Share News

రీసర్వే పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:55 PM

మండలంలోని దుద్ది గ్రామం రీసర్వేలో పైలట్‌ ప్రాజెక్టుగా ఎన్నికైనందున రీసర్వే పనులు వేగవంతం చేయాలని ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ అన్నారు.

రీసర్వే పనులు వేగవంతం చేయాలి
దుద్ది గ్రామ పొలాల్లో రీసర్వే పనులను పరిశీలిస్తున్న ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

కోసిగి, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుద్ది గ్రామం రీసర్వేలో పైలట్‌ ప్రాజెక్టుగా ఎన్నికైనందున రీసర్వే పనులు వేగవంతం చేయాలని ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ అన్నారు. గురువారం ఆయన దుద్ది గ్రామ పొలాల్లో రీసర్వే పనులను తనిఖీ చేశారు. రైతులు, సర్వేయర్లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వేలో సమస్యలు ఏమైనా ఉంటే తమదృష్టికి తీసుకురావాలని రెవెన్యూ పరిధిలో ఉంటే ఆ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం దుద్ది గ్రామ సచివాలయంలో తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. దుద్ది గ్రామ సచివాలయ పరిధిలోని రైతుల వివరాలను సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. ఐరంగల్‌ గ్రామ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మౌర్యభరద్వాజ్‌ మాట్లాడుతూ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని అన్నారు. రైతులందరూ సహకరించి భూసేకరణ సవ్యంగా జరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే ఐరంగల్‌ గ్రామ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నా యని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ రుద్రగౌడు, డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణుసూర్య, సర్పంచ రామాంజనేయులు, సర్వేయర్లు శ్రీనివాసులు, వీఆర్వోలు యేసుదాసు, శ్రీనివాసులు, బసవరాజు, రైతులు తదితరులు ఉన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:55 PM