AP CM Chandrababu Naidu: రెవెన్యూ రాంగ్ రూటు
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:35 AM
‘కూటమి’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. జగన్ హయాంలో రైతులను, భూ యజమానులను ముప్పుతిప్పలు పెట్టిన ‘రెవెన్యూ’ను గాడిన పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు అధికారులను ఆదేశించారు.
పాత తప్పులు.. కొత్త తంటాలు
సీఎం ఆదేశించినా అదే అలసత్వం
ఏడాదిన్నరయినా పరిష్కారంకాని సమస్యలు
ప్రజా ఫిర్యాదుల్లో టాప్.. పరిష్కారంలో లాస్ట్
అక్రమార్కుల పని పట్టేందుకు ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం
పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ
తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు
పరిష్కారంపై అధికారుల ఉత్తుత్తి లెక్కలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో 200 ఎకరాల అటవీ, ప్రభుత్వ భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ప్రైవేటు ఖాతాలో వేసేశారు. అది బయటకు కనిపించకుండా ‘మీ భూమి’లో గ్రామ అడంగల్ బ్లాక్ చేశారు. అక్రమార్కులు ఆ భూమిని తమిళనాడుకు చెందిన ఓ బడా ఆసామికి అమ్ముదామనుకున్నారు. ‘సార్.. ఫలానా గ్రామంలో 200 ఎకరాల ప్రైవేటు భూమి ఉంది. నేను కొనచ్చా?’ అని సదరు ఆసామి తనకు తెలిసిన ఒక అధికారి వద్ద ఆరా తీశారు. ఆ వివరాలను ఉన్నతస్థాయిలో పరిశీలించగా.. అది అటవీ, ప్రభుత్వ భూమి అని తేలింది. వెలుగులోకి రాని ఇలాంటి చీకటి పనులు ఎన్ని ఉంటాయో?
ఐఏఎస్ కేడర్‌లో ఉన్న ఓ రెవెన్యూ అధికారి ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి రైతులు ఆయనను చుట్టుముట్టారు. ‘‘జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడూ జరుగుతున్నాయి. రీ సర్వే చేయమని మేం అడిగామా? సర్వే నంబర్లకు బదులు ఎల్‌పీఎమ్ నంబర్లు ఎందుకు ఇచ్చారు? మాకు అర్థంకానివి ఎందుకు అంటగడుతున్నారు? జాయింట్ ఎల్‌పీఎమ్‌లను సెటిల్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కటీ పరిష్కారం కాలేదు’’ అని రైతులు మూకుమ్మడిగా మండిపడ్డారు. ఆ అధికారి బదులివ్వలేకపోయారు. ‘రెవెన్యూ’పై జనంలో అసంతృప్తికి ఇదో నిదర్శనం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘కూటమి’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. జగన్ హయాంలో రైతులను, భూ యజమానులను ముప్పుతిప్పలు పెట్టిన ‘రెవెన్యూ’ను గాడిన పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు అధికారులను ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలే ఫస్ట్... అని హితబోధ చేస్తూనే ఉన్నారు. కానీ... ఆ శాఖలో మాత్రం మార్పు రావడంలేదు. రీసర్వేలో తప్పుల నుంచి ‘ఫ్రీ హోల్డ్’ దాకా... ఎక్కడి సమస్యలు అక్కడే! ప్రజా ఫిర్యాదులు, విన్నపాల పరిష్కారంలో రెవెన్యూ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఆర్టీజీఎస్ నివేదికలే చెబుతున్నాయు. ఫిర్యాదుల్లో ఈ శాఖే టాప్! వాటి పరిష్కారంలో, ప్రజల సంతృప్తిస్థాయిని పెంచడంలో మాత్రం లాస్ట్! ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధిపతి. కానీ... రెవెన్యూ శాఖ సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇందుకు ఉదాహరణ.... టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది జరిగిన తొలి కలెక్టర్ల సదస్సులో, మార్చిలో జరిగిన మరో కలెక్టర్ల సదస్సులో ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జాచేసిన వారు, అక్రమార్కులకు కొమ్ముకాసిన రెవెన్యూ అధికారులు, భూ దందాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఏడాదిన్నర అవుతున్నా ఆ శాఖ పట్టించుకోలేదు. టాస్క్ లేదు... ఫోర్స్ లేదు! దీంతో భూ అక్రమార్కులు, వారికి కొమ్ము కాసిన అధికారులు భద్రంగా ఉన్నారు. విచారణలు, చర్యల ఊసే లేదు.
కబ్జా నిరోధక చట్టం-2024 ఏమైంది?
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఏడాది నవంబరు 14న భూ కబ్జాలను నిరోధించేందుకు కొత్త చట్టం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించింది. ఏడాది దాటినా ఆ బిల్లు పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఈ బిల్లు గురించి ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలో ఆరాతీస్తున్నారు. అయినా ఫలితం లేదు. కబ్జాకోరులను కట్టడి చేసేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం పొందలేకపోయారు. ఇక భూముల కబ్జాపై వ స్తున్న పిటిషన్‌లను రెవెన్యూ శాఖ ఏం పరిష్కరిస్తుంది?
తిరస్కారమే...పరిష్కారం
రైతులు, భూ యజమానుల పట్ల చేసిన దురాగతాలు, అన్యాయాలు, అక్రమాలే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కూటమి సర్కారు వచ్చీ రాగానే గ్రామగ్రామానా రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు 2.83 లక్షల పిటిషన్లు సమర్పించారు. ఇవి కాకుండా ప్రతీ సోమవారం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అన్నీ కలిపితే... ఇప్పటికి భూ సమస్యలపైనే 4.82 లక్షలపైనే దరఖాస్తులు వచ్చాయి. మ్యుటేషన్‌లపై 98 వేలు, భూముల విస్తీర్ణంలో తేడాలపై 96 వేలు, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సరిదిద్దాలంటూ 78వేలు, ల్యాండ్‌పార్సిల్‌ను విభజించాలని 56 వేలు, పాసుపుస్తకాలే ఇవ్వలేదంటూ 33 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరించామని రెవెన్యూశాఖ సర్కారుకు నివేదించింది. కానీ, అవే అంశాలపై మళ్లీ మళ్లీ ఫిర్యాదులు రాగా, కొన్ని కేసులను తిరిగి ఓపెన్ చేశారు. అందులో రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నాయని 12,800... విస్తీర్ణంలో తేడాలపై 32,806... మ్యుటేషన్లపై 11,408 ఫిర్యాదులు ఉన్నాయి. అవి అసలు పరిష్కారమే కాలేదని రైతులు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎ్‌స)కు ఇచ్చిన వివరాల ఆధారంగా బయటపడింది. భూములు కబ్జాచే శారన్న ఫిర్యాదులు కూడా పరిష్కరించామని రెవెన్యూశాఖ రెడీమేడ్ లెక్కలు చెప్పింది. కానీ, ఆ ఫిర్యాదులను తిరిగి ఓపెన్‌చేస్తే 760కిపైగా పరిష్కారమే కాలేదని తేలింది.
ఎందుకీ దుస్థితి?
ప్రజా ఫిర్యాదులు ఎన్ని ఉన్నాయు? అందులోని అంశాలు ఏమిటి? అనేది గతంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులకు తప్ప బయటి ప్రపంచానికి తెలిసేదికాదు. ఇప్పుడు ప్రజా ఫిర్యాదులను ప్రభుత్వం ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. వాటికోసం ప్రత్యేకంగా పీజీఆర్‌ఎస్ విధానం అమలు చేస్తోంది. దీంతో గ్రామం, మండలం, జిల్లా, శాఖల వారీగా ఎన్ని పిటిషన్లు వచ్చాయి? అందులో ఎన్ని పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో అంతా ప్రజలకు తెలిసిపోతుంది. సహజంగానే పెండింగ్ పిటిషన్లు ఉన్న శాఖలు, జిల్లాల కలెక్టర్‌లు, అధికారులను ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీంతో వారిపై పీజీఆర్‌ఎస్ ఒత్తిడి ఉంటోంది. కొందరు అధికారులు, విభాగాధిపతులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక వేలాది పిటిషన్‌లను పరిష్కరించినట్లుగా చూపిస్తూ అడ్డగోలుగా మూసివేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. మూసివేసిన ఫిర్యాదులను తిరిగి విచారణ కు ఓపెన్ చేసినప్పుడు అధికారులు, శాఖల నిర్వాకం బయటపడుతోంది. ప్రభుత్వం ప్రశ్నించకూడదన్న ఏకైక కారణంగా... తిరస్కారాన్నే పరిష్కారంగా చూపిస్తున్నారని స్పష్టమవుతోంది.
8.76 లక్షల పిటిషన్ల మాటేమిటి?
గ్రామ రెవెన్యూ సదస్సులు, పీజీఆర్‌ఎస్, ఇంకా ప్రతి సోమవారం ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు ఒక ఎత్తు! జగన్ సర్కారు భూముల సర్వే చేసిన 6వేల గ్రామాల్లో ఉన్న సమస్యలు మరో ఎత్తు! ప్రజల విజ్ఞప్తి మేరకు కూటమి సర్కారు ఆ 6 వేల గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతుల నుంచి పిటిషన్లు తీసుకుంది. అప్పట్లో ఏకంగా 8.76 లక్షల పిటిషన్లు వచ్చాయి. వీటిని తీసుకొని దాదాపు 8 నెలల కావొస్తోంది. ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ఓ స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. ఒక్క పిటిషన్ కూడా పరిష్కారం కాలేదు. ఇక జాయింట్ ఎల్‌పీఎమ్‌ల విభజన సంగతి దే వుడికే తెలియాలి!
ఫ్రీహోల్డ్‌పై అదే అనిశ్చితి...
ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములు, షరతుగల పట్టా భూములు, గ్రామకంఠం, ఇంకా చుక్కల భూముల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేసి 16 నెలలవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి 10 నెలలైంది. ఇప్పటిదాకా పరిష్కారంపై ఓ స్పష్టత లేదు. డిసెంబరు నాటికి పరిష్కారం అని కమిటీ చెప్పింది. ఆ పుణ్యకాలం కాస్తా ముగుస్తోంది. ఇంకెంతకాలం నాన్చుతారన్న ఆందోళన, అసంతృప్తి ప్రజల్లో రగులుతున్నాయి.
సకల సమస్యలు రెవెన్యూలోనే...
ఇటీవల ప్రభుత్వానికి అంశాల వారీగా అందుతున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై ఆర్టీజీఎస్ ఓ నివేదిక తయారు చేసింది. టాప్-10లో... నేరాలకు సంబంధించిన అంశాన్ని వదిలేస్తే... మిగిలిన తొమ్మిది రెవెన్యూ శాఖకు సంబంధించినవే. టాప్-1లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్) అంటే పాస్‌పుస్తకాలు, భూముల చట్టం అమలుకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. వీటి సంఖ్య 2,13,703. మొత్తం ఫిర్యాదుల్లో ఇవి 36 శాతం. ఇక రీ సర్వేపై 1,87,348 ఫిర్యాదులు (31.5 శాతం) వచ్చాయి.