అద్దె భవనాలే దిక్కు!
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:07 AM
జిల్లాల విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇంకా జిల్లా పరిపాలనాపరంగా గాడిన పడలేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడలోనే మకాం ఉన్న అధికారులు, కృష్ణాజిల్లాగా విడిపోయిన తర్వాత కూడా వారు అక్కడే నివాసం ఉండి, చుట్టపు చూపుగా మచిలీపట్నం వచ్చి వెళ్తున్నారు. కలెక్టర్, జేసీ, డీఆర్వో మినహా మిగిలినశాఖల అధికారులు జిలా ్లహెడ్ క్వార్టర్‌లో నివాసం ఉండటం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు సమకూర్చే ఆలోచన చేయడంలేదు. దీంతో అధికశాతం కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పాతవి అయినా వాటిలోనే కొనసాగు తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు ఎప్పుడు సమకూరుతాయో తెలియని అయోమయం నెలకొంది.
- ప్రభుత్వ కార్యాలయాలకు సమకూరని సొంత భవనాలు
- మూడేళ్లుగా అరకొర వసతులతో అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్న అధికారులు
- మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి కృష్ణాజిల్లా
- ఉద్యోగుల సర్వీసు నిబంధనలు ఇంకా ఉమ్మడి జిల్లా పరిధిలోనే..
- పూర్తిస్థాయిలో గాడిన పడని పరిపాలన
జిల్లాల విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇంకా జిల్లా పరిపాలనాపరంగా గాడిన పడలేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడలోనే మకాం ఉన్న అధికారులు, కృష్ణాజిల్లాగా విడిపోయిన తర్వాత కూడా వారు అక్కడే నివాసం ఉండి, చుట్టపు చూపుగా మచిలీపట్నం వచ్చి వెళ్తున్నారు. కలెక్టర్, జేసీ, డీఆర్వో మినహా మిగిలినశాఖల అధికారులు జిలా ్లహెడ్ క్వార్టర్‌లో నివాసం ఉండటం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు సమకూర్చే ఆలోచన చేయడంలేదు. దీంతో అధికశాతం కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పాతవి అయినా వాటిలోనే కొనసాగు తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు ఎప్పుడు సమకూరుతాయో తెలియని అయోమయం నెలకొంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
గతంలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడిగా ఉన్న కృష్ణాజిల్లాను, కృష్ణాజిల్లా, ఎన్టీఆర్‌జిల్లాగా విభజించడంతోపాటు, గతంలో జిల్లాలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. ఈ రెండున్నర జిల్లాల్లో ఉద్యోగుల బదిలీలు, ఇతరత్రా అంశాలకు సంబంధించి కృష్ణా కలెక్టరే పర్యవేక్షణ చేయాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీలు, ఇతరత్రా పరిపాలనా పరమైన అంశాలకు సంబంధించి ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల కలెక్టర్‌లు జాబితాలు లేదా నివేదికలు తయారు చేసి కౌంటర్ సంతకం పెట్టి కృష్ణా కలెక్టర్‌కు పంపాల్సి ఉంది. వీటిని పరిశీలించి కృష్ణా కలెక్టర్ సంతకాలు చేస్తేనే పరిపాలనా ఆమోదం పొందే పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లాలో పనిచేసే అధికారులు, సిబ్బంది బదిలీల్లో ఎదురైన ఇబ్బందులపై కృష్ణా కలెక్టర్ వద్దకు వచ్చి తమగోడు వెళ్లబోసుకున్నారు.
డివిజన్ స్థాయి వారికి జిల్లా బాధ్యతలు
గతంలో ప్రతిశాఖకు జిల్లాస్థాయి అధికారులు ఉండేవారు. అనుభవం ఉన్న అధికారులు జిల్లాస్థాయిలో పనిచేస్తుంటే వారి పనితీరు, సత్వర నిర్ణయాలు, కిందిస్థాయి అధికారుల పనితీరు, తదితర అంశాలపై పటిష్టంగా పర్యవేక్షణ ఉండేది. ప్రస్తుతం వివిధ శాఖల్లో డివిజన్ స్థాయి అధికారులే, జిల్లాస్థాయి ఇన్‌చార్జి అధికారులుగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో గతంలో ఎస్‌ఈ స్థాయిలో అధికారి ఉండేవారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డివిజన్‌ల డీఈలు, ఈఈలు ఆయన పరిధిలో పనిచేసేవారు. గతంలో గుడివాడలో ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయాన్ని మచిలీపట్నంకు ఇటీవలనే మార్చారు. డీఈ స్థాయి అధికారిని ఈఈగా నియమించారు. ఎన్టీఆర్ జిల్లాకు వేరే ఎస్‌ఈ ఉండటంతో మచిలీపట్నంలోని డీఈ స్థాయి అధికారి ఈఈగాను, ఎస్‌ఈగాను పనిచేయాల్సిన పరిస్థితి. డీఈ స్థాయిలో ఉన్న అధికారి ఇతర డివిజన్‌లలో ఉన్న డీఈలకు పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ చేస్తుంటే వారు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కృష్ణా పంచాయతీ అధికారి(డీపీవో) పోస్టు కృష్ణాజిల్లాలో అఽధికారికంగా ఉండగా, ఎన్టీఆర్ జిల్లా డీపీవో పోస్టును మార్పుచేశారు. డ్వామా పీడీ, సంక్షేమ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారుల పోస్టులది ఇదే తీరుగా ఉంది.
కార్యాలయాల్లో సిబ్బంది నిల్
ప్రభుత్వ కార్యాలయం అంటే జిల్లాస్థాయి అధికారి, ఆయన వద్ద పూర్తిస్థాయిలో కార్యాలయ సిబ్బంది, కారు, ఇతరత్రా హంగామా ఉండాలి. కానీ జిల్లాల విభజన జరిగిన తర్వాత కింది స్థాయి, సిబ్బందితో పాటు కార్యాలయంలో సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు, బిళ్లబంట్రోతులు ఉండాలి. కానీ వీరెవరూ ప్రస్తుతం లేరు. కలెక్టర్, జేసీల వద్ద కూడా ఈ సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో వేరే మండలాల్లో పనిచేసే సిబ్బందిని డెప్యుటేషన్‌పై తెచ్చుకుని పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో జెడ్పీ సీఈవోకు జిల్లా పరిషత ప్రాంగణంలోనే బంగ్లా ఉండగా, ఈ బంగ్లాను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయానికి కేటాయించారు. దీంతో జెడ్పీ సీఈవో ఎక్కడ నివాసం ఉండాలో తెలియని పరిస్థితి. ఐదు రోజలు క్రితం ఏర్పాటు చేసిన డీఎల్‌డీవో కార్యాలయాలను కూడా అద్దె భవనాల్లోనే ప్రారంభించారు.
ఏళ్ల తరబడి అద్దె భనాల్లోనే..
జిల్ల్లాలో కీలకమైన నీటిపారుదలశాఖ ఎస్‌ఈ పోస్టును ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే ఉంచారు. విజయవాడ నుంచే ఈ శాఖకు సంబంధించిన పరిపాలన కొనసాగుతోంది. సర్వశిక్ష అభియాన్, గృహ నిర్మాణ శాఖ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు కార్యాలయం, బీసీ కార్పొరేషన్, అటవీశాఖ, పరిశ్రమలు, ఉద్యానశాఖ, దేవదాయశాఖ, మార్కెటింగ్‌శాఖ, భూగర్భ, గనులశాఖ, ఖనిజశాఖ, భూగర్భ జల అధికారి కార్యాలయం, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్, సహకారశాఖ తదితర కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, మచిలీపట్నం డీవైఈవో కార్యాలయాలను నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో నడుపుతున్నారు. విద్యుతశాఖ ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలను మచిలీపట్నం డివిజన్ విద్యుతశాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయాన్ని ఉయ్యూరు మార్కెట్ యార్డులోని భవనంలో కొన్ని గదులను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మాణం చేసేందుకు గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణాజిల్లా నుంచి వేరుపడినట్లుగా చూపి, కృష్ణాపేరుతో కృష్ణాజిల్లాను పాత జిల్లాగా పరిగణిస్తున్నారు. ఆయా కార్యాలయాల భవనాల నిర్మాణానికి ఇంతవరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కలెక్టర్, జేసీ కార్యాలయాలను, వారి బంగ్లాలను కొంతమేర ఆధునీకరించి సరిపెట్టారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విజయవాడ ఎయిర్‌పోర్టుగానే పిలుస్తారు. ఎన్టీఆర్ జిల్లాకు సమీపంలో ఎయిర్‌పోర్టు ఉంది. కానీ 65 కిలోమీటర్ల దూరంలో ఉండే మచిలీపట్నంలోని కృష్ణా కలెక్టర్, ఎస్పీలు ప్రోటోకాల్, ఇతరత్రాపరిపాలనా పరమైన అంశాలను చూడాల్సి వస్తోంది.