APCC In charge Manickam Tagore: జగన్.. మోదీ కాళ్లు మొక్కారు
ABN , Publish Date - Aug 17 , 2025 | 06:07 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు మొక్కిన వైఎస్ జగన్, తన పార్టీలోని వైఎస్సార్ పేరును తొలగించాలని ఏపీసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు.
వైఎస్సార్ ఎవరి కాళ్లూ పట్టుకోలేదు
వైసీపీలో వైఎస్సార్ పేరు తొలగించాలి: మాణిక్కం ఠాగూర్
న్యూఢిల్లీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు మొక్కిన వైఎస్ జగన్, తన పార్టీలోని వైఎస్సార్ పేరును తొలగించాలని ఏపీసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ ఎన్నడూ ఏ ప్రధానమంత్రి కాళ్లూ పట్టుకోలేదని, ఇకపై జగన్ పార్టీలో వైఎస్సార్ పేరు ఉంచడం అర్థరహితమని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. జగన్‌కు ప్రజల కంటే ప్రధాని మోదీనే ఎక్కువని విమర్శించారు. ఓట్ చోరీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు వస్తే ఏపీలో మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారని, దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. కేంద్రం కనుసన్నల్లో బాబు, జగన్ పార్టీలు నడుస్తున్నాయని ఆరోపించారు. బాబు పార్టీ+జగన్ పార్టీ=బీజేపీ అని కామెంట్ చేశారు. ‘క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలూ మోదీకి మద్దతు ఇస్తున్నాయి. కీలకమైన బిల్లులకు ఇద్దరూ మద్దతు తెలిపారు. పార్లమెంటులో 239మంది ప్రతిపక్ష ఎంపీలు ఓట్ చోరీపై చర్చకు పట్టుబడుతుంటే వైసీపీ ఎంపీ గురుమూర్తి దానికి మద్దతుగా నిలిచారు. పైకి మాత్రం ఏదో జరిగిపోయినట్టుగా.. ఎన్నికల్లో తాము మోసపోయామంటూ వైసీపీ ఫిర్యాదులు చేస్తోంది. వైసీపీ డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తోంది’ అని విమర్శించారు. కాంగ్రెస్ పక్షాన తాము వనరులు, ప్రజల ఓటు హక్కు కోసం పోరాడుతున్నామని, టీడీపీ, వైసీపీ మాత్రం మోదీని ఆకాశానికెత్తే పనిలో నిమగ్నమయ్యాయని ఆరోపించారు.