దేశవాళీ వరి రకాలపై పరిశోధనలు సక్సెస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:50 AM
తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళీ) వరి రకాలను అభివృద్ధి చేసి మేలి రకం వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలు విజయవంతమయ్యాయి.
మూడేళ్లపాటు 21 రకాల వంగడాలపై అధ్యయనం
తెల్ల సన్నాలు, కుంకుమశాలి, టెటెన్ ధాన్యం మేలి రకాలుగా ఎంపిక
వంగడాల గుణగణాలపై ల్యాబ్‌లో పరీక్షలు
వచ్చే ఏడాది విత్తనోత్పత్తి, రైతులకు చిరు సంచుల్లో పంపిణీ
చింతపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళీ) వరి రకాలను అభివృద్ధి చేసి మేలి రకం వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. మూడేళ్లపాటు ఆదివాసీ రైతుల నుంచి సేకరించిన 21 రకాల వంగడాలపై అధ్యయనం చేశారు. దిగుబడి, నాణ్యత ఆధారంగా మూడు రకాలు మేలి రకం వంగడాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేలి రకం వంగడాల పోషక విలువలపై అధ్యాయనం చేసేందుకు ల్యాబ్ పరీక్షలకు పంపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు పలు రకాల సంప్రదాయ వరి విత్తనాలను సాగు చేసేవారు. దేశవాళీ వరి రకాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం పేరుతో ఆదివాసీలు పిలిచేవారు. కొన్ని రకాల వరి విత్తనాలు బాస్మతిని తలపించే సువాసనలు వెదజల్లుతుంటాయి. మరికొన్ని రకాలు మధుమేహం బాధితులు ఆహారంగా తీసుకున్నా చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఈ రకాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో లేవు. అతి తక్కువ మంది ఆదివాసీ రైతులు ఆహారం కోసం ఈ సంప్రదాయ విత్తనాలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులు ఆహారం కోసం సూపర్‌మార్కెట్లలో లభించే రెడ్, బ్రౌన్, బ్లాక్ రైస్‌ను అధిక ధర చెల్లించి కొనుగోలు చేసుకుని ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న వివిధ రకాల రైస్ కంటే ఆదివాసీలు పూర్వం సాగు చేసే వరి వంగడాల్లో మానవుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న ఆదివాసీల సంప్రదాయ వరి విత్తనాలకు పునరుజ్జీవం ఇచ్చేందుకు శాస్త్రవేత్తలు 2023లో పరిశోధనలు ప్రారంభించారు. మూడేళ్లపాటు వివిధ దశల్లో అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మూడు మేలి రకాలను ఎంపిక చేశారు.
గిరిజన రైతుల నుంచి సేకరణ
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా గిరిజన ప్రాంతాల రైతుల నుంచి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సంప్రదాయ వరి వంగడాలను సేకరించారు. సుమారు 150 మంది రైతుల నుంచి 21 రకాల వంగడాలను సేకరించారు. శాస్త్రవేత్తలకు వంగడాలు అందజేసిన రైతుల వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. ఈ వంగడాలను ఒక్కొక్క ప్రాంత ఆదివాసీలు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. దీంతో శాస్త్రవేత్తలు వంగడాలకు నంబర్లు కేటాయించి పరిశోధనలు ప్రారంభించారు. ఈ దేశవాళీ రకాల్లో మంచి పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మూడేళ్లపాటు పరిశోధనలు
సంప్రదాయ వరి రకాల విత్తనాలపై శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు నిర్వహించారు. ఖరీఫ్, రబీ మాసాల్లో ఏడాదికి రెండు పర్యాయాలు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టారు. ప్రధానంగా నాణ్యత, దిగుబడులు ఆధారంగా మూడు రకాలను ఎంపిక చేశారు. ఈ మూడు రకాల వంగడాలకు వచ్చే ఏడాది విత్తనోత్పత్తి చేపట్టనున్నారు. మరో రెండేళ్లలో దేశవాళీ వరి మేలి రకం వంగడాలు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
మూడు మేలి రకం వంగడాల ఎంపిక
మూడేళ్ల ప్రయోగాత్మక సాగులో మూడు రకాల దేశవాళీ వంగడాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్ల సన్నాలు, కుంకుమశాలి, టెటెన్ ధాన్యం రకాల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్ల సన్నాలు హెక్టారుకు 6.3 క్వింటాళ్లు, కుంకుమశాలి 6.1, టెటెన్ ధాన్యం ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యం నాణ్యత, పరిమాణం, సువాసలను బాగున్నాయి. తెగుళ్లను తట్టుకునే శక్తి అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.