Share News

Contract Lecturer: తరగతి గదిలో ఏసుక్రీస్తుపై బోధన

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:21 AM

తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మతప్రచారం చేశారన్న అభియోగంపై ఓ మహిళా కాంట్రాక్టు లెక్చరర్‌ ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

Contract Lecturer: తరగతి గదిలో ఏసుక్రీస్తుపై బోధన

  • తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఘటన

  • కాంట్రాక్ట్‌ మహిళా లెక్చరర్‌ సస్పెన్షన్‌

తిరుపతి(విద్య), డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మతప్రచారం చేశారన్న అభియోగంపై ఓ మహిళా కాంట్రాక్టు లెక్చరర్‌ ను అధికారులు సస్పెండ్‌ చేశారు. వివరాలివీ.. కడపకు చెందిన వెంకట మాధురి తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఇంగ్లీష్‌ అధ్యాపకురాలిగా కాంట్రాక్టు పద్ధతిలో ఐదు నెలలుగా పనిచేస్తున్నారు. గురువారం క్లాస్‌కు వచ్చిన ఆమెబోర్డుపై ‘అమ్మ - నాన్న - ఏసుప్రభువు, అక్క - అన్న - ఏసుక్రీస్తు’ అని రాశారు. విద్యార్థుల్లో ఒకరు దాన్ని వీడియో తీశారు. ఈ వీడియో శనివారం వెలుగులోకి రావడంతో కళాశాల ప్రిన్సిపాల్‌ ద్వారకనాథ రెడ్డి రాష్ట్ర టెక్నికల్‌ బోర్డు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు కొంతమంది హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్స్‌తో ఓ కమిటీని వేసి విచారణ చేపట్టారు. అధ్యాపకురాలు వెంకట మాధురితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తానేమీ ఏసుక్రీస్తు గురించి విద్యార్థులకు చెప్పలేదంటూనే.. బోర్డుపై రాసింది మాత్రం తానేనంటూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన కళాశాల అధికారులు రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించారు. వారి ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆర్డర్‌ను ప్రిన్సిపాల్‌ ఆమెకు అందజేశారు. క్లాసు రూమ్‌లో మత ప్రచారం చేసిన ఆమెను పూర్తిగా విధుల్లో నుంచి తొలగించి, క్రిమినల్‌ కేసులు పెట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు సాయంత్రం కళాశాల వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అప్పటికే ఆమెను సస్పెండ్‌ చేసిన విషయం తెలుసుకుని మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Dec 14 , 2025 | 05:22 AM