Share News

Revenue Department: రెవెన్యూ మార్క్‌ న్యాయం

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:38 AM

మండల రెవెన్యూ అధికారులు తన భూమిని వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లోకి ఎక్కించడం లేదని, తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ మనస్తాపానికి గురైన రైతు ఆరేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుపై నాటి జగన్‌ ప్రభుత్వం...

 Revenue Department: రెవెన్యూ మార్క్‌ న్యాయం

  • తహసీల్దార్‌ సోమ్లానాయక్‌ సేఫ్‌

  • రైతు ఆత్మహత్యకు ఆయన కారణం కాదట

  • చర్యలొద్దని స్పెషల్‌ సీఎస్‌ సిఫారసు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మండల రెవెన్యూ అధికారులు తన భూమిని వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లోకి ఎక్కించడం లేదని, తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ మనస్తాపానికి గురైన రైతు ఆరేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుపై నాటి జగన్‌ ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి ఇద్దరు మండల తహశీల్దార్లపై సమగ్ర విచారణ జరిపించింది. ఏళ్ల తరబడి సా..గిన ఈ విచారణ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులకు విముక్తి లభించింది. రైతు ఆత్మహత్యకు నాటి తహసీల్దార్‌ సోమ్లానాయక్‌ కారణం కాదని రెవెన్యూ శాఖ తీర్పు ఇచ్చేసింది. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మరి ఆ రైతు ఆత్మహత్యకు కారణమెవరో రెవెన్యూ శాఖ నిగ్గుతేల్చలేదు. రైతుకు న్యాయంగా, చట్టబద్ధంగా జరగాల్సిన పని ఎందుకు జరగలేదు.. అందుకు బాధ్యులైన అధికారులెవరో తేల్చనేలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలానికి చెందిన రైతు నడిపినేని రత్తయ్య తన భూమిని మ్యుటేషన్‌ చేయాలని.. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తాజాపరచాలని 2019 జూలైకి ముందు అనేక దఫాలు తహశీల్దార్‌ ఆఫీసు చుట్టూ తిరిగాడు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా అధికారులు వెబ్‌ల్యాండ్‌లో వివరాలను తాజాపరచలేదు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన రత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై 2019 జూలై 17న అప్పటి ప్రకాశం కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నాటి తహసీల్దార్‌.. అంతకు ముందు పనిచేసిన తహసీల్దార్లు సరైన న్యాయం చేయలేదని రైతు ఆరోపణలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


అయితే రైతు ఆత్మహత్య కారణాలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని నాటి రెవెన్యూ అధికారులు కె. రాఘవయ్య, (రిటైర్డ్‌), సోమ్లానాయక్‌(తహసీల్దార్‌) భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు నివేదించారు. వీటి ఆధారంగా అప్పటి మార్కాపురం ఆర్‌డీవోతో విచారణ చేయించారు. సోమ్లానాయక్‌పై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని ఆర్‌డీవో 2022 నవంబరు 25న ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. ఇది జరిగిన 32 నెలల తర్వాత రెవెన్యూ శాఖ ఈ కేసును తెరపైకి తెచ్చింది. రైతు రత్తయ్య ఆత్మహత్య నేపథ్యంలో తహసీల్దార్‌ సోమ్లానాయక్‌పై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున ఆయన వినతి మేరకు తదుపరి చర్యలను నిలిపివేస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమెవరనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.!

Updated Date - Aug 30 , 2025 | 04:43 AM