CM Chandrababu Naidu: అమరావతి అసైన్డ్ రైతులకు శుభవార్త
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:02 AM
రాజధాని అమరావతికి భూమిలిచ్చిన రైతులకు భారీ ఊరట లభించింది. ల్యాండ్ పూలింగ్ విధానంలో సీఆర్డీఏకు భూములిచ్చిన రైతులు, భూ యజమానుల అసైన్డ్ కష్టాలు తొలగిపోయాయి.
ల్యాండ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో ఆ పదం తొలగింపు
ఇకపై పట్టా భూమిగా పేర్కొనాలని ప్రభుత్వ ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలగిన కష్టాలు
తుళ్లూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి భూమిలిచ్చిన రైతులకు భారీ ఊరట లభించింది. ల్యాండ్ పూలింగ్ విధానంలో సీఆర్డీఏకు భూములిచ్చిన రైతులు, భూ యజమానుల ‘అసైన్డ్’ కష్టాలు తొలగిపోయాయి. అసైన్డ్ భూములను రాజధానికి ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్‌ల ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో ‘అసైన్డ్’ అని ఉంటుంది. దీనివల్ల తమ భూములకు సరైన ధర రావడం లేదని, తక్కువ రేట్లకు విక్రయించుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీనిపై ఎప్పటి నుంచో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారులకు కూడా పలుమార్లు వినతులు సమర్పించుకున్నారు. దీంతో రైతులు, భూ యజమానుల ఇబ్బందిని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ల్యాండ్ పూలింగ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో ‘అసైన్డ్’ పదం తొలగించి, పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టం 9.24లోని కాలమ్ నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్‌ను సవరిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో ‘అసైన్డ్’ పదానికి బదులు ‘పట్టా భూమి’ అని పేర్కొనాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ జీవో ఎం.ఎ్‌స.నంబర్ 187ను విడుదల చేశారు.