Share News

AP Education: బడులకు మళ్లీ కళ

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:23 AM

రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారింది. ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గిపోతున్నారు. 2021-22లో 44లక్షల మంది విద్యార్థులుంటే 2024-25 నాటికి ఆ సంఖ్య 34.5 లక్షలకు పడిపోయింది.

AP Education: బడులకు మళ్లీ కళ

  • కొత్త టీచర్లతో పాఠశాలలకు మహర్దశ

  • మెగా డీఎస్సీతో 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు

  • మోడల్‌ ప్రైమరీ స్కూళ్లతో నూతన అధ్యాయం

  • ప్రాథమిక బడిలో ప్రతి తరగతికీ ఒక టీచర్‌

  • టీచర్లపై పనిభారం తగ్గింపు

  • తొమ్మిది రకాల పాఠశాలల విధానం

  • పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు

తిరోగమనం దిశగా సాగుతున్న ప్రభుత్వ విద్యకు కూటమి ప్రభుత్వం కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. పిల్లలు వెళ్లిపోతున్నారు.....ఉన్న టీచర్లే ఎక్కువైపోయారని గత వైసీపీ ప్రభుత్వం తేల్చగా...పాఠశాలలను పునర్‌వ్యవస్థీకరించి 16,347 పోస్టులతో చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ టీచర్లు ఒకటి, రెండు వారాల్లో పాఠశాలల్లో అడుగుపెట్టబోతున్నారు. కొత్త సార్లతో ప్రభుత్వ పాఠశాలలు నిండుగా మళ్లీ కళకళలాడనున్నాయి.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారింది. ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గిపోతున్నారు. 2021-22లో 44లక్షల మంది విద్యార్థులుంటే 2024-25 నాటికి ఆ సంఖ్య 34.5 లక్షలకు పడిపోయింది. విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో కొత్త టీచర్ల అవసరమే లేదని, ఉన్న టీచర్లే మిగిలిపోయారని గత జగన్‌ ప్రభుత్వం తేల్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ పుంజుకోవడం కష్టమేనని భావించిన సమయంలో కూటమి ప్రభుత్వం వినూత్న విధానాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కునారిల్లుతున్న ప్రాథమిక విద్యను తిరిగి గాడిలో పెట్టేందుకు మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు అనే కొత్త విధానం తీసుకొచ్చింది. గతేడాది వరకూ రాష్ట్రంలో ఒకరిద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ అనే విధానం అమల్లోకి తెచ్చింది. రెండుమూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉండేవారు. ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు చొప్పున టీచర్లు పాఠాలు చెప్పేవారు. కాలక్రమంలో ప్రైవేటు పాఠశాలలు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక విద్య అత్యంత దయనీయంగా మారింది. నలుగురైదుగురు పిల్లలతో నడుస్తున్న బడుల సంఖ్య వేలల్లోకి చేరింది. గత విద్యా సంవత్సరం వరకు 20 మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలల సంఖ్య 13వేలుగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతో కొత్తగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టారు.


గతంలో ఉన్నట్టుగా తరగతికి ఒక టీచర్‌ విధానం తెచ్చారు. ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఐదు తరగతులకు కలిపి ఒక్కరే టీచర్‌ బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 45 దాటిన పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా 9600 ప్రాథమిక పాఠశాలలు మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా మారాయి. వాటిలో 45 నుంచి 59 వరకు విద్యార్థులుంటే నలుగురు టీచర్లను, 59 దాటితే ఐదుగురు టీచర్ల చొప్పున కేటాయించారు. ఆ పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టు కూడా ఇచ్చారు.

జీవో 117 రద్దు

వైసీపీ ప్రభుత్వం జీవో 117ను తీసుకొచ్చి పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేసింది. ఉపాధ్యాయులు ఈ జీవో మాకొద్దు అని రోడ్డెక్కే స్థాయిలో ఆ జీవో ప్రభుత్వ విద్యపై ప్రతికూల ప్రభావం చూపింది. టీచర్లకు బోధన సమయాన్ని అమాంతం పెంచేసి గుక్క తిప్పుకోకుండా చేశారు. 4250 ప్రాథమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి ఊరి బడిని దూరం చేశారు. ఫలితంగా మా బడి మాకు కావాలని తల్లిదండ్రులూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అప్పుడే తాము అధికారంలోకి వస్తే జీవో 117ను రద్దుచేస్తామని తెలుగుదేశం నేతలు హామీ ఇచ్చారు. హామీకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా జీవో 21ను తీసుకొచ్చింది. టీచర్ల బోధన సమయాన్ని వారానికి 32 పీరియడ్లకు తగ్గించింది. ఉన్నత పాఠశాలల్లో సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను 53 నుంచి 49కు తగ్గించింది. ఫౌండేషనల్‌ పాఠశాలల్లో గతంలో 30 మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్‌ను ఇచ్చేవారు. నూతన విధానంలో 20 మంది దాటితే రెండో టీచర్‌ను ఇస్తున్నారు.


తొమ్మిది రకాల పాఠశాలలు

గత ప్రభుత్వంలో ఆరు రకాల బడుల విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల బడులుగా మార్చింది. తొమ్మిది రకాల బడుల విధానంపై తొలుత వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత నూతన మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు, పనిభారం తగ్గింపుతో వ్యతిరేకత కొంతమేర తగ్గింది. శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్‌(ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2), ఫౌండేషనల్‌ స్కూల్‌(ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1, 2 తరగతులు), బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌(ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1-5 తరగతులు), మోడల్‌ ప్రైమరీ స్కూల్‌(ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1-5 తరగతులు), ప్రాథమికోన్నత పాఠశాల(ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1-8 తరగతులు), ఉన్నత పాఠశాల (6- 10 తరగతులు), ఉన్నత పాఠశాల (1- 10 తరగతులు), ఉన్నత పాఠశాల ప్లస్‌(6- 12 తరగతులు), ఉన్నత పాఠశాల ప్లస్‌(1- 12 తరగతులు) విధానం అమలు చేస్తున్నారు. 45 మంది విద్యార్థులు దాటిన పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా పరిగణించి ప్రతి తరగతికి ఒక టీచర్‌ను ఇచ్చారు. బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు ఉంటారు.


పూర్తిస్థాయిలో టీచర్లు

చాలాకాలం నుంచి పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల బ్లాకింగ్‌ విధానం అమల్లో ఉంది. అంటే ప్రతి పాఠశాలలో కనీసం ఒకట్రెండు పోస్టులు ఖాళీగా ఉంచుతారు. టీచర్ల కొరత కారణంగా ఈ విధానం అమలుచేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం చేసిన టీచర్ల బదిలీల్లో బ్లాకింగ్‌ విధానం తొలగించింది. దీంతో టీచర్లు పట్టణాలకు దగ్గరగా ఉన్న పాఠశాలలను ఎక్కువగా కోరుకుని అక్కడికి వెళ్ళారు. దీంతో అక్కడ వంద శాతం టీచర్లు నిండారు. పూర్తి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొరత పెరిగింది. ఇప్పుడు కొత్త టీచర్లతో ఆ పాఠశాలల్లో ఖాళీలన్నీ భర్తీ అవుతాయి. దీంతో దాదాపుగా అన్ని పాఠశాలల్లో నూరు శాతం టీచర్ల భర్తీ జరుగుతుంది. దీనివల్ల సబ్జెక్టు టీచర్‌ కొరత ఉండదు.


రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

డీఎస్సీ కాల్‌ లెటర్లలో జాప్యం

డీఎస్సీ మెరిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాల్‌ లెటర్ల విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కాల్‌ లెటర్లు విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని తొలుత నిర్ణయించారు. కానీ, ఆదివారం అర్థరాత్రి వరకు కాల్‌ లెటర్లు విడుదల కాలేదు. సోమవారం ఉదయం కాల్‌ లెటర్లు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 04:26 AM