Revenue Department: మేమే ఆపాం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:44 AM
చట్టబద్ధమైన డిజిటల్ భూముల రికార్డుల వ్యవస్థ మీ-భూమి పోర్టల్ నుంచి గ్రామ అడంగల్‌ను తామే తొలగించామని రెవెన్యూ శాఖ అంగీకరించింది.
మీ-భూమిలో గ్రామ అడంగల్ తొలగించాం
వైబ్‌సైట్‌లో ఈ ఏడాదే బ్లాక్ చేశాం.. అంగీకరించిన రెవెన్యూ శాఖ
అన్నీ డొంకతిరుగుడు సమాధానాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
చట్టబద్ధమైన డిజిటల్ భూముల రికార్డుల వ్యవస్థ మీ-భూమి పోర్టల్ నుంచి గ్రామ అడంగల్‌ను తామే తొలగించామని రెవెన్యూ శాఖ అంగీకరించింది. డేటా దోపిడీని అడ్డుకునేందుకు, పైరసీదారులకు సమాచారం చిక్కకుండా ఉండేందుకే వెబ్‌సైట్ నుంచి గ్రామ అడంగల్ ఆప్షన్‌ను తొలగించినట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ), రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ జి. జయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు ప్రవేశపెట్టిన నూతన మాడ్యూలు, బల్క్ డౌన్‌లోడ్ వల్ల సర్వర్‌పై ఎక్కువ భారం పడి మీ-భూమి యాక్సెస్ మందగించిందని, బల్క్ డౌన్‌లోడ్‌ల ప్రక్రియను నిలిపివేశామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో కొన్ని అనుమానాస్పద ప్రైవేటు యాప్‌లు, అనధికారిక వెబ్‌సైట్‌లు మీ-భూమి నుంచి మొత్తం డేటా సెట్లను కాపీ చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బల్క్ డౌన్‌లోడ్ అంశాన్ని మీ- భూమిలో ప్రారంభిస్తే మళ్లీ డేటా దుర్వినియోగం అవుతుందనే కారణంతో నిరోధించామని.. బల్క్ డౌన్‌లోడ్ వల్ల డేటా దుర్వినియోగం, ప్రయోజనానికి మించిన ప్రమాదం ఉన్నట్టు జయలక్ష్మి తన వివరణలో పేర్కొన్నారు.
అంతా డొల్ల సమాధానమే
మీ-భూమిలో గ్రామ అడంగల్‌ను ప్రజలకు అందుబాటులో లేకుండా బ్లాక్ చేయడానికి డేటా దోపిడీనే కారణమని సీసీఎల్‌ఏ చెప్పడం విచిత్రంగా ఉంది. జగన్ ప్రభుత్వంలో విలువైన ప్రభుత్వ, అసైన్‌మెంట్, షరతుగల, ఇనాం, గ్రామకంఠం భూములను నచ్చిన వారికి కట్టబెట్టే కుట్రతో మీ-భూమిలో గ్రామ అడంగల్‌ను కొంతకాలం పాటు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ లోపాన్ని గుర్తించి వెంటనే సరిచేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కనిపెట్టేందుకు గ్రామ అడంగల్ ఉపయోగపడింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ బ్లాక్‌చేశారు. ఒకవైపు రాష్ట్రం క్లౌడ్ కంప్యూటింగ్‌లో దూసుకుపోతోంది. సైబర్ సెక్యూరిటీలో రాణిస్తోంది. కీలకమైన రెవెన్యూ సేవలను వాట్సప్ ద్వారా ప్రజలకు అందిస్తోంది. అలాంటిది కొన్ని యాప్‌లు బల్క్ డౌన్‌లోడ్‌లు చేశాయని, అందుకే మీ-భూమి నుంచి అడంగల్‌ను నిరోధించామని చెప్పడం వింతగా ఉందని రెవెన్యూ, టెక్ నిపుణులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన పని బయటపడటంతో దానికి సాంకేతిక సమస్యలను అంటగట్టి ఇందులో శాఖాపరమైన తప్పులేదని చెబుతున్నట్లుగానే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైబర్ దాడి కారణంగా ప్రజల డేటాను ఆపేశామంటే, ఇక మీ- భూమి వెబ్‌సైట్ నిర్వహణ ఎందుకు? ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టమైన పారదర్శకత, పౌరసేవలు, సురక్షిత డిజిటల్ డేటాకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే డేటా దోపిడీ జరిగిపోతోందని, దాన్ని అడ్డుకోలేక అనేక ఆప్షన్‌లను నిలిపివేశామని చెప్పడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.