AP Employee Unions: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:11 AM
సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీజీఈఎన్ అధ్యక్షుడు, ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ కోరారు.
సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసే నిర్ణయం తీసుకోండి
ప్రభుత్వానికి ఏపీజీఈఎన్, ఏపీఎన్‌జీజీవో విజ్ఞప్తి
విజయవాడ (గవర్నర్‌పేట/గాంధీనగర్), సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీజీఈఎన్ అధ్యక్షుడు, ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ కోరారు. పెన్షన్ విద్రోహ దినంగా సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లెనిన్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసేలా పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారని, ఏడాదిన్నర గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీపీఎస్‌పై వెంటనే మంచి పరిష్కారం చూపేలా మ్యాప్ తయారు చేయాలని కోరారు. మరోవైపు.. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా ఓపీఎ్‌సలోకి మారుస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా తమ సమస్య పరిష్కరించలేదని విమర్శించారు. ఏపీసీపీఎస్ ఈఏ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో సోమవారం చేపట్టిన నిరసనలో ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.