Share News

Assembly Disruptions: మండలిలో పదే పదే వైసీపీ రచ్చ

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:44 AM

మెడికల్‌ వైద్య కళాశాలల అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని బీఏసీ సమావేశంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం శాసనమండలి సజావుగా జరక్కుండా పదేపదే అడ్డుకుంటోంది. సోమవారం మండలి సమావేశం ప్రారంభమైన వెంటనే..

Assembly Disruptions: మండలిలో పదే పదే వైసీపీ రచ్చ

  • మెడికల్‌ కళాశాలలపై చర్చ కోసం పట్టు

  • చర్చకు సిద్ధమని బీఏసీలోనే ప్రభుత్వం స్పష్టీకరణ

  • అయినా తక్షణమే చేపట్టాలంటూ సభలో వైసీపీ డిమాండ్‌

  • విపక్ష సభ్యుల తీరుపైచైర్మన్‌ అసహనం

అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ వైద్య కళాశాలల అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని బీఏసీ సమావేశంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం శాసనమండలి సజావుగా జరక్కుండా పదేపదే అడ్డుకుంటోంది. సోమవారం మండలి సమావేశం ప్రారంభమైన వెంటనే.. వైసీపీ సభ్యులు మెడికల్‌ కళాశాలలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే తక్షణమే ఆ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. తర్వాత చైర్మన్‌ పోడియంపైకి వెళ్లి నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే చైర్మన్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. వైసీపీ సభ్యులు ఇదే అంశంపై గతంలోనే వాయిదా తీర్మానం ఇచ్చారని, చర్చించాలని బీఏసీలో కూడా నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. రూల్‌ 64 ప్రకారం ఒకసారి వాయిదా తీర్మానం ఇచ్చిన అంశాన్ని.. మళ్లీ అదే సెషన్‌లో అదే రూపంలో ప్రస్తావించకూడదని.. సదరు నిబంధనలను పరిశీలించి వైసీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. సభ సజావుగా జరిగేలా చూడాలని చైర్మన్‌ను కోరారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మెడికల్‌ కళాశాలలపై చర్చ జరపాలని బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరని ప్రశ్నించారు. తక్షణం చర్చించాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలపై చర్చించాలని బీఏసీలోనే నిర్ణయం తీసుకున్నామని.. ఎజెండా ప్రకారం సభను నడవనివ్వాలని.. సభను ఆర్డర్‌లో పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్‌ను కోరారు. ‘గత ప్రభుత్వంలో మీరే చైర్మన్‌గా ఉన్నారు. మేం సభ్యులుగా ఉన్నాం. ఒక్క రోజైనా పోడియం వద్దకు రాలేదు. సభ సజావుగా జరగడానికి ఆర్డర్‌లో పెట్టండి.’ అని కోరారు. మండలి చీఫ్‌విప్‌ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. సభను సాగనివ్వకుండా అడ్డుకోవడం సరైందికాదని వ్యాఖ్యానించారు. చైర్మన్‌ స్పందిస్తూ.. రోజూపోడియం ఎక్కడం మంచి పద్ధతి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు.అయినా వారు పరిస్థితి మారకపోవడంతో సభను ఉదయం 10.20కి వాయిదా వేశారు. తిరిగి రెండున్నర గంటలకు మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది.


  • బొత్స గారూ!.. జీఎస్టీ 2.0పై మీ వైఖరేమిటి?

  • మండలిలో నిలదీసిన పయ్యావుల

  • నిశ్చేష్టుడై నిల్చుండిపోయిన ప్రతిపక్ష నేత

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): బొత్స గారూ! జీఎస్టీ సంస్కరణలు 2.0పై మీ వైఖరి ఏమిటి? అంటూ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన మండలిలో సూటిగాప్రశ్నించారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ... ‘శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశంలో జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడితే... మీ పార్టీపరంగా వ్యతిరేకిస్తామని చెప్పారు కదా? కానీ మీరు తీర్మానాన్ని వ్యతిరేకరించలేరు, వ్యతిరేకించరు కూడా. ఎందుకంటే జగన్‌ జీఎస్టీ సంస్కరణలను విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు. ప్రధానిని ప్రశంసించారు. ఆమేరకు ఈరోజే (సోమవారం) ఎక్స్‌లో స్పం దించారు’ అని అన్నారు. కేశవ్‌ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియక బొత్స నిశ్చేష్టుడై నిలుచుండిపోయారు. సోమవారం మధ్యాహ్నం శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రకటన చేశారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 నుంచి ఇప్పటి వరకు దేశ ప్రజల నుంచి రూ.55 లక్షల కోట్లు వసూలు చేశారు. 8 ఏళ్ల తర్వాత సంస్కరణల పేరుతో రూ.2.40 లక్షల మేర ప్రజలపై భారం తగ్గించామంటున్నారు. సంతోషం. అయితే ఉత్తరభారతంలో ప్రజలు తినే పరోటా, చపాతీలపై జీఎస్టీని తీసేశారు. దక్షిణ భారతీయులు తినే ఇడ్లీ, దోశలపై జీఎస్టీ ఉందా? లేదా? అనే దానిపై మంత్రి(పయ్యావుల) స్పష్టత ఇవ్వలేదు’’ అని అన్నారు. జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏమైనా మెకానిజాన్ని ఏర్పాటు చేసిందా? అని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు. వీటిపై మంత్రి పయ్యావుల పైవిధంగా స్పందించారు.

Untitled-5 copy.jpg

Updated Date - Sep 23 , 2025 | 05:47 AM