Share News

Revenue Department: రెవెన్యూ రచ్చ

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:20 AM

ఆనాడు జగన్‌ ప్రభుత్వం భూముల రీ సర్వే పేరిట ఊరూరా భూ వివాదాలు సృష్టించింది. భూముల సర్వేలో జరిగిన తప్పులు, ఉద్దేశపూర్వక తప్పిదాల వల్ల రైతుల కాలికింద నేల కదిలిపోయింది.

 Revenue Department: రెవెన్యూ రచ్చ

  • భూసమస్యల పరిష్కారానికి జనం ఎదురుచూపులు

  • జగన్‌ ప్రభుత్వ హయాంలో భారీగా ఫ్రీహోల్డ్‌ అక్రమాలు

  • రెవెన్యూ శాఖ తీరుతో వాటికి మరిన్ని పీటముడులు

  • ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

  • టాస్క్‌ఫోర్స్‌ వేయాలని సీఎం చెప్పి 8 నెలలు

  • అయినా రెవెన్యూశాఖలో స్పందన శూన్యం

  • 3సార్లు భేటీ అయినా ఏమీ తేల్చని ఉపసంఘం

  • ఇంత కాలమైనా ఏమిటీ నాన్చుడు?

  • జగన్‌బొమ్మ పాస్‌ పుస్తకాల సంగతేమిటి?

  • రైతులకు రుణం తిరస్కరిస్తున్న బ్యాంకులు

  • అయోమయంలో ప్రజలు, హక్కుదారులు

  • నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష

  • భూ సమస్యలను నాటి వైసీపీ ప్రభుత్వం మరింత జటిలం చేసేసింది. కొత్త ప్రభుత్వమైనా వాటిని పరిష్కరిస్తుందేమో అని జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఎప్పుడూ సమస్యలు ఉంటేనే తమకు పని ఉంటుందనుకునే బ్యూరోక్రాట్లు ఈ వ్యవహారాన్ని తేల్చడానికి సుముఖంగా లేరు. వెరసి.. రాష్ట్రంలో భూసమస్యలు రావణకాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. ఇటు ఫ్రీహోల్డ్‌ అంశానికి పరిష్కారం దొరక్క, పాస్‌పుస్తకాలు చేతికి రాక, అటు బ్యాంకు రుణాలు అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి శుక్రవారం రెవెన్యూశాఖపై నిర్వహించే సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

  • జగన్‌ హయాంనాటి అసైన్డ్‌ అక్రమాలను రెవెన్యూ శాఖ నిర్ధారించింది. ఇక బాధ్యులైన నేతలు, అధికారులు, కబ్జాకోరులపై సర్కారు చర్యలు తీసుకోవడమే తరువాయి అని అంతా భావించారు. కానీ, ఈ దిశగా అడుగులే పడలేదు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించి ఎనిమిది నెలలైనా అధికారుల్లో కదలిక లేదు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏమీ తేల్చకుండా నాన్చుతోంది. అక్రమంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములను పక్కనపెట్టి.. అసలైన హక్కుదారులవద్ద ఉన్న భూములకు స్వేచ్ఛ కల్పించాలన్న విన్నపాలను పట్టించుకోవడంలేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆనాడు జగన్‌ ప్రభుత్వం భూముల రీ సర్వే పేరిట ఊరూరా భూ వివాదాలు సృష్టించింది. భూముల సర్వేలో జరిగిన తప్పులు, ఉద్దేశపూర్వక తప్పిదాల వల్ల రైతుల కాలికింద నేల కదిలిపోయింది. విస్తీర్ణాల్లో తేడాలు వచ్చాయి. హక్కుదారులు, సాగుదారుల పేర్లు, విస్తీర్ణాలు మారిపోయాయి. సర్వే నంబర్లు ఇష్టానుసారంగా మార్చేశారు. ఫలితంగా సరిహద్దు వివాదాలు చెలరేగాయి.


రీ సర్వేను అడ్డంపెట్టుకొని కొందరు వైసీపీ నేతలు కన్నుబడ్డ ప్రైవేటు, ప్రభుత్వ భూములను చేజిక్కించుకున్నారు. రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి కీలకమైన ఇనాం, ఎస్టేట్‌, ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను తారుమారు చేశారు. ఆ తర్వాత జగన్‌ బొమ్మలతో కూడిన పాసుపుస్తకాలను రైతులకు అంటగట్టారు. ఈ సమస్యలు సరిపోవని వివాదాస్పద ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. అందులోని అంశాలతో రైతులు బెంబేలెత్తిపోయారు. ఇలా జగన్‌ జమానాలో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం-1977(పీవోటీ యాక్ట్‌)ను సవరించిన జగన్‌ సర్కారు, 20 ఏళ్ల అసైన్‌మెంట్‌ కాలపరిమితి దాటిన భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించి స్వేచ్ఛ కల్పిస్తామని (ఫ్రీ హోల్డ్‌), వాటిపై శాశ్వత హక్కులు కల్పిస్తామని ఆదేశాలు (జీవో 596) ఇచ్చింది. దీన్ని అడ్డంపెట్టుకొని 13.80 లక్షల ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించారు. ఇక, 5.75 లక్షల ఎకరాలను చట్టవిరుద్దంగా, జీవో 596ని ఉల్లంఘించి మరీ ఫ్రీహోల్డ్‌ చేశారు. ఇందులో 2.65 లక్షల ఎకరాల భూమికి అసైన్‌మెంట్‌ రికార్డు లేకున్నా నిషేధ జాబితా నుంచి తొలగించారు. అడ్డగోలుగా 22(ఏ) నుంచి తొలగించిన భూముల్లో ఇనాం, గ్రామ కంఠం, చుక్కల భూములు, షరతుగల పట్టా భూములు ఉన్నాయి. ఇందులో వైసీపీ నేతల కబంధహస్తాల్లో ఉన్న భూములే సింహభాగం ఉన్నాయని అధికారవర్గాల అంచనా. ఈ సమస్యలే జగన్‌ అధికారానికి పాతరేశాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజల భూ సమస్యలను పరిష్కరిస్తామని నాడు కూటమి నేతలు హామీ ఇచ్చారు.


వడివడిగా మొదలై...

కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, ఘోరాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇచ్చిన మాట మేరకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దుచేశారు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రీసర్వేతో వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తారని ఎదురుచూశారు. ఇంతలో ఫ్రీ హోల్డ్‌ అయిన అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లను సర్కారు గత ఆగస్టులో నిలిపివేసింది. అసైన్డ్‌ అక్రమాలపై విచారణకు ఆదేశించింది. 3 నెలల్లో విచారణ పూర్తిచేయాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. అక్రమాలు ఏ మేరకు జరిగాయో విచారణలో తేలింది. 13.80 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేస్తే, అందులో 5.75 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధజాబితా నుంచి బయటపడేశారని గుర్తించారు. ఏఏ స్థాయిలో నిబంధనల ఉల్లంఘన, చట్టవిరుద్ధమైన పనులు జరిగాయో రెవెన్యూశాఖ గత ఏడాది డిసెంబరు నెలాఖరు కే నిర్ధారించింది. కానీ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్‌ భూములపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


నాన్చుడే..

అసైన్డ్‌ అక్రమాలు నిర్ధారణయిన తర్వాత బాధ్యులైన నేతలు, అధికారులు, కబ్జాకోరులపై సర్కారు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ దిశగా చర్యలు లేవు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గత ఏడాది డిసెంబరులో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూశాఖను ఆదేశించారు. 8 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు టాస్క్‌లేదు...ఫోర్స్‌ కూడా లేదు. దీంతో అసైన్డ్‌ అక్రమాలకు పాల్పడిన కబ్జాదారులు, తప్పులు చేసిన అధికారులు సేఫ్‌గా ఉన్నారు. ఇక మాకేం కాదన్న ధీమాలోకి వెళ్లిపోయారు. కనీసం ఈ ఏడాది మార్చి నెలనాటికయినా ప్రీ హోల్డ్‌ రిజిస్ట్రేషన్‌లపై సర్కారు నిర్ణయం తీసుకుంటుందన్న సానుకూల ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా ప్రభుత్వం ఈ విషయంపై మంత్రివర్గ ఉపసఘం ఏర్పాటు చేసింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉపసంఘం ఇప్పటి వరకు మూడుసార్లు భేటీ అయింది. జిల్లా కలెక్టర్ల సమావేశాలు, ఇతర సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలపై చర్చ తప్ప నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఫ్రీ హోల్డ్‌ భూములపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అప్పటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తొలి భేటీలోనే కీలక నివేదిక ఇచ్చారు. ఒక వేళ ఫ్రీహోల్డ్‌ విధానం కొనసాగించవద్దని భావిస్తే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కానీ ఉపసంఘం ఎలాంటి క్రియాశీల నిర్ణయం తీసుకోలేదు. ఫ్రీ హోల్డ్‌నే కొనసాగించాలనుకుంటే ఎలాంటి భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలి? ఆ భూముల రికార్డులను ఎలా పరిశీలన చేసి నిర్ధారించాలి? ఇప్పటిదాకా అక్రమాలు జరిగాయని నిర్ధారించిన భూముల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే అనేక ప్రతిపాదనలు ఉపసంఘం ముందుకొచ్చినా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఉపసంఘం భేటీలు ప్రజలను ఉసూరుమనిపించేలా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఆగస్టు 5 నాటికి ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ఏడాదవుతుంది. ఇప్పుడు ఇంకా నాన్చుతూనే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజల్లో అసహనం పెరిగి, తీవ్ర వ్యతిరేకతకు దారితీయొచ్చని కూటమి వర్గాలే చెబుతున్నాయి.


పేదల్లో ఆందోళన

ఫ్రీ హోల్డ్‌ భూముల్లో అక్రమాలు జరిగినవి ఏమిటో లెక్క తేలింది. ఇందులో కబ్జాదారులు, నేతల పాత్ర ఉన్న భూములపై కూడా స్పష్టత వచ్చింది. అక్రమంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములను పక్కనపెట్టి, అసలైన హక్కుదారుల వద్ద ఉన్న భూములకు స్వేచ్ఛ కల్పించాలని పార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. నిషేధ విముక్తి కోరుతూ శాశ్వత హక్కులు అడుగుతున్న రైతుల విన్నపాలు నిజమైనవో కావో తేల్చడానికి రెవెన్యూశాఖకు పెద్ద సమయం పట్టదు. ఇందుకు అసైన్‌మెంట్‌ రికార్డులను పరిశీలిస్తే సరిపోతుంది. ఆ మేరకు నిజమైన అసైనీల భూములకు చట్టప్రకారం ఫ్రీహోల్డ్‌ అయ్యే అవకాశాన్ని కల్పించాలని రైతులు కోరుతున్నారు. అక్రమాలతో ముడిపడిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని, అర్హులైనవారి భూములకు స్వేచ్ఛ కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం ఉన్నా అది కార్యరూపం దాల్చడం లేదు.


ఆదేశాలు ఎందుకు అమలు కాలేదు?

ఆరా తీయనున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి రెవెన్యూశాఖపై శుక్రవారం నిర్వహించే సమావేశంలో ఫ్రీహోల్డ్‌ అంశం చర్చకు రానుంది. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు తానిచ్చిన ఆదేశాల అమలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం, నేటికీ రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందించకపోవడం వంటి అంశాలపై ఆయన ఆరా తీయనున్నారు. నిజానికి రైతులకు మే నాటికే జగన్‌ బొమ్మలు లేని, రాజముద్ర కలిగిన పాస్‌పుస్తకాలు అందిస్తామని రెవెన్యూశాఖ హామీ ఇచ్చింది. కానీ వాయిదాపడుతూ వస్తోంది. జగన్‌ బొమ్మ ఉన్న పాస్‌ పుస్తకాలను మార్పిడి చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో పంట రుణాలు దొరకడం గగనంగా మారింది. సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారనే ప్రశ్నకు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పొంతనలేని సమాధానం ఇస్తున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 02:25 AM