Share News

Revenue Department: సర్వే అధికారి కోసం దిగొచ్చిన రెవెన్యూశాఖ

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:29 AM

సర్వే శాఖలోని ఓ జూనియర్‌ అధికారి కోసం రెవెన్యూ శాఖ పరితపించిపోయింది. ఏడాదిలో రెండు పోస్టింగులు ఇచ్చింది. అందులోనూ ఆయన కోరుకున్న కేడర్‌లో పోస్టింగ్‌ ఇస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదని...

 Revenue Department: సర్వే అధికారి కోసం దిగొచ్చిన రెవెన్యూశాఖ

  • ఏడు నెలల్లో మూడు జీవోలు.. రెండు పోస్టింగులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సర్వే శాఖలోని ఓ జూనియర్‌ అధికారి కోసం రెవెన్యూ శాఖ పరితపించిపోయింది. ఏడాదిలో రెండు పోస్టింగులు ఇచ్చింది. అందులోనూ ఆయన కోరుకున్న కేడర్‌లో పోస్టింగ్‌ ఇస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదని, ఆయనకు మాత్రమే సాధ్యపడిందని ఆ ఉత్తర్వులను పరిశీలిస్తే అర్థమవుతోంది. అంతలా ఆయనకోసం రెవెన్యూ శాఖ దిగొచ్చింది. సర్వే శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి 28న కాకినాడ డీడీగా పోస్టింగ్‌ ఇస్తూ రెవెన్యూ శాఖ తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజుకు ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో అక్కడే పనిచేయాలని అప్పటి స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా ఆదేశాలిచ్చారు. గత నెల 9న ఆయన్ను కాకినాడ నుంచి కర్నూలుకు డీడీగా బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత అదే కర్నూలులో, అదే పోస్టులో ఆయన్ను జేడీగా నియమిస్తూ రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఆయన విషయంలో రెవెన్యూశాఖ దిగొచ్చి కోరుకున్నట్లుగా పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి సర్వేలో జిల్లా స్థాయిలో జేడీ పోస్టులు లేవు. రాయలసీమ జిల్లాలన్నింటికి కలిపి పర్యవేక్షణ కోసం ఆర్‌డీడీ పోస్టు ఉంది. అందులో డీడీ లేదా జేడీ స్థాయి అధికారిని నియమిస్తారు.

Updated Date - Jul 12 , 2025 | 09:43 AM