AP EAPCET 2025: రిజర్వేషన్ గల్లంతు
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:45 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీ) సెట్‌కు సంబంధించి చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్ వేలాది మంది విద్యార్థుల తలరాతలు మార్చేస్తోంది.
ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ అస్తవ్యస్తం
భారీగా నష్టపోయిన రిజర్వేషన్ విద్యార్థులు
జనరల్ కోటాలో రిజర్వ్ అభ్యర్థులకు నో ఎంట్రీ
మెరిట్ విద్యార్థినులకు 10-20ు మందికే జనరల్
మేల్, ఫిమేల్ కటాఫ్‌లో కనిపించని వ్యత్యాసం
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలోనూ ఇదే పరిస్థితి
ఒక కళాశాలలో సీఎ్‌సఈ ఓసీ జనరల్ కటాఫ్ ర్యాంకు 12,227. కానీ, అంతకంటే మెరుగైన ర్యాంకులు వచ్చిన 30 మంది విద్యార్థినులకు, అంతకంటే మెరుగైన ర్యాంకులు వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు జనరల్ కోటాలో సీట్లు రాలేదు. వారికి ఓసీ జనరల్ కటాఫ్ కంటే మెరుగైన ర్యాంకు వచ్చినప్పటికీ ఈఏపీ సెట్లో మెరిట్ కోటాలో సీటు దక్కలేదు. వారికి సంబంధించిన రిజర్వేషన్ కోటాలోనే సీటు వచ్చింది. కేవలం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కొన్ని వేల మంది విద్యార్థుల తలరాతలు మార్చేస్తోంది. గత ప్రభుత్వం నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల ఎంపికతో మొదలైన రిజర్వేషన్ తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది.
గుంటూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీ) సెట్‌కు సంబంధించి చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్ వేలాది మంది విద్యార్థుల తలరాతలు మార్చేస్తోంది. ఈఏపీ సెట్లో సీట్ల కేటాయింపు నిమిత్తం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌లో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ గల్లంతైంది. తాజాగా జరిగిన తొలి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో అనేక లోపాలు బయటబడ్డాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం రిజర్వేషన్ వర్తించే విద్యార్థులకు శాపంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్‌లో విడుదలైన సీట్ అలాట్‌మెంట్ జాబితా జనరల్ కోటా అర్ధం మారిపోయింది. జనరల్ కోటాలో సీట్లు మొత్తం బాలురకే కేటాయించారు. ‘జనరల్’ అంటే పురుష, స్త్రీ అన్న వ్యత్యాసం లేకుండా ఎవరికైనా మెరిట్ ఆధారంగా కేటాయించాలి. కానీ, జనరల్ కోటా సీట్లలో 80 శాతం సీట్లు బాలురకే కేటాయించారు. పురుషుల కోటాలో లాస్ట్ కటాఫ్ ర్యాంకు వచ్చిన అభ్యర్థికంటే మెరుగైన ర్యాంకుల వచ్చిన 80 శాతం మంది విద్యార్థినులను జనరల్ కోటాలోకి తీసుకోకుండా, వారికి బాలికల కోటాలో సీట్లు ఇచ్చారు. ఫలితంగా వేల మంది విద్యార్థినులకు అన్యాయం జరిగింది.
సామాజిక రిజర్వేషన్లలో
వెనుకబడిన, అణగారిన వర్గాలకు కేటాయించి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మొత్తం సీట్లలో 50 శాతం వారికి కేటాయించాలి. వాటిలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 29 శాతం బీసీలకు కేటాయిస్తారు. అయితే, ఓపెన్ కేటగిరీలో ఉన్న 50 శాతం సీట్లకు కులమతాలు, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. మెరిట్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, విద్యార్థినులు కూడా ఆ కోటాలో సీట్లు పొందుతారు. ఆ కేటగిరీ భర్తీ అయిన తర్వాత మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రిజర్వేషన్ల అభ్యర్థులకు కేటాయిస్తారు. అయితే, తాజా కౌన్సెలింగ్‌లో ఆ రిజర్వేషన్లు అమలు కాలేదు. మెరిట్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అతి కొద్దిమందికి మాత్రమే జనరల్ కోటాలో సీట్లు కేటాయించారు. ఓపెన్ కేటగిరీ కటాఫ్ ర్యాంకు కంటే మెరుగైన ర్యాంకులు వచ్చిన 80 శాతం మందిని ఓపెన్ కేటగిరీలోకి రానివ్వకుండా, వారికి రిజర్వేషన్ కేటగిరీల్లోనే సీట్లు కేటాయించారు.
వర్టికల్ రిజర్వేషన్ అబాసుపాలు
సామాజిక రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వం మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీనిని ‘వర్టికల్ రిజర్వేషన్’ అంటారు. అంటే ప్రతి కేటగిరీలో 33.3 శాతం సీట్లు విద్యార్థినులకు కేటాయించాలి. ఓపెన్ కేటగిరీలో ఉన్న 50 శాతం సీట్లలో మూడో వంతు మహిళలకు కేటాయించాలి. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో ఉన్న సీట్లలో కూడా మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించాలి. అలా ప్రతి కేటగిరీలో మహిళలకు 33.3 శాతం సీట్లు కేటాయించాలి. అయితే, తాజా వెబ్ కౌన్సెలింగ్‌లో వర్టికల్ రిజర్వేషన్ పూర్తిగా అబాసుపాలైంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగంలో మెరిట్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను ఎవరినీ ఈ కోటాలోకి అనుమతించలేదు. ఆ కారణంగా వారంతా ఓపెన్ కేటగిరీ సీట్లు కోల్పోయారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.