AP Chief Secretary: చెరువులను పునరుద్ధరించండి
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:22 AM
రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించాలని, జిల్లాల్లో నీటి నిల్వలపై సెప్టెంబరు 1న బులిటెన్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు.
23న ‘స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం నిర్వహించండి: సీఎస్
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించాలని, జిల్లాల్లో నీటి నిల్వలపై సెప్టెంబరు 1న బులిటెన్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లోని భూగర్భ జలాలు, చెరువులు, ప్రాజెక్టుల్లోని నిల్వలతో వాటర్ బులెటిన్లు ఇవ్వాలన్నారు. ఈ నెల 23న శనివారం ‘స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగైన సేవలు అందిస్తున్న వారికి అక్టోబరు2న అవార్డులు ప్రదానం చేయాలన్నారు. ‘స్వామిత్ర’ కింద గ్రామాల్లో భూముల రీసర్వే, గ్రామ కంఠాల గుర్తింపును 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు.