Gold Cluster: గోల్డ్ క్లస్టర్‌కు భూములిచ్చే వారికి రిటర్నబుల్ ప్లాట్లు
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:21 AM
అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్ క్లస్టర్ కోసం చేపట్టనున్న భూ సమీకరణకు ప్రభుత్వం ..
భూసమీకరణ ప్రక్రియ ద్వారా 78 ఎకరాలు సేకరణ
మున్సిపల్ శాఖ ఆదేశాలు.. నోటిఫికేషన్ విడుదల
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్ క్లస్టర్ కోసం చేపట్టనున్న భూ సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సేకరించే 78.01 ఎకరాల్లో ఈ గోల్డ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అవసరమయ్యే భూసమీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 55, సబ్‌సెక్షన్ 3 కింద భూసమీకరణ చేపట్టనున్నారు. దీనికోసం భూములిచ్చిన వారికి తర్వాత అదే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ గోల్డ్ క్లస్టర్‌కు సంబంధించి ప్రత్యేక అభివృద్ధి పథకం కింద చేసిన ప్రతిపాదనలను సీఆర్‌డీఏ ఆమోదించింది. దీని ప్రకారం భూములిచ్చిన ఒరిజినల్ పట్టాదారులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక ఎకరాకుపైగా ఇచ్చినవారికి 550 చదరపు గజాలు, 0.50-0.99 ఎకరాలకు 380 చ.గజాలు, 0.25-0.49 ఎకరాలకు 380 చ.గజాలు, 0.24 ఎకరంలోపు భూమి ఇచ్చిన వారికి 180 చ.గజాలు రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తారు. అసైన్డ్ భూముల విషయంలో ఎకరా పైబడిన భూమిని కోల్పోయిన వారికి 450 చ.గజాలు, 0.50-0.99 ఎకరాలు ఇచ్చిన వారికి 330 చ.గజాలు, 0.25-0.49 ఎకరాలు ఇచ్చిన వారికి 230 గజాలు, 0.24 ఎకరాల కంటే తక్కువ ఇచ్చిన వారికి 150 చ.గజాలు రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సబ్‌కలెక్టర్/డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ భూసమీకరణ చేపట్టనున్నారు.