Share News

Revenue Department: పెండింగ్‌ పెద్దన్న

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:22 AM

పెండింగ్‌లో రెవెన్యూ శాఖ ఏకంగా పెద్దన్నలా తయారైంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో రెవెన్యూ పరిష్కరించిన ఫైళ్లు, పెండింగ్‌లో ఉంచిన వాటి వివరాలు, ఇంకా సగటున ఒక్కో ఫైలు చూసేందుకు...

Revenue Department: పెండింగ్‌ పెద్దన్న

  • ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక

  • అత్యవసర ప్రభుత్వ శాఖల్లో ఇదీ ఒకటి

  • కానీ, కింది నుంచి పై దాకా పెండింగే

  • ఈ-ఆఫీ్‌సలో 3,154 ఫైళ్ల పార్కింగ్‌

  • ఒక్కో ఫైల్‌ చూడటానికే 21 రోజులు

  • వచ్చి కలిస్తేనే వాటిని పరిశీలిస్తారా?

  • ఇక రెవెన్యూలో ప్రక్షాళన ఎలా సాధ్యం?

  • అత్యవసర శాఖల్లోనూ భారీగా పెండింగ్‌

రెవెన్యూశాఖ... రాష్ట్రంలో సాగు భూములు, స్థిర, చరాస్తులు ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అత్యవసర శాఖ ఇది. కానీ రెవెన్యూ పనులు ఏవీ వేగంగా ముందుకు సాగ డం లేదు. అన్ని శాఖల్లో ఫైళ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందగా, రెవెన్యూశాఖలో కింది నుంచి పై వరకు నత్తకు నడకలు నేర్పుతున్నారంటూ అందులో తేల్చారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పెండింగ్‌లో రెవెన్యూ శాఖ ఏకంగా పెద్దన్నలా తయారైంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో రెవెన్యూ పరిష్కరించిన ఫైళ్లు, పెండింగ్‌లో ఉంచిన వాటి వివరాలు, ఇంకా సగటున ఒక్కో ఫైలు చూసేందుకు తీసుకుంటున్న సమయం చూస్తే విస్తుపోవాల్సిందే. జిల్లా కలెక్టర్‌, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), సర్వే డైరెక్టరేట్‌, ఇంకా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ విభాగాధిపతుల నుంచి వచ్చే ఫైల్స్‌ను చూడటానికి సెక్షన్‌ అధికారి నుంచి అదనపు కార్యదర్శి వరకు సగటున 21 రోజుల 20:56 గంటల సమయం తీసుకుంటున్నారు. సచివాలయంలో పనిచేసే అధికారులు తమ లాగిన్‌కు వచ్చే ఈ-ఆఫీస్‌ ఫైల్‌ను తెరచి చూసేందుకే 21 రోజల సమయం తీసుకోవడం గమనార్హం. పాలనలో పారదర్శకత, వేగం, సత్వర పరిష్కారాలు ఉండాలన్న లక్ష్యంతో ఈ-ఆఫీస్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఫిజికల్‌ ( భౌతిక) ఫైల్స్‌ ఉంటే సకాలంలో పరిష్కరించడం లేదని, కొన్ని సందర్భాల్లో అవి గల్లంతయిపోతున్నాయన్న ఫిర్యాదులకు చెక్‌పెట్టేందుకే ఈ -ఆఫీస్‌ ఫైల్‌ విధానం అమల్లో ఉంది. అలాంటి ఫైల్స్‌ను చూసేందుకు కూడా మూడు వారాల సమయం తీసుకోవడం దేనికి సంకేతం? ఇదెక్కడి వేగవంతమైన పరిశీలన? ఇది అలసత్వం, అడ్డగోలు నిర్లక్ష్యం కిందకు రాదా? అని ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.


పార్కింగ్‌లో 3154 ఫైళ్లు..

ఏ ప్రభుత్వ శాఖ అయినా, ఎలాంటి ఫైల్‌ అయినా వారం రోజుల్లోగా సెటి ల్‌ చేయాలి. పెండింగ్‌ పెట్టరాదు. ఇది నిబంధన. కానీ ఇది రెవెన్యూకు వర్తించదన్నట్లుగా సచివాలయంలోని సెక్షన్‌ స్థాయి నుంచి అదనపు కార్యదర్శి వరకు అధికారులు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వద్ద కేవలం రెండు ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే, దిగువ స్థాయులో అంటే, అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి( ఏఎ్‌సఓ), సెక్షన్‌ అధికారి (ఎస్‌ఓ), అసిస్టెంట్‌ సెక్రటరీ( ఏఎస్‌), డిప్యూటీ సెక్రటరీ( డీఎస్‌), జాయింట్‌ సెక్రటరీ( జేఎస్‌), అదనపు కార్యదర్శిల స్థాయిలో అధికారులు 3,154 ఫైళ్లు పార్కింగ్‌ చేశారు. ఇవి కేవలం నాలుగు నెలల గణాంకాలే. అందులో అన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ ఫైళ్లపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా అధికారులు తమ లాగిన్‌లలో ఎందుకు పార్కింగ్‌లో ఉంచారు? అంటే, ఆ ఫైళ్లతో సంబంధం ఉన్న ప్రైవేటు వ్యక్తులు, రైతులు, ఉద్యోగులు వచ్చి కలవాలని ఆపారా? లేక కారణాలేమిటి? పదో, వందో కాదు..ఏకంగా వేలాది ఫైళ్లు ఎందుకు ఆపారు? ఐటీ కార్యదర్శి గణాంకాల ప్రకారం, ఇందులో రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల విజిలెన్స్‌, ఏసీబీ, సర్వీసు ఫైళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అంటే, ఆ ఫైళ్లతో సంబంధం ఉన్నవారు వచ్చి కలిస్తే తప్ప వాటిని ఈ-ఆఫీస్‌ లాగిన్‌ నుంచి బయటకు తీయరా? పరిష్కరించరా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయు.


సీఎం హెచ్చరిస్తున్నా...

కార్యదర్శుల స్థాయిలో ఫైళ్ల పరిష్కారంపై సమీక్ష జరగాలని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. దీని ప్రకారం అధికారులు తమ శాఖ పరిధిలో పెండింగ్‌ ఫైళ్లపై దృష్టిపెట్టాలి. ఏ ఫైల్‌ ఎందుకు ఆపారు? ఎంతకాలం పెండింగ్‌లో ఉందో ఆరాతీస్తే రెవెన్యూలో వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉండేవి కావని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయు. కాగా, అసలు రెవెన్యూశాఖ రోజువారీగా ఫైళ్లు చూడనంతగా ఇతర బిజీ పనులు ఏం చేస్తోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయు. ఉన్నతస్థాయిలోనే ఒక ఫైల్‌ను ఓపెన్‌ చేయడానికి మూడు వారాల సమయం తీసుకుంటే.. ఇక జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పరిస్థితి ఏమిటనేది ఊహించుకోవ చ్చు. ఇదిలా ఉంటే, కొన్ని వేల ఫైళ్లను రెవెన్యూ శాఖ అధికారులు ఈ-ఆఫీస్‌ పార్కింగ్‌లో ఉంచారు. ఏ నిర్ణయం తీసుకోకుండా, తిరస్కరించకుండా తమ లాగిన్‌లోనే ఉంచుకోవాడాన్ని పార్కింగ్‌ అని పిలుస్తున్నారు.


కీలక శాఖలదీ ఇదే పరిస్థితి

ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తక్షణమే స్పందించాల్సిన శాఖల్లో రెవె న్యూతో పాటు పోలీసు, విపత్తుల నిర్వహణ విభాగం, ఇంధన ( విద్యుత్‌) శాఖ, ఇంకా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. వీటిల్లోనూ సచివాలయ స్థాయిలో వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఇంధన శాఖకు స్పెషల్‌ సీఎ్‌సగా ఉన్నారు. సీఎస్‌ కార్యాలయానికి వచ్చిన ఫైళ్లను ఒక్క రోజులోనే సెటిల్‌ చేస్తూ సీఎస్‌ ముందు వరసలో ఉంటే, ఆయన నే తృత్వంలోని ఇంధన శాఖలో సగటున ఒక ఫైల్‌ చూసేందుకు 23 రోజుల 16:10 గంటల సమయం తీసుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. విద్యుత్‌ సరఫరా, నిర్వహణ, కొనుగోళ్లు, కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగుల వ్యవహారాలు ఇందులో అనేకం ఉంటాయి. ఈ శాఖలో 301 ఫైళ్లు సచివాలయ స్థాయిలో పార్కింగ్‌ చేసి ఉంచారు. శాంతి భద్రతలు, ప్రజా రక్షణలో హోంశాఖది కీలకపాత్ర. సచివాలయ స్థాయిలో ఈ శాఖకు వచ్చే ఒక ఫైలు చూసేందుకు సగటున 13 రోజుల 10:18 గంటల సమయం పడుతోంది. ఇందులోనూ 326 ఫైళ్లు పార్కింగ్‌లో ఉంచారు. గ్రామాలతో ముడిపడిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 2012 ఫైళ్లు పార్కింగ్‌లో ఉంచారు.


ఒక ఫైలు చూసేందుకు సగటున 24 రోజుల 20:54 గంటల సమయం తీసుకుంటున్న ఘనత ఈ శాఖదే. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు తక్షణమే స్పందించాల్సింది విపత్తుల నిర్వహణ శాఖ. సచివాలయ స్థాయిలో సగటున ఒక ఫైల్‌ తెరచి చూసేందుకు ఆ శాఖ 10 రోజుల 17:46 గంటల సమయం తీసుకుంటోంది. ఇదీ ఆ శాఖ స్పందనా వేగం. వైద్య, ఆరోగ్యశాఖ అనేది అత్యవసరమైన విభాగం. సచివాలయంలో ఈ శాఖకు ఒక ఈ-ఫైల్‌ వెళ్తే దాన్ని తెరిచి చూసేందుకు సగటున 11 రోజుల 4:05 గంటల సమయం తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ రైతాంగానికి అత్యంత కీలకమైన ది. ఆ శాఖకు ఫైలు వెళ్తే దాన్ని ఓపెన్‌ చేయడానికి సగటున 18 రోజుల 1:27 గంటల సమయం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించిన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. కానీ, సచివాలయ స్థాయిలో ఉన్నత విద్యాశాఖకు వచ్చే ఫైలును ఈ-ఆఫీసులో చూసేందుకు 15 రోజుల 19:41 గంటలు, పాఠశాల విద్యలో 16 రోజుల 12:37 గంటల సమయం తీసుకుంటున్నారు.


అట్టడుగున పరిశ్రమల శాఖ

రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి సాధించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తోంది. కానీ, ఈ శాఖకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారం సచివాలయం స్థాయిలో నత్త కంటే వెనకబడిపోయింది. ఈ-ఆఫీస్‌ ఫైల్‌ను చూసేందుకు గరిష్టంగా 27 రోజుల, 18:18 గంటల సమయం తీసుకుంటున్నారు. 1484 ఫైళ్లను పార్కింగ్‌లో ఉంచారు.

Updated Date - Dec 12 , 2025 | 05:24 AM