ముక్త్యాలకు పునరుజ్జీవం!
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:21 AM
ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూటమి ప్రభుత్వం రూ.489.28 కోట్లు మంజూరు చేయటంతో నియోజవకర్గంలోని నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర విభజన తర్వాత సాగర్ ఆయకట్టు నానాటికి తీసుకట్టు అన్న చందాన మారిపోయింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఎప్పుడు సాగునీరు విడుదల అవుతుందా అని ఎదురుచూపులతోనే కాలం గడించిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు కేటాయించి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
- ఎత్తిపోతల పథకానికి రూ.489.28 కోట్లు విడుదల
- రైతుల సాగునీటి ఇబ్బందుల దృష్ట్య కూటమి ప్రభుత్వం నిర్ణయం
- ఇక 38,627 ఎకరాల సాగర్ ఆయకట్టు కృష్ణాజలాలతో సస్యశ్యామలం
- రైతాంగంలో ఆనందోత్సాహాలు
ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూటమి ప్రభుత్వం రూ.489.28 కోట్లు మంజూరు చేయటంతో నియోజవకర్గంలోని నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర విభజన తర్వాత సాగర్ ఆయకట్టు నానాటికి తీసుకట్టు అన్న చందాన మారిపోయింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఎప్పుడు సాగునీరు విడుదల అవుతుందా అని ఎదురుచూపులతోనే కాలం గడించిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు కేటాయించి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
(ఆంధ్రజ్యోతి, జగ్గయ్యపేట):
ముక్త్యాల నుంచి కృష్ణాజలాలను ఎత్తి సాగర్ కాల్వలకు అందించేందుకు గత టీడీపీ ప్రభుత్వం ముక్త్యాల ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు 2019లో వర్చువల్‌గా చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముక్త్యాల ఎత్తిపోతల పేరును వేదాద్రి ఎత్తిపోతలుగా పేరు మార్చి నాటి సీఎం జగన్ తన పెళ్లిరోజున వర్చువల్‌గా మళ్లీ శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ముందుకు సాగలేదు. వేదాద్రి దగ్గర పనులు ప్రారంభించిన నిర్మాణ సంస్థ తర్వాత నిధులు విడుదల కాకపోవటంతో యంత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఈ ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల హామీగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు ఎంపీ కేశినేని, శ్రీరాం తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, ఆప్కాబ్ మాజీ చైర్మన్ టీడీ జనార్ధన్‌లు పథకానికి నిధులు ఇవ్వాలని చంద్రబాబును కలిశారు. పది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం రూ.489.28 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెం.44ను ఇచ్చింది. ఈ ఎత్తిపోతల ద్వారా 38,627 ఎకరాల సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. వేదాద్రి వద్ద నుంచి 386.27 క్యూసెక్కుల నీటిని రెండు దశల్లో ఎత్తి డీవీఆర్ కాల్వ ద్వారా మూడు చోట్ల ఎన్‌ఎస్పీ కాల్వలకు నీటిని విడుదల చేస్తారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలోని 30కి పైగా గ్రామాల రైతులకు లబ్ధి కలుగుతుంది.
పేరు మార్చి ఏమార్చిన వైసీపీ పాలకులు
గత వైసీపీ ప్రభుత్వంలో ముక్త్యాల ఎత్తిపోతల పేరు మార్చి పథకాన్ని ఏమార్చారని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆరోపించారు. తిరిగి ముక్త్యాల ఎత్తిపోతలకు సీఎం చంద్రబాబును ఎంపీ కేశినేని శివనాథ్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాంల సహకారంతో ఒప్పించామని చెప్పారు. ఈ స్కీం నిర్మాణం వల్ల రైతులు ప్రతి ఏడాది సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదని, ఎన్‌ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, భావి తరాలకు నీటి భద్రత కలుగుతుందని వివరించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి నిధులు విడుద ల చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎర్రకాల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం
పట్టణంలో ఎర్రకాల్వ సమస్యకు శాశ్వత పరిష్కారానికి రూ.5.65 కోట్లు సీఎం మంజూరు చేశారని, ఈ నిధులతో పట్టణంలో ఎర్రకాల్వ ప్రవేశించే శాంతినగర్ నుంచి ఊర చెరువు వరకు కాల్వ లైనింగ్ పనులతో పాటు, అవసరమైన చోట కల్వర్టుల నిర్మిస్తామని ఎమ్మెల్యే తాతయ్య చెప్పారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజలు అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.