Share News

Cyclone Dithwa: కుమ్మేసిన వాన

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:28 AM

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షం కుమ్మేసింది. దిత్వా తుఫాను బలహీనపడి కొనసాగుతున్న వాయుగుండం బుధవారం పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడుతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి

Cyclone Dithwa: కుమ్మేసిన వాన

  • నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు

  • వాకాడులో 28, సర్వేపల్లిలో 27.2 సెంటీమీటర్లు

  • పలు చెరువులకు గండ్లు.. కొట్టుకుపోయిన రోడ్లు..

  • ఉధృతంగా వాగులు, వంకలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

  • నెల్లూరు నగరం అతలాకుతలం.. నీట మునిగిన కాలనీలు

  • తొట్టంబేడులో గోడకూలి వృద్ధురాలి మృతి

  • పుదుచ్చేరిలో తీరం దాటిన వాయుగుండం

  • నేడు చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వానలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షం కుమ్మేసింది. దిత్వా తుఫాను బలహీనపడి కొనసాగుతున్న వాయుగుండం బుధవారం పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడుతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా వాకాడులో 28, చిట్టుమూరులో 27.6, అల్లంపాడులో 23.8, విద్యానగర్‌, గుణుపూడులో 19.6, మల్లాంలో 17.6, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఈడగలిలో 24, వెంకటాచలంలో 21.4, మనుబోలులో 17.9, అక్కంపేటలో 16.7, నెల్లూరు 14, తోటపల్లిగూడూరులో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రి కొన్ని గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నెల్లూరు నగరం జలమయమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉడుముల వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొత్తూరు, వైఎ్‌సఆర్‌ నగర్‌, శ్రామికనగర్‌, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, రెవెన్యూ కాలనీ, చంద్రబాబు నగర్‌ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి నీటమునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, లారీలు మినహా మిగిలిన వాహనాలను దారి మళ్లించారు.


ముగిసిన ‘దిత్వా’ కథ

శ్రీలంక, తమిళనాడు, ఏపీలకు వణుకు పుట్టించిన ‘దిత్వా’ తుఫాన్‌ కథ ముగిసింది. తుఫాను బలహీనపడిన తర్వాత కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయం పుదుచ్చేరికి దక్షిణ ప్రాంతంలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాత్రికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది తమిళనాడు భూభాగం మీదుగా పయనించి గురువారం నాటికి పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత నెల 26నుంచి ఏడు రోజులపాటు శ్రీలంక, దక్షిణ భారతంపై దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. గురువారం నుంచి వర్షాలు తగ్గనున్నాయి. గురువారం రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌, రామలింగాపురం అండర్‌ బ్రిడ్జిలు కూడా మునిగిపోయాయి. మాగుంట లేఅవుట్‌, రంగనాయకులపేట, మనుమసిద్దినగర్‌, పొగతోట ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. నెల్లూరు రూరల్‌ మండలం ములుమూడి వద్ద కలుజు ఉధృతంగా ప్రవహించడంతో నెల్లూరు-తాటిపర్తి మార్గాన రాకపోకలు నిలిపేశారు. మనుబోలు వద్ద ప్రధాన రహదారిపై కండలేరు కాలువ ఉధృతంగా వ్రవహిస్తోంది. సౌత్‌మోపూరు సమీపంలో మొగళ్లపాలెం చెరువు తెగిపోయింది. కోవూరు మండలంలో సదరన్‌ ఛానల్‌కు గండి పడింది. చాలా రోడ్లపై వర్షపు నీరు నిలబడి గుంతలు పడ్డాయి. చాలా చోట్ల నాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం నెల్లూరు జిల్లాలో 507 హెక్టార్లలో వరినాట్లు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. మరో 116 హెక్టార్లలో నారుమళ్లు దెబ్బతిన్నాయి. ఇంకా వేల ఎకరాల్లో నాట్లు, నారుమళ్లు నీటిలో మునిగి ఉన్నాయి. నీరంతా బయటకు వెళితే గానీ ఆ సాగు పనికొస్తుందా.. లేదా..? అన్నది తేలుతుంది. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి, కైవల్య, కాళంగి నదులతో పాటు పలు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. తొట్టంబేడు మండలం కాసరం గ్రామంలో ఇంటి గోడ కూలి మంచంపై నిద్రిస్తున్న రేణుకమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. చిట్టమూరు మండలం మొలకలపూడి రోడ్డు, కేవీబీపురం మండలంలో పూడి వంతెన, వాకాడు మండలం ముట్టెంబాక-చిట్టమూరు రోడ్డు కొట్టుకుపోయాయి. తడ మండలంలో కారిజాత చెరువు, పెళ్ళకూరు మండలం నెలబల్లి చెరువులకు గండ్లు పడ్డాయి. తడ, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో వెయ్యి ఎకరాలకు పైగా పొలాలు నీట మునిగాయి.

Updated Date - Dec 04 , 2025 | 04:30 AM