Revenue Department: రైతుకు తప్పనున్న తిప్పలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:35 AM
భూ వ్యవహారాలకు సంబంధించిన ఆధార్ సేవల నిర్ధారణకు వినియోగదారుల సేవల సంస్థ (యూజర్ ఏజెన్సీ)గా రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎంపికైంది. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ(యూఐఏ)...
ఆధార్ యూజర్ ఏజెన్సీగా రెవెన్యూ శాఖ
భూమి రికార్డుల నిర్వహణ, అనుసంధానం కోసం కేంద్రం ఎంపిక
నోటిఫికేషన్ జారీచేసిన రాష్ట్రప్రభుత్వం
అథెంటికేషన్ కోసం ప్రైవేటు ఏజెన్సీల చుట్టూ ఇక తిరగక్కర్లేదు
రెవెన్యూ ఆఫీసుల్లోనే ఆధార్ సేవల కేంద్రం అక్కడే ఐరిస్, అథెంటికేషన్
వెబ్‌ల్యాండ్‌లోని రైతు భూరికార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం
అమరావతి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భూ వ్యవహారాలకు సంబంధించిన ఆధార్ సేవల నిర్ధారణకు వినియోగదారుల సేవల సంస్థ (యూజర్ ఏజెన్సీ)గా రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎంపికైంది. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ(యూఐఏ), కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖను భూముల సంబంధిత వ్యవహారాల్లో ఆధార్ యూజర్ ఏజెన్సీగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవోలు 309, 310) జారీ చేసింది. దీంతో ఆధార్‌తో భూముల అనుసంధాన ప్రక్రియలో రెవెన్యూ శాఖ పాత్ర మరింత కీలకం కానుంది. ప్రస్తుతం ఆధార్ నిర్ధారణ యూజర్ ఏజెన్సీలు.. ప్రైవేటు సంస్థలు, ఏజెన్సీల చేతుల్లో ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో రైతుల వివరాలు, ఆధార్‌ను సీడింగ్ చేయాలంటే తొలుత ప్రైవేటు ఏజెన్సీ వద్దకు వెళ్లి ఐరిస్ డేటా ఇస్తున్నారు. ఆధార్ అథెంటికేషన్ ప్రైవేటుగా చేయాల్సి వస్తోంది. దీనివల్ల రికార్డుల సవరణ, ఇతర అంశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆధార్ అనుసంధానం కాలేదన్న పేరుతో రైతులకు పంటల బీమా, పంటల పెట్టుబడి వంటి సంక్షేమ పథకాలు కూడా సకాలంలో దక్కడం లేదు. ఆధార్ సీడింగ్ జరగడం లేదని ఇటీవలి కాలంలో కొన్ని వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ స్కీం కింద పంట పెట్టుబడి జమకాలేదు.
దీంతో రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న వెబ్‌ల్యాండ్‌లోని భూమి రికార్డులకు ఆధార్ అనుసంధాన పనులను ఇకపై పూర్తిస్థాయిలో ఆ శాఖ చేస్తేనే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకుతుందని అధికారులు భావించారు. అందుకే భూముల వ్యవహారాల్లో ఆధార్ నిర్ధారణ సేవలను చేపట్టేందుకు యూజర్ ఏజెన్సీగా ఆ శాఖనే ఎంపిక చేయాలని కేంద్రాన్ని, యూఐఏని కోరారు. రెవెన్యూ శాఖ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడంతో దానికి బాధ్యతలు అప్పగిస్తూ యూఐఏ, కేంద్రం ఆదేశాలిచ్చాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సేవలను కొనసాగించేందుకు రెవెన్యూ శాఖ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సహకారం తీసుకోనుంది. తాజా నిర్ణయంతో ప్రతి తహశీల్దార్ కార్యాలయం పరిధిలోనే రైతులు, భూయజమానుల కోసం ఆధార్ సేవల కేంద్రం ఏర్పాటు కానుంది. ఇది అమల్లోకొస్తే, మండల రెవెన్యూ కార్యాలయాల్లోనూ వెబ్‌ల్యాండ్‌లో రైతుల భూములకు వారి ఆధార్‌ను అనుసంధానం చేస్తారు. దీనివల్ల రైతులు ప్రైవేటు ఏజెన్సీల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఈ సేవలందించేందుకు రెవెన్యూ శాఖ చట్టబద్ధమైన ఫీజులు వసూలు చేస్తుంది.
రైతు ఏం చేయాలి..?
రైతుల భూములకు ఆధార్ అనుసంధానం ఇప్పుడు తప్పనిసరైంది. సెంటు భూమి ఉన్నా దాని రికార్డుతో రైతు ఆధార్ అనుసంధానం చేయాలి. తాజా పరిణామాలతో రైతులు మండల రెవెన్యూ ఆఫీసులకు వెళ్లినప్పుడు తమ భూమి రికార్డుతో ఆధార్ అనుసంధానం కోరుతూ దరఖాస్తు ఇవ్వాలి. ఆ వెంటనే అక్కడి అథెంటికేషన్ కేంద్రంలో సంబంధిత రైతు వేలిముద్రలు, ఐరి్‌సడేటా తీసుకుంటారు. ఆధార్ డేటాను సరిపోల్చి రైతు ఆధార్ నంబర్‌ను వెబ్‌ల్యాండ్‌లోని భూమి రికార్డుతో అనుసంధానం చేస్తారు. రానున్న రోజుల్లో దీనిని మరింత సులభమైన ప్రక్రియగా మారుస్తామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.