Share News

AP Govt: రెన్యూ పవర్‌ 82 వేల కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:59 AM

పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే రాష్ట్రప్రభుత్వం భారీ ఎత్తున ఎంవోయూలను కుదుర్చుకుంటోంది.

AP Govt: రెన్యూ పవర్‌ 82 వేల కోట్ల పెట్టుబడి

  • ఇందులో రూ.22 వేల కోట్ల పెట్టుబడికి గతంలోనే ఓకే

  • మరో రూ.60 వేల కోట్లు పెట్టేందుకు 4 ఒప్పందాలు

  • పెట్టుబడులన్నీ పునరుత్పాదక ఇంధన రంగంలోనే..

  • గూగుల్‌ డేటా విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు సిద్ధం

  • సీఎంతో భేటీలో సంస్థ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా వెల్లడి

  • ఏపీ అప్రోచ్‌ చాలా బాగుందని ప్రశంసలు

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే రాష్ట్రప్రభుత్వం భారీ ఎత్తున ఎంవోయూలను కుదుర్చుకుంటోంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్న రెన్యూ పవర్‌ ఏపీలో రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. గురువారం ఆ కంపెనీ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా.. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యా రు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ ముందంజలో ఉందని, పర్యావరణ పరిరక్షణతోపాటు వినియోగదారులకు విద్యుత్తును తక్కువ ధరకు అందించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో రెన్యూ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎకానమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఈడీబీ)తో రూ.60వేల కోట్ల విలువైన 4ఎంవోయూలను కుదుర్చుకుంది. కాగా, ఒప్పందంలో భాగంగా 6 గిగావాట్‌ ఫొటోవోల్టాయిక్‌(పీవీ) ఇంగోట్‌-వేఫర్‌ ప్లాంట్‌, 2 గిగావాట్‌ పంప్డ్‌ హైడ్రో ప్రాజెక్టు, 300 కేటీపీఏ గ్రీన్‌ అమ్మోనియా సౌకర్యం, విండ్‌, సోలార్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ వంటి వాటిల్లో 5 గిగావాట్‌ హైబ్రిడ్‌ ప్రాజెక్టులను రెన్యూ సంస్థ ఏర్పాటు చేయనుంది. తాజా ఎంవోయూల ద్వారా 10వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధికి అవకాశముంది.


సదస్సుకు వస్తే పెట్టుబడులు వచ్చినట్టా..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 మార్చి 3న విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించింది. ఈ సమ్మిట్‌కు రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీతోసహా పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రెన్యూ సంస్థ చైర్మన్‌ సుమంత్‌ సిన్హా ఈ సమావేశానికి హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత సుమంత్‌ సిన్హా సహా ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేదు. కానీ వైసీపీ మాత్రం....రెన్యూ సంస్థను తామే తీసుకొచ్చామని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటోంది.

గతంలో 22వేల కోట్లు పెట్టుబడి..

రెన్యూ సంస్థ ఈ ఏడాది మే 16న అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో రూ.22వేల కోట్లతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన చేశా రు. ఇది దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్‌ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టు. ఇందులో 1.8 గిగావాట్ల సోలార్‌, 1 గిగావాట్‌ విండ్‌, 2 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తోంది.

రైతులతో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు

రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు స్వయంగా సోలార్‌, విండ్‌ విద్యుదుత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుంది... ఎకరానికి ఎంత ఆదాయం వస్తుందనే దానిపై రెన్యూ పవర్‌ చైర్మన్‌ సుమంత్‌ సిన్హాతో సీఎం చర్చించారు. సౌర పలకల ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తామని సీఎం వెల్లడించారు.

Updated Date - Nov 14 , 2025 | 05:01 AM