APCPSEA: బకాయిలు.. వడ్డీతో సహా ఇప్పించండి
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:48 AM
వైసీపీ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం(డీఏ), 11వ వేతన సంఘం(పీఆర్‌సీ) బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం.
డీఏ, పీఆర్‌సీలపై కోర్టును ఆశ్రయించిన ఏపీసీపీఎస్‌ఈఏ
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం(డీఏ), 11వ వేతన సంఘం(పీఆర్‌సీ) బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం(ఏపీసీపీఎస్ఈఏ)హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ట్రెజరీ, అకౌంట్స్ డైరెక్టరేట్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, వర్క్ అకౌంట్స్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు కౌంటర్ అవసరమని అభిప్రాయపడింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. విజయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం బకాయిలతో పాటు పీఆర్‌సీ బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం అధ్యక్షుడు పఠాన్ బాజీ పిటిషన్‌లో అభ్యర్థించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది అంజన రామకామేశ్వరి వాదనలు వినిపించారు.