచ్చారు. అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు విముఖత చూపడంతో పూల నాగరాజును నియమించారు. నంద్యాలలో ధర్మవరం సుబ్బారెడ్డి విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల నుంచి సానుకూలత లేకపోవడంతో గౌరు చరితారెడ్డిని నియమించారు.