Water Management: చెరువులు నిండాయ్
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:51 AM
రాష్ట్రంలో ఎగువ నుంచి భారీగా వస్తోన్న వరద, అల్పపీడనాలతో కురుస్తోన్న భారీ వానలతో చెరువులన్నీ నీళ్ల నిండి కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలోని 38,628 చెరువుల్లో 132.64 టీఎంసీల నీరు
19,685 చెరువుల్లో నూరు శాతం నిల్వలు.. 7,048 చెరువుల్లో 75 శాతం నీళ్లు
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎగువ నుంచి భారీగా వస్తోన్న వరద, అల్పపీడనాలతో కురుస్తోన్న భారీ వానలతో చెరువులన్నీ నీళ్ల నిండి కళకళలాడుతున్నాయి. గత పదేళ్లలో లేనంతగా చెరువులన్నీ దాదాపు గరిష్ఠ స్థాయి నీటి నిల్వలతో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 38,628 చిన్న, మధ్య, పెద్ద చెరువులు ఉన్నాయి. వీటి సామర్థ్యం 206.21 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 132.64 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. కోస్తాంధ్రలో 26,487 చెరువుల్లో 113.43 టీఎంసీలకుగాను 85.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాయలసీమలోని 12,141 చెరువుల్లో 92.78 టీఎంసీలకు 46.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 19,685 చెరువులు నూరుశాతం నిండి 51,48 టీఎంసీల నీటి నిల్వలు కలిగి ఉన్నాయి. 7,048 చెరువులు 75 శాతం మేర నిండి 18.43 టీఎంసీల నీటి నిల్వలతో ఉన్నాయి. నైరుతీ రుతుపవనాలు ప్రారంభం నుంచి నేటిదాకా రాష్ట్రంలో 849.70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రిజర్వాయర్లలో 1004.48 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రధాన జలాశయాలన్నింటిలోనూ నీటి నిల్వలు భారీగానే కనిపిస్తున్నాయి. శ్రీశైలం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకుగురువారం 97.32 శాతం నిల్వ ఉంది. నాగార్జునసాగర్ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకుగాను 99.81 శాతం నిండి 311.45 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఎగువ నుంచి 46,305 క్యూసెక్కుల వరద వస్తుండగా, 33,236 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతలకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠసామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 97.42 శాతం నిండి 44.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ఠస్థాయి(3.07 టీఎంసీలు)కు చేరింది. ఎగువ నుంచి వస్తున్న 48,699 క్యూసెక్కుల వరదను దిగువకు వదిలేస్తున్నారు.