AP RERA Chairperson: పారదర్శకంగా రెరా బాధ్యతలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:14 AM
యల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, వినియోగదారుల రక్షణ కోసం.. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏపీ రెరా నిబద్ధతతో పనిచేస్తుందని ఆ సంస్థ చైర్‌పర్సన్ ఆరె శివారెడ్డి అన్నారు....
స్థిరాస్తి వ్యాపారులకు రెరాలో నమోదు తప్పనిసరి
రేపటి నుంచి అవగాహన సదస్సులు
తొలుత తిరుపతి నుంచి : రెరా చైర్‌పర్సన్ శివారెడ్డి
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, వినియోగదారుల రక్షణ కోసం.. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఆ సంస్థ చైర్‌పర్సన్ ఆరె శివారెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఏదైనా స్థలాలు, అపార్ట్‌మెంట్లు, భవనాల అమ్మకాలు, కొనుగోలు, మార్కెటింగ్... చేపట్టే ముందు రెరా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాతే అనుమతులు జారీ చేస్తామని, అలాగే మోసపూరితమైన వాగ్దానాలపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుంటూరు జిల్లా రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఏపీ రెరా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ చట్టంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి నెలా ఒక జిల్లాలో సదస్సులు నిర్వహిస్తామన్నారు. తొలుత ఈ నెల 10న తిరుపతి జిల్లాలో ప్రారంభిస్తామని తెలిపారు.
1,011 దరఖాస్తుల్లో 731కి అనుమతులు..
ఏపీ రెరా డైరెక్టర్ నాగసుందరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి అందిన 1,011 దరఖాస్తుల్లో 731కి అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఏపీ రెరా నూతన పాలకవర్గం ఏర్పడిన గత రెండు నెలల్లో 214 ప్రాజెక్టులు, 27 మార్కెటింగ్ ఏజెన్సీల ఏజెంట్లు రిజిస్టర్ అయ్యారన్నారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లేదా ఎనిమిది యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న అన్ని భవన నిర్మాణాలకు రెరా నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. రెరాలో నమోదు కాని ప్రాజెక్టులకు, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయని ప్రాజెక్టులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నమోదుకు, ఫిర్యాదులకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు.