Employment Scheme: ఉపాధి ఉద్యోగులకు ఊరట
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:28 AM
నెలల తరబడి వేతనాలు అందక.. ఉద్యోగ భద్రత లేక.. గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు లేక... కొన్నాళ్లుగా నిర్వేదంలో కూరుకుపోయిన ఉపాధి హామీ పథకం సిబ్బంది కష్టాలకు త్వరలోనే తెరపడనుంది..!
పీఆర్ తరహాలోనే ఆర్డీ ఉద్యోగులకూ సంస్కరణలు.. 43 రకాల కేడర్ల సిబ్బందిని పది కేడర్లుగా కుదింపు
గ్రేడ్ల ఫిక్సేషన్, వేతన సవరణ, పెంపునకు గ్రీన్‌సిగ్నల్!
మూడేళ్లు పూర్తయిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎఫ్‌టీఈ
పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే యోచన..
రెండు రోజుల్లో ఉపముఖ్యమంత్రికి అందనున్న నివేదిక
కొత్త సంవత్సరంలో ఉపాధి సిబ్బందికి తీపి కబురు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
నెలల తరబడి వేతనాలు అందక.. ఉద్యోగ భద్రత లేక.. గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు లేక... కొన్నాళ్లుగా నిర్వేదంలో కూరుకుపోయిన ఉపాధి హామీ పథకం సిబ్బంది కష్టాలకు త్వరలోనే తెరపడనుంది..! రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి కొత్త సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీపికబురు చెప్పనున్నారు. ఆగస్టు 30న ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ‘‘నిర్వేదంలో ఉపాధి సిబ్బంది’’ శీర్షికతో వచ్చిన వార్తకు స్పందించిన ఆయన.. పంచాయతీరాజ్ (పీఆర్) ఉద్యోగుల మాదిరిగానే గ్రామీణాభివృద్ధి (ఆర్డీ) శాఖలో పనిచేసే ఉద్యోగులకు కూడా వేతన సవరణ, వేతనాల పెంపుతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ.. ఉన్నతాధికారులతో పలుమార్లు భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే పలు కేడర్ల సిబ్బందితో చర్చించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం.. చట్టపరంగా, నిధుల వెసులుబాటును బట్టి ప్రభుత్వం ఏం చేయవచ్చో అవన్నీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించారు. దాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అందించనున్నారు. కొత్త సంవత్సరంలో వారికి తీపికబురు అందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తోంది.
ఉపాధి సిబ్బందికీ పదోన్నతులు..
గతంలో నారా లోకేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధి సిబ్బందికి పదోన్నతులు కల్పించి, జీతాలు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు వారి ఎదుగుదలకు తోడ్పడే నిర్ణయాలేమీ తీసుకోలేదు. తాజాగా పలు కేడర్ల సిబ్బందికి కెరీర్ అడ్వాన్స్ ప్రక్రియ ద్వారా పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సిబ్బంది సర్వీసు, అర్హత ఉన్నప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి పదోన్నతులు కల్పించే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఆర్థికేతర సమస్యలను పరిష్కరించి, ఆ తర్వాత వేతన సవరణ, పెంపుపై అధికారులు దృష్టి సారించనున్నారు. దీంతో పాటు ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందికి కూడా ఊరట కల్పించనున్నారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (ఎఫ్‌టీఈ)గా గుర్తించనున్నారు. దీంతో వారికి కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి. అదే విధంగా ఏడేళ్ల అనుభవం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఎఫ్‌టీఈలుగా గుర్తించి వారి వేతనాలు పెంచనున్నారు. ప్రస్తుతం ఉపాధి సిబ్బంది 43 కేడర్లుగా ఉన్నారు. దీంతో అడ్మినిస్ట్రేషన్ పరంగా పలు సందర్భాల్లో గందరగోళం నెలకొంటోంది. దీంతో వారిని పది కేడర్లకు కుదించనున్నారు. ఈ క్రమంలో పలు కేడర్ల ఉద్యోగాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
పలు సమస్యలకు పరిష్కారం..
ఫీల్డ్ అసిస్టెంట్లకు 2018 నుంచి జీతాలు పెరగలేదు. 2016లో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు పెంచినా... కొన్ని కేడర్ల సిబ్బందికి పెరగలేదు. 2023లో ఏపీవోలకు గ్రేడ్లు ఫిక్స్ చేసి మిగతా కేడర్లకు చేయలేదు. వారి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోనున్నారు. సిబ్బంది హెల్త్ పాలసీ దారుణంగా ఉంది. ఈ సమస్యలను కూడా సర్కారు పరిష్కరించనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేశారు.