Reliance: విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:31 AM
భారీ డేటా సెంటర్లకు విశాఖ మహానగరం కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
1.25 లక్షల కోట్లతో 1 గిగావాట్ ఏర్పాటుకు ప్రతిపాదన
500 ఎకరాల కేటాయింపునకు ప్రభుత్వం సుముఖం
భూముల పరిశీలనకు రిలయన్స్ సిద్ధం
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): భారీ డేటా సెంటర్లకు విశాఖ మహానగరం కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా రూ. 1,25,000 కోట్లతో ఒక గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. డేటా సెంటర్ ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు కేటాయించాలంటూ కోరింది. అయితే, ఒక గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఇతర డేటా సెంటర్లకు కేటాయించినట్లే 500 ఎకరాలను కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ భూములను రిలయన్స్ సంస్థకు చూపించేందుకు విశాఖ రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ భూములను రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ భూ కేటాయింపులపై రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, ఆ తర్వాత పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం పొందిన వెంటనే ఉత్తర్వులను జారీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు.