Share News

Revamping Secretariats: సచివాలయాలను సరిదిద్దాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:37 AM

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సచివాలయాలు! మొత్తంగా రాష్ట్రంలో 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు! ఏకంగా 1.34 లక్షల మంది సిబ్బంది! ఇదంతా మా ఘనతే అని నాడు జగన్‌ సర్కారు గొప్పగా చెప్పుకొంది.

Revamping Secretariats: సచివాలయాలను సరిదిద్దాలి

  • సచివాలయాల్లో పరిస్థితులు, లోటుపాట్లపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక, పరిశీలనాత్మక కథనం...

  • సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు

  • సరైన ప్రణాళిక లేకుండా జగన్‌ తెచ్చిన వ్యవస్థ

  • సంస్కరణలు, సిబ్బంది హేతుబద్ధీకరణ కీలకం

  • కొన్నిచోట్ల ఎక్కువ.. కొన్నిచోట్ల కొరత

  • రీ గ్రూపింగ్‌ చేసినా మార్పు అంతంతే

  • ఏ, సీ గ్రూపు సచివాలయాల్లో ఖాళీలు

  • బీ గ్రూపు సచివాలయాల్లో డిమాండ్‌

  • సిబ్బందిలో పలువురు నిపుణులు, భారీగా ఉన్నత విద్యావంతులు

  • వారిని సరిగ్గా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధ్యమే

ఒకప్పుడు మండల వ్యవస్థ... ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ! పాలన వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలననుచేర్చడంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులివి! సచివాలయ ‘వ్యవస్థ’ మంచిదే కానీ... దానిని తీసుకొచ్చిన విధానం, ప్రణాళికా లోపంతో ఇదే అవస్థలా మారింది. ఉద్యోగాలు ఇచ్చారు.. జీతాలు చెల్లిస్తున్నారు! మరి... వీరిని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారా? అన్నదే అసలు ప్రశ్న!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, అమరావతి)

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సచివాలయాలు! మొత్తంగా రాష్ట్రంలో 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు! ఏకంగా 1.34 లక్షల మంది సిబ్బంది! ఇదంతా మా ఘనతే అని నాడు జగన్‌ సర్కారు గొప్పగా చెప్పుకొంది. కానీ... ఆయా శాఖల్లో ఉద్యోగుల నియామకం, విధుల కేటాయింపు, పని విభజన.. అంతా గందరగోళమే. జగన్‌ హయాంలో మొదలైన ఈ సంక్లిష్టత... ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సచివాలయ వ్యవస్థను సంస్కరించడం ఎలా? ఉద్యోగులతో సమర్థంగా పనిచేయించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఎలా? అన్నదానిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు అధ్యయనాలు చేపట్టింది. రీగ్రూపింగ్‌ ద్వారా ప్రక్షాళన చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టింది. అయినా... తగిన ఫలితాలు లభించడంలేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులకు పని ఎక్కువగా ఉంది. మరికొందరికేమో తగినంత పని లేదు. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. కొన్నిచోట్ల విధులకు ఒకరిద్దరే వస్తున్నారు. మిగిలినవారు సర్వే, ఇతరపనుల పేరు చెప్పి రావడం లేదు. వీటన్నింటినీ సరిదిద్దాలి. ముఖ్యంగా ‘వర్క్‌ రేషనలైజేషన్‌’ చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


గ్రూపింగ్‌ చేసినా...

సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టగా 1.24 లక్షల మంది విధుల్లో చేరారు. ఈ తర్వాత వివిధ కారణాలతో 10 వేలమంది ఉద్యోగులు రాజీనామా చేశారు. ప్రస్తుతం 1.14 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిని సమర్థంగా ఉపయోగించుకోవడంపై కూటమి సర్కారు ఏడాది పాటు కసరత్తు చేసి గ్రామ, వార్డు సచివాలయాలను రీగ్రూపింగ్‌ చేపట్టింది. ఆయా శాఖల ద్వారా సచివాలయ సిబ్బందిని బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. క్లస్టర్‌ విధానం చేపట్టిన తర్వాత ఏ, బీ, సీ గ్రేడ్లుగా సచివాలయాలను విభజించారు. గతంలో ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది ఉద్యోగులు ఉండేవారు. రీ గ్రూపింగ్‌ తర్వాత జనాభాను బట్టి ఒక్కో సచివాలయంలో 6 నుంచి 8 మందిని నియమించారు. జనాభా తక్కువగా ఉన్న ఏ కేటగిరీ సచివాలయాల్లో అడ్మిన్‌ పోస్టు లేకుండా చేశారు. దీంతో అక్కడ సిబ్బంది తగ్గిపోయారు. జనాభా ఎక్కువగా ఉన్న సీ కేటగిరీ సచివాలయాల్లో నియమించిన సిబ్బందికి పనిభారం ఎక్కువైందని, ఏదో ఒక రకంగా పైరవీలు చేసుకుని మధ్యతరహా బీ కేటగిరీ సచివాలయాలకు బదిలీ అవుతున్నారు. దీంతో కొన్ని సచివాలయాల్లో సిబ్బంది కొరత అలాగే ఉంది. ప్రజలకు సరిగా సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


పర్యవేక్షణ దిశగా...

సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన గత సర్కార్‌ మానిటరింగ్‌ వ్యవస్థను లేకుండా చేసింది. ఎంపీడీఓలు మండల పరిపాలనతో పాటు అదనంగా సచివాలయ సిబ్బందిని పర్యవేక్షించడం కష్టమైంది. దీంతో సచివాలయ ఉద్యోగులు విధులకు రాకపోయినా అడిగేవారు లేరు. ఎక్కడైనా అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సచివాలయంలో అందుబాటులో లేరని ఎంపీడీఓకు ఫిర్యాదు చేస్తే... మండల వ్యవసాయ అధికారి తనకు వేరే డ్యూటీ వేశారంటూ తప్పించుకుంటున్నారు. మహిళా పోలీసుల పరిస్థితీ అంతే. ఆయా గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ఏదైనా తిరునాళ్లు, పండగలకు మాత్రమే వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మానిటరింగ్‌ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కూటమి సర్కార్‌ ఇటీవల మండల స్థాయిలో జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి మండల కేంద్రంలో డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షించాలని నిర్ణయించింది.పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇప్పటికే గ్రేడ్‌-1పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించివారిని డిప్యూటేషన్‌పై జీఎ్‌సడబ్ల్యూఎస్‌ అధికారులుగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది.


మరింత కసరత్తు చేస్తేనే...

గ్రామ, వార్డు సచివాలయాలను విజన్‌ యూనిట్లుగా వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. సిబ్బందిలో చాలామంది పలు అంశాల్లో నైపుణ్యం గల వారు ఉన్నారు. ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసిన వారూ ఉన్నారు. కొంతమంది అయితే సెలవుపెట్టి అమెరికా లాంటి దేశాల్లో సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు. ఇలాంటి సిబ్బందిని వినియోగించుకోవడంలో గత సర్కార్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఆయా రంగాల వారీగా నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి వినియోగించుకుంటే మరింత ఉపయోగం ఉంటుంది. లైన్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలో ఉన్న సిబ్బందిని ఆయా శాఖల పరిధిలోనే విస్తృతంగా వినియోగించుకుంటూ సచివాలయ కేంద్రంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. లక్షకు పైగా ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుని, సచివాలయాలను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.కొన్ని వార్డుల్లో అయితే ఐదు సచివాలయాలు ఉన్నాయి. అక్కడ ఇన్ని అవసరం ఉండదు. సచివాలయాలను మరోసారి డీలిమిటేషన్‌ చేయాల్సిన అవసరముంది.


చాలా చోట్ల సిబ్బంది కొరత

  • చాలా చోట్ల సచివాలయాల్లో సిబ్బంది కొరత ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల అయితే అవసరం లేకపోయినా కేటాయించారు.మచ్చుకుకొన్నిజిల్లాల్ని పరిశీలిస్తే..

  • అనకాపల్లి జిల్లాలో 522 సచివాలయాలు ఉన్నాయి. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 3,831 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంకా 2,433 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • శ్రీసత్యసాయి జిల్లాలో 544 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా...3,855మంది పని చేస్తున్నారు. 2005 మంది సిబ్బంది కొరత ఉంది.

  • ఏలూరుజిల్లా ముదినేపల్లి మండలంలోని సచివాలయ సిబ్బందిలో దాదాపు 40 శాతం మంది గత బదిలీల్లో కృష్ణా జిల్లాకు వెళ్లిపోయారు. వారిస్థానాల్లో ఎవరినీ భర్తీచేయలేదు.

  • శ్రీకాకుళం జిల్లాలో 732 సచివాలయాలకు గాను 7,200మంది సిబ్బంది ఉండాల్సి ఉండ గా,6,416మంది విధులు నిర్వహిస్తున్నారు.

  • కాకినాడజిల్లాలో 620సచివాలయాలు ఉండగా మొత్తం 5,200మంది ఉద్యోగులను నియమించారు. 1035పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - Nov 12 , 2025 | 05:44 AM