TTD: గరిమెళ్లకు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:15 AM
ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు సంగీతాభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన ఆయనకు..

అధికారికలాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
బాలకృష్ణ ప్రసాద్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం
తిరుపతి(విశ్వవిద్యాలయాలు)/తిరుమల, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు సంగీతాభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగం అంత్యక్రియల్లో పాల్గొని గరిమెళ్లకు నివాళులర్పించారు. తిరుపతి భవానీనగర్‌లోని నివాసం నుంచి అంతిమ యాత్ర సాగింది. అన్నమాచార్య సంకీర్తనలను ఆలపిస్తూ అభిమానులు, శిష్యులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. హరిశ్చంద్ర శ్మశానవాటికలో గరిమెళ్ల గౌరవార్థం పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం పలికారు. అంతకుముందు బాలకృష్ణ ప్రసాద్ పార్థివదేహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ పుష్పగుచ్ఛంతో నివాళులర్పించగా, పోలీసులు జాతీయ పతాకాన్ని కప్పారు. కాగా, టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి బాధాకరం. ఆయన ఆలపించిన కీర్తనలు గొప్ప ఆధ్యాత్మిక, సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేకమంది హృదయాలను స్పృశించాయి. ఆయన ఒక ప్రతిభావంతుడిగా, సంగీత కళాకారుడిగా, స్వరకర్తగా మనందరికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.