Share News

Heavy Rains: వదలని వానలు..నీటిలోనే పంటలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:36 AM

రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తున్నాయి. నదులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం, నంద్యాల జిల్లాలోనూ రోడ్లు నీటమునిగి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Heavy Rains: వదలని వానలు..నీటిలోనే పంటలు

  • నదులు.. వాగుల్లో వరద ప్రవాహం

  • ‘తూర్పు’లో పొంగిన సుద్దగడ్డ.. ముంపులో పంటలు

  • నంద్యాల జిల్లాలో గ్రామాలకు నిలిచిన రాకపోకలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తున్నాయి. నదులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం, నంద్యాల జిల్లాలోనూ రోడ్లు నీటమునిగి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు రెండు లక్షల ఎకరాల్లోని పంటలు నీటమునిగాయి. అల్లూరి జిల్లా చింతూరు-భద్రాచలం నడుమ 30వ నంబరు జాతీయ రహదారి, ఏపీ- ఒడిసా మధ్య 326 నంబరు జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగి, రోడ్లపై నీరు చేరి రాకపోకలు స్తంభించగా.. మంగళవారం కూడా భారీ వర్షాలు హెచ్చరికలతో రైతులు, సాధారణ ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతుండగా ఏజెన్సీ ప్రాంతంలో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ-ఒడిస్సా 326 హైవేపై చింతూరు కుయుగూరుల వద్ద వరద నీరు భారీగా చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లాలో తీవ్ర అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో రెండు నౌకల్లోకి బియ్యం లోడింగ్‌ను నిలిపివేశారు. సుద్దగడ్డ కాలువ ఉప్పొంగడంతో గొల్లప్రోలులో వేలాది ఎకరాలు పంట పొలాలు చెరువుల్లా మారాయి. గొల్లప్రోలు మండలంలో కొత్తకాలనీకి వెళ్లే దారి నీట మునిగింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కూనవరంవద్ద గోదావరి ఎగపోటుతో వాగులు, వంకలు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి.దీంతో మన రాష్ట్రం మీదుగా ఒడిస్సా వెళ్లే 326 జాతీయ రహదారిపై చింతూరు కుయుగూరుల వద్ద వరద నీరు భారీగా చేరింది.ఈ హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Untitled-3 copy.jpg


చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే 30వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. చింతూరు, వరరామచంద్రపురం మండలాల నడుమ సోకిలేరు, చీకటి వాగులు పొంగిపొర్లుతుండటంతో చింతూరు మండలంలో 16 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడు మండలం మీదుగా వెళ్లి గోదావరిలో కలిసే ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై ఉన్న వంతెన నీటమునిగిపోయింది. దీంతో 15గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

కొల్లేరుకు వరద... పెనుమాకలంక రోడ్డు మూసివేత

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం... ఎగువ నుంచి చేరుతున్న వరద నీటితో కొల్లేరులోకి భారీగా నీరు చేరుతోంది.దీంతో మండవల్లి మండలం పెద్దఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంకకు వెళ్లే రహదారి కిలోమీటరుమేర జల దిగ్బంధంలో చిక్కుకుంది.

నంద్యాలలో ఉప్పొంగిన వాగులు

నంద్యాల జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 400 హెక్టార్లలోని మొక్కజొన్న, అరటి,జొన్న పత్తి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లాలో 765.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సిక్కోలులో నీటమునిగిన పొలాలు, రోడ్లు

శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. టెక్కలి, శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస, నరసన్నపేట నియోజకవర్గాల్లో పంటపొలాలు, రోడ్లు నీట మునిగాయి. కాగా, విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు నదులు,గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి .జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాయి.మడ్డువలస నుంచి నీటిని నాగావళిలోకి విడిచిపెడుతున్నారు. గెడ్డల్లో పెరిగిన వరద నీటికి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


  • 73,274 హెక్టార్లలోని పంటలు నీటిలోనే!

భారీ వర్షాలు, వరదలకు 14 జిల్లాల్లోని 106 మండలాలకు చెందిన 828గ్రామాల్లోని 73,274 హెక్టార్లలోని పంటలు ముంపు బారినపడినట్లు వ్యవసాయశాఖ అంచనావేసింది. వరి63,740,పత్తి7,667, మినుము 573, పెసర 397, వేరుశనగ 257, కంది 51, మొక్కజొన్న 565, సజ్జ 24 హెక్టార్లలోని పంటలు నీటముంపులో ఉన్నట్లు అంచనా. గుంటూరులో 28,645, బాపట్ల16,325, పశ్చిమగోదావరి7,555, ఎన్టీఆర్‌ 4,619, కృష్ణా6,786,పల్నాడు2,561, ఏలూరు 2,050, కోనసీమ1,283, కాకినాడ 1,782, కర్నూలు 649, నంద్యాల581, తూర్పుగోదావరి250, అనంత143, కడపలో45 హెక్టార్లలో పంట మునిగింది.

  • ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలి: సీఎం

భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్లును అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు సీఎ్‌సను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల పరిస్థితిపై సచివాలయంలో సీఎస్‌ విజయానంద్‌తో సీఎం సమీక్ష చేశారు. భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ముందస్తు సన్నద్ధతతో అప్రమత్తమై, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.

Updated Date - Aug 19 , 2025 | 05:39 AM