Share News

Revenue Clinics: రాష్ట్రమంతా రెవెన్యూ క్లినిక్‌లు

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:50 AM

పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ‘రెవెన్యూ క్లినిక్‌’ను రెవెన్యూ శాఖ అందిపుచ్చుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించాలని నిర్ణయించింది.

Revenue Clinics: రాష్ట్రమంతా రెవెన్యూ క్లినిక్‌లు

మన్యం మోడల్‌ అమలుకు ప్రభుత్వ ఆదేశాలు

ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఈ క్లినిక్‌లు

ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్‌ డే’లో నిర్వహణ

ఫిర్యాదుల పరిష్కార బాధ్యత తహశీల్దార్‌దే

సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు జారీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ‘రెవెన్యూ క్లినిక్‌’ను రెవెన్యూ శాఖ అందిపుచ్చుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం ప్రజా విన్నపాల స్వీకరణ (గ్రీవెన్స్‌ డే) సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టరేట్లలో విధిగా వీటిని చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్‌ ఇచ్చేందుకు వచ్చే పౌరులతో ఎలా వ్యవహరించాలి.. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను రెవెన్యూ డెస్క్‌లలో ఎలా పరిష్కరించాలి.. ఈ సంద ర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉంచాల్సిన రెవెన్యూ రికార్డులు, ఇంకా కార్యాచరణ నివేదికలపై మరింత స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలకు ప్రజల్లో సంతృప్త స్థాయిని తీసుకొచ్చేందుకు గత కొద్దిరోజులుగా తీవ్ర కసర త్తు జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి సీఎం చంద్రబాబు వద్ద, మరోసారి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వద్ద సమావేశాలు జరిగాయి. రెవెన్యూ డెస్క్‌లపై ఇప్పటికే స్పష్టత రాగా.. ఇప్పుడు రెవెన్యూ క్లినిక్‌ల అమలుపై కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు ఇచ్చారు.


రెవెన్యూ క్లినిక్‌ మార్గదర్శకాలివీ..

  • ప్రతి సోమవారం ప్రజల నుంచి పిటిషన్లు తీసుకుంటారు కాబట్టి ఆ రోజున రెవెన్యూ రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలి. గ్రామ అడంగల్‌, 10(1) రికార్డు, ఎఫ్‌ఎ్‌ఫఏ, వెబ్‌ల్యాండ్‌, ఓఆర్‌సీఎమ్‌ఎస్‌ ఇతర రికార్డులు (ఫిజికల్‌, ఆన్‌లైన్‌) సిద్ధంగా పెట్టుకోవాలి.

  • అంశాల వారీగా.. అంటే ఆర్‌ఓఆర్‌ సంబంధిత, పాస్‌పుస్తకం, ఆర్‌వోఎ్‌ఫఆర్‌. ఏజెన్సీ భూములు, రీసర్వే పేరిట రెవెన్యూ టేబుళ్లను ఏర్పాటు చేయాలి.

  • రెవెన్యూ క్లినిక్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి. పిటిషనర్‌ ఎందుకొచ్చారు? ఆ పనేమిటో కనుక్కోవాలి. సమస్య పరిష్కారానికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొచ్చారా? తీసుకురావలసిన పేపర్లు ఉన్నాయేమో పరిశీలించాలి. అవసరమైన డాక్యుమెంట్లపై స్పష్టత ఇవ్వాలి. ఆన్నీ ఉంటే అక్కడ ఏ రెవెన్యూ టేబుల్‌ వద్దకు వెళ్లాలో సూచించాలి.

  • ఫిర్యాదు రాగానే అందులోని సర్వే నంబర్‌ ఆధారంగా భూమి వివరాలు తీసుకోవాలి. ఆ వివరాలను నిర్దేశించే ఎస్‌ఎ్‌ఫఏ, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇంకా ఎఫ్‌ఎమ్‌బీ, ఎల్‌పీఎమ్‌, వెబ్‌ల్యాండ్‌, ఈసీ, ఇతర రికార్డులను ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉంచి పరిశీలించాలి.

  • అన్నీ పరిశీలించాక ఆ పిటిషన్‌లో పేర్కొన్న భూమి స్వభావం, సమస్య, దాని పరిష్కారంపై చేపట్టే కార్యాచరణ(ఏటీటీ)తో కూడిన రిపోర్టును ఫిర్యాదుదారుకు అందజేయాలి.

  • ఒకవేళ పిటిషన్‌లోని అంశం సివిల్‌ వివాదం కిందకు వస్తే.. కోర్టుకు వెళ్లి పరిష్కారం పొందాలని సూచించాలి. అదే విషయాన్ని రిపోర్టులో పొందుపరచాలి.

  • ఫిర్యాదులోని అంశాలపై తహశీల్దార్‌ స్పందన తీసుకుంటారు. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని సంప్రదిస్తారు.

  • పిటిషన్‌ ఆర్‌వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)కు సంబంధించినదైతే వెంటనే తహశీల్దార్‌ లేదంటే ఆర్‌డీవోకు రిఫర్‌ చేస్తారు. ఓఆర్‌సీఎమ్‌ఎస్‌ (సాఫ్ట్‌వేర్‌)లో వెంటనే నోటీసులు తయారుచేసి బాధ్యులకు పంపించాలి.

  • మ్యుటేషన్‌, ఎఫ్‌ఎమ్‌బీ, 1బీ రికార్డుల సేవలను కోరితే వెంటనే మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలి.

  • ఏజెన్సీలోని భూముల వివాదం, ఇంకా అటవీ భూములపై పట్టా, రీ సర్వే, ఎఫ్‌లైన్‌, సబ్‌ డివిజన్‌ వంటి అంశాలపై చట్టప్రకారం పరిష్కారం ఉండేలా కార్యాచరణ నివేదికలో పొందుపరచాలి. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి సిబ్బందితో పునఃపరిశీలన, నిర్ధారణలు చేయించాలి.

  • క్లినిక్‌కు వచ్చే పిటిషన్లలో తీవ్ర అంశాలు, న్యాయపరమైన వ్యవహారాలపై జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డీవో, తహశీల్దార్‌ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూపాలి.

  • ప్రజా పిటిషన్లపై ప్రతి రోజూ మధ్యాహ్నం సబ్‌కలెక్టర్‌ లేదా ఆర్‌డీవోలు ఏటీటీ (కార్యాచరణ నివేదిక) నోట్‌లపై సమీక్ష చేయాలి.

  • ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు కలెక్టర్‌, జేసీ, సబ్‌ కలెక్టర్‌ రెవెన్యూ క్లినిక్‌ రిపోర్టులపై సమీక్ష చేయాలి.

  • ప్రతి పిటిషన్‌పై సరైన చర్య ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే దానిని ముగించాలి. అంటే అది పరిష్కారమైందని రికార్డుచేయాలి. అదే విషయాన్ని పిటిషనర్‌కు తెలియజేయాలి. ఆ తర్వాత ప్రజా స్పందన తీసుకోవాలి.

  • ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తహశీల్దార్లదే ప్రాథమిక బాధ్యత. కలెక్టర్‌, జేసీ, సబ్‌కలెక్టర్‌, ఆర్‌డీవోలు ఏటీటీ, ఏటీఆర్‌లపై నిరంతరం సమీక్షించాలి. ప్రతి పిటిషన్‌ను సరిగ్గా పరిష్కరించారో లేదో పరిశీలించాలి. ఇందులో పాల్గొనే ప్రతి అధికారీ ఈ మార్గదర్శకాలను త్రికరణ శుద్ధిగా పాటించాలి.


ఏమిటీ రెవెన్యూ క్లినిక్‌..?

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజల నుంచి వస్తున్న భూసంబంధిత సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కలెక్టరేట్‌ పరిధిలో రెవెన్యూ క్లినిక్‌ పేరిట గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నారు. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ చర్చకు రాగా.. ఈ విధానం బాగుందని సీఎం కితాబిచ్చారు. మిగతా జిల్లాలు అనుసరించవచ్చేమో చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మన్యం మోడల్‌ను రాష్ట్రమంతా అమలు చేయాలని ఇప్పుడు రెవెన్యూశాఖ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహిస్తారు. భూసమస్యలున్న రైతులు, పౌరులు నేరుగా ఇక్కడకు వెళ్లి రెవెన్యూ డెస్క్‌లోని అధికారిని కలిసి పిటిషన్‌ సమర్పించాలి ఆ తర్వాత దాని పరిష్కారంపై కార్యాచరణ ఎలా ఉండాలో సీసీఎల్‌ఏ మార్గదర్శకాల్లో విశదీకరించారు. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణను ప్రభుత్వం క్రమం తప్పకుండా పరిశీలిస్తుందని, మార్గదర్శకాలను పాటించనివారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - Dec 27 , 2025 | 03:51 AM