Share News

AU Research Team: వ్యాక్సిన్‌కు కరోనా వైరస్‌ మస్కా

ABN , Publish Date - Nov 25 , 2025 | 05:22 AM

ఐదేళ్ల క్రితం విరుచుకుపడిన కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సిన్‌ను అందించాయి.

AU Research Team: వ్యాక్సిన్‌కు కరోనా వైరస్‌ మస్కా

  • వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో నిరంతర మార్పులతో అయోమయంలో పడిపోయిన యాంటీబాడీస్‌

  • ఘనపదార్థంగా ఉన్నప్పుడే దానిపై ప్రభావం

  • ద్రవరూపంలో ఉన్నప్పుడు పనిచేయని వైనం

  • రెండేళ్ల అధ్యయనంలో నిర్ధారించిన ఏయూ

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల క్రితం విరుచుకుపడిన కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సిన్‌ను అందించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే.. ఈ వ్యాక్సిన్లు కరోనా వైర్‌సకు అడ్డుకట్ట వేశాయా.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో విజయం సాధించాయా..? అంటే.. లేదు అని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు..!వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదని, వైరస్‌ జన్యువుల్లో మార్పులే దీనికి కారణమని ఏయూ విద్యార్థుల బృందం చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది. టీ క్యాబ్స్‌-ఇ ల్యాబ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ రవికిరణ్‌ యేడిది నేతృత్వంలో విద్యార్థుల బృందం సుమారు రెండేళ్లపాటు సాగించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్‌ వైర్‌సను నిరోధించే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు వివిధ రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. భారత్‌లోని ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాయి. అయితే, కొవిడ్‌ వైర్‌సను అరికట్టడంలో, వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదని, దీనికి కారణం వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లు (జన్యువులు) కారణమని వర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం తేల్చింది. 2021 నుంచి 2023 మధ్య కాలంలో నిర్వహించిన ఈ పరిశోధనలో కీలక విషయాలను నిర్ధారించారు.


జన్యు మార్పులతో గందరగోళం..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా శరీరంలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీస్‌ శరీరంలోకి వచ్చే వైర్‌సను చంపి బాధితులకు ఇబ్బందులు కలగకుండా చేస్తాయి. అయితే, యాంటీబాడీ్‌సను అయోమయానికి గురిచేసేలా కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్స్‌ (జన్యువులు) వ్యవహరించినట్టు విద్యార్థుల పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన కోసం అమెరికా నుంచి వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను తెప్పించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ స్పైక్‌ ప్రొటీన్‌ ఒకసారి లిక్విడ్‌ రూపంలోకి, మరోసారి ఘనపదార్థంలోకి మారుతున్నట్టు గుర్తించారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా వచ్చే యాంటీబాడీస్‌.. వైరస్‌ ఘనపదార్థంగా ఉన్నప్పుడు మాత్రమే దాడి చేసి నాశనం చేయగలిగాయి. ద్రవ పదార్థంలోకి మారినప్పుడు వైర్‌సను గుర్తించలేక వాటిని ఏమీ చేయలేకపోయినట్టు పరిశోధనలో గుర్తించారు. దీంతో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ చాలామందిలో వైరస్‌ ప్రభావాన్ని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయిందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను ప్రతిష్ఠాత్మక ఎల్సేవియర్‌ అంతర్జాతీయ పత్రిక బీబీఏలో ప్రచురితమైంది.

ఇదీ పరిశోధన బృందం..

డాక్టర్‌ రవికరణ్‌ ఏడిది నేతృత్వంలో ఎం.ఫార్మసీ విద్యార్థి మణికంఠ పోడసాని, అభినవ్‌ గ్రంథి (ఫార్మాడి), నిహారిక మూకల (ఎమ్మెస్సీ), జాహ్నవి చింతలపాటి (ఎమ్మెస్సీ), మాధురి విస్సాప్రగడ (ఎమ్మెస్సీ), మధుమిత అగ్గున్న (ఎమ్మెస్సీ) పరిశోధన సాగించారు. బయో ఫి జిక్స్‌, కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌, మాలిక్యులర్‌ బ యాలజీ, బయో కెమిస్ర్టీ, జీనోక్లోనింగ్‌, ఇతర సా ఫ్ట్‌వేర్‌ పద్ధతుల్లో ప్రయోగాలు నిర్వహించారు. ఈ పరిశోధన బృందాన్ని వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, ఇతర అధికారులు అభినందించారు.

Updated Date - Nov 25 , 2025 | 05:24 AM