Share News

Parvathipuram: రెవెన్యూ క్లినిక్‌

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:35 AM

భూ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చెప్పడం కష్టమే. రెవెన్యూ సమస్యలు నానాటికి ఎక్కువ అవుతుండడంతో వాటిని పరిష్కరించాలని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు....

Parvathipuram: రెవెన్యూ క్లినిక్‌

  • అక్కడ భూ సమస్యలకు పక్కా చికిత్స

  • పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ వినూత్న ఆలోచన

  • రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక

  • ఒక్కో సమస్యకు ఒక్కో కౌంటర్‌ ఏర్పాటు

  • ఐదు కౌంటర్ల ద్వారా ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ

  • సెప్టెంబరులో క్లినిక్‌ ప్రారంభం.. 100శాతం అర్జీల పరిష్కారం

రెవెన్యూ శాఖతో పని అంటే ప్రజలు చెప్పులు అరిగేలా తిరగాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ‘రెవెన్యూ క్లినిక్‌’ అనే వినూత్న ఆలోచనతో భూ సమస్యలకు చికిత్స చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. వ్యాధుల చికిత్సకు ప్రత్యేక విభాగాలు ఉన్నట్లే.. వివిధ రకాల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో సమస్య పరిష్కారం సులువవుతోంది. క్లినిక్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని అటు అధికారులు.. ఇటు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

భూ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చెప్పడం కష్టమే. రెవెన్యూ సమస్యలు నానాటికి ఎక్కువ అవుతుండడంతో వాటిని పరిష్కరించాలని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులను ఆదేశిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల మాదిరిగానే పార్వతీపురం మన్యం జిల్లాలోనూ రెవెన్యూ సమస్యలు గతంలో భారీగా పెండింగ్‌లో ఉండేవి. దీన్ని గమనించిన జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తన సొంత ఆలోచనతో సెప్టెంబరు 29న ‘రెవెన్యూ క్లినిక్‌’ అనే వేదికను ప్రారంభించారు. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ద్వారా సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిస్తారు. కానీ ఇప్పుడు ప్రతి సోమవారం రెండు ప్రజా సమస్యలు పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి సాధారణ సమస్యలు వేదిక కాగా, మరొకటి కేవలం రెవెన్యూ సమస్యలపైనే వినతులు స్వీకరించే విభాగం. రాష్ట్రంలోనే మొదటిసారిగా రెవెన్యూ క్లినిక్‌ పేరుతో ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వేదిక ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్‌ వద్ద కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు ఇద్దరు సబ్‌ కలెక్టర్లు, 15 మంది తహసీల్దార్లు ఉంటారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ క్లినిక్‌ ద్వారా వచ్చిన సమస్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.


ప్రత్యేక కౌంటర్ల వద్ద ఫిర్యాదుల స్వీకరణ

రెవెన్యూ క్లినిక్‌ వేదిక వద్ద ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్‌ వద్ద అధికారులు ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్‌వోఎ్‌ఫఆర్‌ సమస్యల పరిష్కారానికి ఒకటో నంబర్‌ కౌంటర్‌, మ్యుటేషన్‌ తదితర సమస్యలకు రెండో నంబర్‌ కౌంటర్‌, 1/70 చట్టం సమస్యలు పరిష్కరించేందుకు మూడో నంబర్‌ కౌంటర్‌, రీసర్వే సంబంధిత సమస్యల కోసం నాలుగో నంబర్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక ఐదో నంబర్‌ కౌంటర్‌ వద్ద ఇతర రెవెన్యూ సమస్యలు, వినతులకు సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. ఒక్కో కౌంటర్‌ వద్ద డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ, మరో ఇద్దరు అధికారులను నియమించారు. ముందుగా రెవెన్యూ సమస్యలపై ప్రజలు అందించే వినతులను రిజిస్ర్టేషన్‌ చేసి అనంతరం ఆ సమస్య ఏ కౌంటర్‌ వద్దకు వెళితే పరిష్కారం అవుతుందో అర్జీదారులను చెప్పి అక్కడకు పంపిస్తారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.

అర్జీదారుల సంతృప్తి

రెవెన్యూ క్లినిక్‌ ప్రారంభమైన తర్వాత అర్జీలు పరిష్కరించి వాటిపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అర్జీదారుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మొదటి తొమ్మిది వారాలకు సంబంధించి 227 ఫిర్యాదులు అందాయి. వాటిని నూటికి నూరు శాతం పరిష్కరించారు. సమస్యల పరిష్కారం తర్వాత ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తే.. 173 మంది తమ సమస్యలు పరిష్కారం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొంతమంది ఫోన్స్‌కు అందుబాటులో లేకపోవడం వల్ల వారి అభిప్రాయం తెలియలేదు.

రెవెన్యూ సమస్యలు లేని జిల్లాగా మార్చేందుకు కృషి

రెవెన్యూ సమస్యలు లేని జిల్లాగా పార్వతీపురం మన్యంను మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాను. సెప్టెంబరు 29న రెవెన్యూ క్లినిక్‌ ద్వారా సమస్యలపై ప్రత్యేకంగా వినతులను తీసుకోవడం ప్రారంభించాం. 227 వినతులు వచ్చాయి. నూటికి నూరు శాతం సమస్యలను పరిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లాను రెవెన్యూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం ఉంది.

-ఎస్‌. ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌

Updated Date - Dec 17 , 2025 | 04:37 AM