Share News

అద్దె భవనాలే దిక్కు!

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:18 AM

జిల్లాల విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఇంత వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరలేదు. అద్దె భవనాల్లోనే అధికశాతం కార్యాలయాలు నేటికీ నడుస్తున్నాయి. ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక వివిధ పనులపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్న సమయంలో విజయవాడలోనే మకాం ఉన్న అధికారులు, జిల్లా విడిపోయిన తర్వాత కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. చుట్టంచూపుగా మచిలీపట్నం వచ్చి వెళుతున్నారు. కలెక్టర్‌, జేసీ, డీఆర్వో మినహా మిగిలినశాఖల అధికారులు జిల్లా హెడ్‌క్వార్టర్‌లో నివాసం ఉండటం లేదని విమర్శలు వస్తున్నాయి.

అద్దె భవనాలే దిక్కు!

- ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు

- జిల్లా విభజన జరిగి నాలుగేళ్లు అయినా సమకూరని సౌకర్యాలు

- నిలిచిన తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయ భవనాల నిర్మాణం

- విజయవాడలోనే అధికారుల మకాం!

- పట్టించుకోని అధికారులు

జిల్లాల విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఇంత వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరలేదు. అద్దె భవనాల్లోనే అధికశాతం కార్యాలయాలు నేటికీ నడుస్తున్నాయి. ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక వివిధ పనులపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్న సమయంలో విజయవాడలోనే మకాం ఉన్న అధికారులు, జిల్లా విడిపోయిన తర్వాత కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. చుట్టంచూపుగా మచిలీపట్నం వచ్చి వెళుతున్నారు. కలెక్టర్‌, జేసీ, డీఆర్వో మినహా మిగిలినశాఖల అధికారులు జిల్లా హెడ్‌క్వార్టర్‌లో నివాసం ఉండటం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో అధికశాతం ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు మాత్రం పాత భవనాల్లోనే ప్రస్తుతం నడుస్తున్నాయి. సర్వశిక్ష అభియాన్‌, గృహ నిర్మాణశాఖ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు కార్యాలయం, బీసీ కార్పొరేషన్‌, అటవీశాఖ, పరిశ్రమలు, దేవదాయశాఖ, మార్కెటింగ్‌శాఖ, భూగర్భ, గనులశాఖ, ఖనిజశాఖ, భూగర్భ జలఅధికారి కార్యాలయం, ఎక్సైజ్‌ విభాగం సూపరింటెండెంట్‌ తదితర కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, ఈఈ, డీవైఈవో కార్యాలయాలను నోబుల్‌ కళాశాల ఎదురుగా ఉన్న పాతభవనంలో నిర్వహిస్తున్నారు. విద్యుతశాఖ ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలను మచిలీపట్నం డివిజన్‌ విద్యుతశాఖ కార్యాలయంలో నడుపుతున్నారు. వీటికి నూతన భవనాలు నిర్మాణం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్‌ జిల్లా కృష్ణాజిల్లా నుంచి వేరుపడినట్లుగా చూపి, కృష్ణాజిల్లాను పాతజిల్లాగా పరిగణిస్తున్నారు. ఆయా కార్యాలయాల భవనాల నిర్మాణానికి ఇంతవరకు నిధులు కేటాయించలేదు.

కలెక్టర్‌, జేసీ కార్యాలయాలను ఆధునీకరించి సరిపెట్టారు..

జిల్లా విభజన తర్వాత కలెక్టర్‌, జేసీ కార్యాలయాలను కొంతమేర ఆధునీకరించి సరిపెట్టారు. వ్యవసాయ ఆధారితమైన కృష్ణాజిల్లాలో కీలకమైన జలవనరులశాఖ ఎస్‌ఈ పోస్టును ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోనే ఉంచారు. విజయవాడ నుంచే ఈ శాఖకు సంబంధించిన పరిపాలన కొనసాగుతోంది. జవనరులశాఖకు కృష్ణాఈస్ట్రన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) కార్యాలయాన్ని గుడివాడలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఇటీవల కాలంలో తెరపైకి వచ్చింది. దీంతో ఈఈ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా తమ కార్యాలయాన్ని విజయవాడలోనే ఉంచాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వద్దకు వచ్చారు. ఈ ప్రతిపాదనను అంగీకరించని ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జలవనరులశాఖ ఈఈ కార్యాలయాన్ని గుడివాడలో ఏర్పాటు చేయాలని కోరారు. జలవనరులశాఖ ఈఈ కార్యాలయానికి సంబంధించి గుడివాడలో భవనాలు ఉన్నా, విజయవాడలోనే ఈ కార్యాలయం నేటికీ నడపడం గమనార్హం.

నిలిచిన తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయ భవనాల నిర్మాణం

మచిలీపట్నంలోని తహసీల్దార్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ ప్రాంగణంలోని మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం బ్రిటిష్‌ వారి కాలంలో నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. ఈ కార్యాలయాలు పల్లపు ప్రాంతంలో ఉండటంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరు కార్యాలయాల్లోకి ప్రవేశించి కార్యకలాపాలకు కొంతమేర అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో 2018, సెప్టెంబరు 28వ తేదీన ఈ రెండు కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. పునాదులదశ వరకు నిర్మించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఈ రెండు కార్యాలయ భవనాల నిర్మాణాన్ని వివిధ కారణాలతో నిలిపివేశారు. రెండేళ్ల క్రితం మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయాన్ని నార్త్‌, సౌత మండలాలుగా విభజించారు. నార్త్‌మండల కార్యాలయం పాత భవనంలో కొనసాగుతుండగా, సౌత మండల కార్యాలయాన్ని జలవనరులశాఖ అతిథి గృహంలో నడుపుతున్నారు.

Updated Date - Sep 29 , 2025 | 01:18 AM