Disability Pension: అనర్హుల ఏరివేతకే సదరం పునఃపరిశీలన
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:00 AM
బోగస్ సర్టిఫికెట్లతో దివ్యాంగుల పింఛన్లను పొందుతున్న అనర్హులను ఏరివేసేందుకే సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన జరుగుతుంది అని మంత్రి ..
5.10 లక్షల మందిలో 4.50 లక్షల మందికి సర్టిఫికెట్ల తనిఖీ పూర్తి...లక్ష మంది అనర్హులు
అత్యధికంగా పులివెందులలోనే...: పార్థసారథి
అమరావతి, నర్సీపట్నం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘బోగస్ సర్టిఫికెట్లతో దివ్యాంగుల పింఛన్లను పొందుతున్న అనర్హులను ఏరివేసేందుకే సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన జరుగుతుంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం హయాంలో అనర్హులకు కూడా మంజూరు చేసి దుర్వినియోగం చేశారు. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ పింఛన్లను పొందుతున్నారు. వారిలో 5.10 లక్షల మందికి చెందిన సదరం సర్టిఫికెట్లను పునఃపరిశీలించేందుకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకూ 4.50 లక్షల మంది సర్టిఫికెట్ల తనిఖీని పూర్తి చేసుకున్నారు. వారిలో దాదాపు ఒక లక్ష మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 60వేల మంది సర్టిఫికెట్లను రీవెరిఫై చేయించుకొనేందుకు ముందుకు రాలేదు. వీరందరికీ మరోసారి నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ వారు ముందుకు రాకపోతే వారి పింఛన్లను నిలుపుదల చేస్తాం. సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌లో అత్యధికంగా పులివెందులలోనే 1,708 మంది బోగస్ పింఛనుదారులు ఉన్నట్లు గుర్తించా’’మన్నారు.
అనర్హులకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై చర్యలు: అయ్యన్న
అనర్హులకు దివ్యాంగుల సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అర్హత లేకపోయినా ఇప్పటివరకూ పింఛన్లు తీసుకుంటున్న వారితో పాటు, వారికి సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.