Jagan Anakapalli Roadshow: మరో.. కరూర్ జరగొచ్చు
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:21 AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో ఉన్న మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని...
భారీ జన సమీకరణ చేస్తున్నారు
ఏదైనా జరిగితే ప్రాణనష్టం తప్పదు
రోడ్డు మార్గంలో అనుమతి లేదు
విశాఖ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టీకరణ
రాత్రి పొద్దుపోయాక షరతులతో కూడిన అనుమతిచ్చిన విశాఖపట్నం కమిషనర్
మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాం: వైసీపీ
అనకాపల్లి/విశాఖపట్నం/మద్దిలపాలెం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో ఉన్న మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చి.. అక్కడనుంచి అనకాపల్లిలోని కాలేజీకి వెళ్తారు. ఈ కాలేజీ పునాదుల దశ కూడా పూర్తికాలేదు. అయినప్పటికీ జగన్ ఇక్కడ పర్యటించి.. గొప్పలు చెప్పుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలావుంటే.. విశాఖ నుంచి మాకవరపాలెంలోని కాలేజీకి 63 కిలోమీటర్ల దూరం ఉంది. విశాఖ కమిషనరేట్ పరిధిలో 11 కిలో మీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తారు. అయితే.. విశాఖ నుంచి రోడ్ షో నిర్వహించి.. బల ప్రదర్శన ద్వారా మాకవరపాలెం చేరుకోవాలన్నది వైసీపీ ఎత్తుగడ. ఈ విషయాన్ని పసిగట్టిన విశాఖ పోలీసు కమిషనర్ శంఖబ్రతబాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాలు.. జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. ఇలా అనుమతిస్తే తమిళనాడులోని కరూర్‌లో జరిగిన భారీ తొక్కిసలాట.. ఇక్కడ కూడా జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. విశాఖ నుంచి నేరుగా మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌లో వెళ్తే అభ్యంతరం లేదన్నారు. మంగళవారం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాజీ సీఎం జగన్ రోడ్డు మార్గంలో మాకవరపాలెం వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే, భారీ జన సమీకరణ జరుగుతున్నట్టు గుర్తించాం.
లంకెలపాలెం జంక్షన్‌కు 3వేల మంది, డైట్ జంక్షన్‌కు 1,500మంది, కొత్తూరు జంక్షన్‌కు 7వేల మంది, తాళ్లపాలెం జంక్షన్‌కు 7వేల మందిని చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశంతో పాటు అంబులెన్స్‌ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని పరిశ్రమలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు ఇబ్బంది పడతారు. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట మాదిరిగా ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదు. అందుకే రోడ్డు మార్గంలో పర్యటనకు అనుమతులు ఇవ్వడం లేదు. హెలికాప్టర్‌లో వెళ్లాలని కోరుతున్నాం. మాకవరపాలెంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తాం.’’ అని తెలిపారు.
విశాఖ పరిధిలో అనుమతి: బాగ్చీ
జగన్ మాకవరపాలెం పర్యటనకు సంబంధించి విశాఖ పరిధిలో కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా రోడ్డుమార్గంలో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, ట్రాఫిక్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టంచేశారు. పైలట్ ఎస్కార్ట్ సహా పది వాహనాలకు మించి కాన్వాయ్‌లో ఉండకూడదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిషిద్ధమన్నారు శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఎదురైనా, ప్రజలకు, సాధారణ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగినా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కార్యక్రమాన్ని నిలిపివేస్తామన్నారు. కాగా.. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సీపీ బాగ్చీ రోడ్డుమార్గంలో మాకవరపాలెం వెళ్లేందుకు జగన్‌కు అనుమతి నిరాకరించామని తెలిపారు. అదేరోజు విశాఖలో ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నగర ప్రతిష్ఠ మసకబారుతుందని అన్నారు. అంతేకాదు, జగన్ వెంట కనీసం 150 కార్లు, 500కిపైగా బైకులతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెళతారని సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా కూడళ్ల వద్ద స్థలం లేకపోవడంతో తొక్కిసలాట జరిగే అవకాశం కూడా లేకపోలేదన్న సీపీ.. అందుకే రోడ్డు మార్గంలో అనుమతివ్వడం లేదన్నారు.
ఆంక్షలు పట్టించుకోం
ఎవరి పర్మిషన్ అవసరం లేదు
రోడ్ షో చేసి తీరుతాం: అమర్‌నాథ్
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ రోడ్డు షో ఉంటుందని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం మద్దిలపాలెంలో మాట్లాడుతూ.. గురువారం విశాఖ విమానాశ్రయం నుంచి నర్సీపట్నం వరకు జగన్ రోడ్డు షో ఉంటుందన్నారు. జగన్ పర్యటన వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్, అనకాపల్లి జిల్లా ఎస్పీలకు తెలియజేసి, భద్రత కల్పించాలని కోరినట్టు తెలిపారు. అయితే రోడ్డు షోకు అనుమతి ఇవ్వలేదని, తమిళనాడులో జరిగిన తొక్కిసలాటను కారణంగా చూపించారని అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జగన్ నర్సీపట్నం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారని, మరి ముఖ్యమంత్రి పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ‘‘మేం పర్మిషన్ కోసం పోలీసులకు లేఖ ఇవ్వలేదు. సమాచారం కోసం ఇచ్చాం. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా రోడ్డు షో ఉంటుంది.’’ అని తేల్చి చెప్పారు.