CM Chandrababu: రెవెన్యూ అంటేనే బ్యాడ్
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:27 AM
రెవెన్యూ శాఖ అంటేనే బ్యాడ్! ఆ శాఖపై జనాలకు క్రెడిబిలిటీ లేదు. పనిచేసినా గుర్తింపు రావడం లేదు. అని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు.
జనాలకు అలాంటి అభిప్రాయం ఉంది
పనిచేసినా మంచి గుర్తింపు రావట్లేదు
భూవ్యవహారాలు గోల్‌మాల్ చేస్తే ఊరుకోం
అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెడతాం
పాస్ పుస్తకాలు నేరుగా ఇంటికే కొరియర్
జనవరి 15 లోగా అన్ని ఫైళ్లూ ఆన్‌లైన్‌లోకి..
బాధితులకు రియల్‌టైమ్‌లో న్యాయం: సీఎం
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘రెవెన్యూ శాఖ అంటేనే బ్యాడ్! ఆ శాఖపై జనాలకు క్రెడిబిలిటీ లేదు. పనిచేసినా గుర్తింపు రావడం లేదు.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. లింకు డాక్యుమెంట్లను డేటా వేర్‌హౌసింగ్‌లో, సాధారణ డాక్యుమెంట్లను మెయిన్ క్లౌడ్‌లో ఉంచుతున్నామని సీఎం చెప్పారు. ‘‘2019-24లో నాయకులకు భూమిపై దురాశ పెరిగింది. భూమి కావాలని అడగడం, అడ్డం తిరిగితే 22ఏ కింద పెట్టేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల భూమి జోలికి రాదు. ఎవరైనా గోల్‌మాల్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం. ఫిర్యాదు, సేవల దరఖాస్తులు ఆన్‌లైన్ చేస్తున్నాం. వీఆర్‌వో ద్వారా రాలేదు... సచివాలయం నుంచి రాలేదు అని చెప్పడానికి లేదు. 22 ఏ ఫిర్యాదులను సర్వే చేసి సెటిల్ చేయాలి. జాయింట్ ఎల్‌పీఎం ఏడాదిలోగా పరిష్కరించాలని చెప్పాం. వీటికోసం ఒక జేసీని ప్రత్యేకంగా నియమిస్తాం. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేయాలి. సెక్యూరిటీ ప్రెస్ నుంచే నేరుగా లబ్ధిదారులకు చేరవేసే విఽఽధానం తెస్తాం. పాసుపోర్టుల తరహాలో, రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ కూడా కొరియర్‌లో పంపిస్తాం. 22 ఏ కింద నమోదైన చాలా ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి జనవరి చివరి నాటికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.’’ అని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం చెప్పినట్లు... అనకాపల్లి, విశాఖ, విజయనగరం, ఇతర ప్రాంతాల్లో కబ్జాలు, భూరికార్డుల్లో మార్పులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్....’ లక్ష్యమిదే..
‘‘పోలీసు శాఖ సహా అన్ని వ్యవస్థలకు సంబంధించిన ఫైళ్లు జనవరి 15 నుంచి ఆన్‌లైన్‌లోకి రావాలి. ఈ లోగా అన్ని సేవలు ఆ దిశగా కదలాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సలో భాగంగా ఎస్ర్కో ఖాతా తెచ్చాం. ఏ వ్యాపారం చేయాలన్నా సజావుగా చేసుకోవచ్చు. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. అంటే బాధితులకు న్యాయం రియల్‌టైమ్‌లో చేయగలగాలి. తప్పు చేయాలంటే భయపడాలి. పోలీసులు రౌడీల చొక్కా పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలి.’’ అని సీఎం ఆదేశించారు. శాంతిభద్రతల్లో చాలా గట్టిగా ఉంటామని, రౌడీయిజం చేస్తే కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో మార్పులు తెచ్చామని తెలిపారు. ‘‘కలెక్టర్లు ఆరు మెరుగైన విధానాలిచ్చారు. 18 నెలల్లో అసాధారణ పనితీరు కనబర్చాం. అదేపనిగా సమస్యలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలి. కావాలని వ్యక్తిగత హననానికి పూనుకుంటే కఠినంగా వ్యవహరించండి.’’ అని చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో రూ.32,166 కోట్ల టారిఫ్ పెంచారని, రూ.81,722 కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.11,320 కోట్ల మేర అప్పు తగ్గించామని, రూ.1,1,4352 కోట్ల అప్పు మిగిలి ఉందని వివరించారు. వైసీపీ హయాంలో 11 నుంచి 13 శాతం వడ్డీకి అప్పులు తీసుకురాగా, తామొచ్చిన తర్వాత అప్పులను పునర్‌వ్యవస్థీరణ చేశామన్నారు. 9 శాతం కంటే తక్కువ వడ్డీకే అప్పులు తీసుకురమ్మని అధికారులకు చెప్తున్నానన్నారు. పీపీపీ విధానంలో వచ్చే వైద్య కాలేజీలు ప్రభుత్వ ఆస్తే గానీ ప్రైవేటు ఆస్తి కావని వివరించారు. కొత్త వైద్య కాలేజీలతో సీట్లు పెరుగుతాయని, ఫీజులు పెరగబోవని తెలిపారు. నిర్ణీత సమయం తర్వాత అవి తిరిగి ప్రభుత్వానికే చెందుతాయని, 100 శాతం ఎన్టీఆర్ వైద్యసేవ ప్రకారమే ఆ కాలేజీల్లో చికిత్స అందుతుందని, రెండేళ్లలోనే అవి పూర్తవడం ప్రజలకు మంచి చేస్తుందని సీఎం అన్నారు.
పది నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్... మంగళగిరిలో ఓ వ్యక్తి అనుభవం
సదస్సులో స్వయంగా పంచుకున్న సీఎం
రిజిస్ర్టేషన్ల శాఖకు జాతీయ అవార్డుపై అభినందన
ఏపీ రిజిస్ర్టేషన్ శాఖకు జాతీయస్థాయి అవార్డు వచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో తెలిపారు. ఏపీలో కేవలం 10నిముషాల్లోనే రిజిస్ర్టేషన్ సేవలు పూర్తిచేసినందుకుగానూ ఈ అవార్డు లభించిందంటూ ఆ శాఖ అధికారులను సీఎం ప్రశంసించారు. ‘అవార్డు వచ్చినట్టు మెసేజ్ రూపంలో నాకు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. సాధారణంగా ఆఫీసుల్లో ఒక డాక్యుమెంట్ రిజిస్ర్టేషన్ జరగాలంటే రోజులకు రోజులు పడుతున్న సమయంలో.. మీ రాష్ట్రంలో పది నిమిషాలకే ఆ ప్రక్రియను పూర్తి చేయడం గొప్ప సంగతి అంటూ.. ఆ మెసేజ్‌లో పేర్కొన్న విషయం చూసి సంతృప్తి కలిగింది. అన్ని కాదుగానీ, కొన్ని రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో, అక్కడ నిర్వహణలో ఉన్న వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటినీ మనం అధిగమించగలమన్న విశ్వాసం నాకుంది’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి రాసిన కామెంట్‌ను చదివి వినిపించారు. మంగళగిరిలో ఓ వ్యక్తి మధ్యాహ్నానికి ముందు రిజిస్ర్టేషన్ ఆఫీసుకు వెళ్లి 10 నుంచి 12 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత భోజనం చేసే లోగానే డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని అతనికి సమాచారం అందింది’’ అని సీఎం చెప్పారు. ఇలాంటి స్పీడ్ ఆఫ్ డెలివరీ విధానం అన్నిచోట్లా రావాలని సీఎం ఆకాంక్షించారు.