Share News

Election Deputy Tahsildar Posts: రెవెన్యూ మాయాజాలం

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:16 AM

రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కసారి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తేనే 5 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు మండలాల్లో తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌(డీటీ)లు తగినంత మంది లేరు.

Election Deputy Tahsildar Posts: రెవెన్యూ మాయాజాలం

  • 175 ఎన్నికల డీటీ పోస్టులపైనా దొంగాటే.. తాత్కాలిక పోస్టులను పర్మినెంట్‌ చేస్తామంటూ ప్రతిపాదన

  • ఈసీ, జీఏడీ కుదరదని తేల్చినా.. మళ్లీ మళ్లీ అదే పాట

మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి భూసమస్యలకు పరిష్కారం చూపాల్సిన రెవెన్యూ శాఖ అందుకు భిన్నమైన దారిలో నడుస్తోంది. జగన్‌ ప్రభుత్వంలో అడ్డగోలుగా సృష్టించిన 300 డీటీ పోస్టులను రెగ్యులరైజ్‌ చేసే ప్రయత్నం బెడిసికొట్టడంతో.. ఎన్నికల కమిషన్‌ పరిధిలోని 175 డీటీ పోస్టులను (డిప్యుటేషన్‌పై నియమించేవి) పర్మినెంట్‌ చేస్తామంటోంది. ఆ 300 పోస్టుల్లో వీటిని చూపించే ప్రయత్నం చేస్తోంది. అవి తాత్కాలిక పోస్టులేనని.. వాటిని శాశ్వత పోస్టుల జాబితాలో చేర్చడం కుదరదని, వాటికి పదోన్నతులు కూడా వర్తించవని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పినా వినిపించుకోవడం లేదు. దరిమిలా ఈ మొత్తం పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కసారి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తేనే 5 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు మండలాల్లో తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌(డీటీ)లు తగినంత మంది లేరు. 697 తహశీల్దార్‌ పోస్టులకు 470 రెగ్యులర్‌ అధికారులే ఉన్నారు. మిగిలినవాటికి ఇన్‌చార్జులే దిక్కు. డీటీల పరిస్థితీ ఇంతే. మండల కార్యాలయాల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ, పదోన్నతుల అంశంలో నెలకొన్న ప్రతిష్టంభన, న్యాయపరమైన సమస్యలను పట్టించుకోకుండా.. వాటికి ఓ పరిష్కారం చూపకుండా.. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని ఎన్నికల డీటీ పోస్టుల రెగ్యులరైజేషన్‌ గురించి రెవెన్యూ శాఖ పరుగులు తీస్తోంది. రాష్ట్రంలో 2019 ఎన్నికలకు ముందు.. ఎన్నికల విధుల కోసం 175 ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఎన్నికల నిర్వహణ కోసమేనని, డిప్యుటేషన్‌పైనే వీటిని భర్తీచేయాలని అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు (జీవో 12) జారీ చేశారు. ఈ పోస్టుల కాలపరిమితి 2024 మార్చిలో ముగిసిపోయింది.


దీంతో మరో ఏడాదిపాటు అంటే 2025 మార్చి వరకు వాటి కాలపరిమితిని ఆర్థిక శాఖ పొడిగించింది. నిజానికి ఈ పోస్టులను క్రమబద్ధీకరించాలని ఈ శాఖను ఓ ఉద్యోగ సంఘం నాయకుడు కోరగా.. తిరస్కరించింది. ఈ 175 పోస్టులు తాత్కాలికమేనని, వాటిని శాశ్వత పోస్టుల జాబితాలో చూపలేమని ఉత్తర్వులో పేర్కొంది. ఎన్నికల డీటీ పోస్టులకు 50 శాతం కేంద్రం, మరో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తాయని.. ఈ పోస్టుల అవసరం తీరిన తర్వాత డిప్యుటేషన్లు రద్దయిపోతాయని కూడా తేల్చిచెప్పింది. తదనుగుణంగా ఈ డిప్యూటీ తహశీల్దార్ల ఉద్యోగాల తాజా గడువు ముగిసిపోయింది. ఇప్పుడు మరో 9 నెలలు పొడిగించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా పొడిగించే అవకాశముంది. అయితే వీటిని పర్మినెంట్‌ చేయాలని రెవెన్యూ శాఖ గత ఏడాదిలోనే ప్రతిపాదన పంపింది. ఈసీ, జీఏడీ రెండూ తిరస్కరించాయి. దీంతో పర్మినెంట్‌ చేసే అవకాశం ఇక లేదని తేలిపోయింది.


..అదే జరిగితే ఆ అక్రమాలను ఆమోదించినట్లే..!

జగన్‌ ప్రభుత్వంలో ఓ అధికారి తన స్వార్థం కోసం 300 డీటీ పోస్టులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులను శాశ్వత ఉద్యోగాల జాబితాలో చూపాలన్న ప్రయత్నాలను జీఏడీ, ఆర్థిక శాఖ అడ్డుకున్నాయి. దీంతో దొడ్డిదారిన ఆ పోస్టులను మరో రూపంలో రెగ్యులరైజ్‌ చేయించేందుకు రెవెన్యూ శాఖ ఎత్తులు వేస్తోంది. ఎన్నికల కమిషన్‌ వద్ద డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 175 మంది డీటీలను ఈ పర్మినెంట్‌ ఉద్యోగాల జాబితాలో చూపించి.. వారికిచ్చిన అడహాక్‌ పదోన్నతులను రెగ్యులరైజ్‌ చేయాలని చూస్తోంది. గతంలో రెవెన్యూ శాఖ 2023లో ఒకసారి, గత ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు మరోసారి ఇలాంటి ప్రయత్నాలే చేసింది. అయితే ఆ 175 డీటీ పోస్టులు రెగ్యులర్‌ ఉద్యోగాలు కావని.. డిప్యుటేషన్‌పై తీసుకున్న తాత్కాలిక పోస్టులని.. వాటిని శాశ్వత ప్రాతిపదికన చూడలేమని ఎన్నికల కమిషన్‌, జీఏడీ 2024 ఏప్రిల్‌లోనే స్పష్టం చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ పునరుద్ఘాటించాయి. అయినా రెవెన్యూశాఖ మళ్లీ అదే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపున 9 నెలల పాటు ఆ పోస్టుల పొడిగింపు కోరుతూ.. మరోవైపు వాటిని శాశ్వత ఉద్యోగాలుగా చూడాలని ఫైళ్లు పంపింది. ఒకవేళ ఈ పోస్టులను కూడా జగన్‌ ప్రభుత్వంలో అడ్డగోలుగా సృష్టించిన 300 జాబితాలో భాగంగా చూసి రెగ్యులరైజ్‌ చేస్తే.. రెవెన్యూశాఖ లేదా జీఏడీ ఆధ్వర్యంలోని ఈసీ జీతాలివ్వాల్సి ఉంటుంది. అదీగాక జగన్‌ ప్రభుత్వం సృష్టించిన 300 పోస్టుల్లో వాటిని కలిపితే.. ఆనాడు జరిగిన అక్రమాలను ఆమోదించినట్లవుతుందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. జీఏడీ, ఆర్థికశాఖ పదే పదే తిరస్కరిస్తున్నా దొడ్డిదారిలో ఫైళ్లు పంపడం వెనుక గతం లో రెవెన్యూలో పనిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో పాటు ఒక ఉద్యోగ సంఘం నేత పాత్ర ఉందని ఆ శాఖలో చర్చ జరుగుతోంది.

Updated Date - Jul 07 , 2025 | 09:45 AM