Indian Embassy: ఖతర్ నుంచి తెలుగు పాస్టర్ల విడుదల
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:10 AM
ఖతర్ దేశంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా మతప్రచారం చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న 9 మంది ప్రవాస క్రైస్తవ పాస్టర్లకు ఊరట లభించింది.
మత ప్రచారం అభియోగంపై 2 నెలలు పోలీసుల అదుపులో..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఖతర్ దేశంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా మతప్రచారం చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న 9 మంది ప్రవాస క్రైస్తవ పాస్టర్లకు ఊరట లభించింది. వీరిలో ముగ్గురు ఏపీకి చెందిన వారు కాగా, దేశం విడిచి వెళ్లకుండా వీరిపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో వీరంతా ఖతర్ నుంచి విడుదలై స్వస్థలాలకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఈ ముగ్గురూ క్రైస్తవ ప్రముఖులే. వీరిలో ఇద్దరు ఒక చర్చి వార్షికోత్సవ సభకు, మరొకరు వ్యక్తిగత పనిపై ఖతర్‌కు వచ్చి, ఒక చర్చికి వెళ్తుండగా పోలీసులు ఏప్రిల్ 27న అరెస్ట్ చేశారు. అనంతరం, జూలై 4న విడుదల చేశారు. కానీ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఖతర్‌లోని సామాజిక సేవకుడు, కడప జిల్లా ప్రముఖుడైన మనీష్ రెడ్డి అరుణ్ వీరి కేసును భారతీయ ఎంబసీ సాయంతో పరిష్కరించారు. విడుదల చేసినందుకు భారతీయ ఎంబసీకి, మనీష్ రెడ్డికి తెలుగు పాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.