Share News

ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:49 AM

ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి అని మత్స్యశాఖ కమిషనర్‌ రామశంకరనాయక్‌ అన్నారు. ఆక్వా జోన్‌ మ్యాపింగ్‌ సర్వే ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.

ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి

- ఇప్పటి వరకు 41 శాతమే పూర్తి

- రైతులు సత్వరం నమోదు చేసుకోవాలి

- అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఐరోపా దేశాలకు ఎగుమతి

- మత్స్యశాఖ కమిషనర్‌ రామశంకరనాయక్‌

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి అని మత్స్యశాఖ కమిషనర్‌ రామశంకరనాయక్‌ అన్నారు. ఆక్వా జోన్‌ మ్యాపింగ్‌ సర్వే ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఎఫ్‌డీవోలు, ఏడీలు, సాగర మిత్రలతో జిల్లా స్థారు సమీక్షా సమావేశం బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రామ శంకర నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 5,97,690 ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే, ఇప్పటికి కేవలం 2, 40, 390 ఎకరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో అయ్యాయన్నారు. వాస్తవానికి 16వ తేదీతో గడువు ముగుస్తుందని, అయితే ప్రభుత్వం మరో 15 రోజులు గడువు పొడిగిస్తుందన్నారు. గ్రామస్థాయిలో పడవల సంఖ్య, సాగు విస్తీర్ణం, ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో చెరువుల్లో సాగవుతున్న చేపల సాగు విస్తీర్ణ వివరాలను కూడా ఆన్‌లైన్‌ చేయాలని చెప్పారు. పండుతున్న రొయ్యలు, చేపల వివరాలు సత్వరం నమోదు చేయాలన్నారు. అమెరికాకు రొయ్యలు, చేపల ఎగుమతులు ఆగిపోయినందున ఆక్వా రైతులు నష్టపోకుండా నూతన ప్రణాళిక రూపొందించామన్నారు. ఐరోపా ఖండంలోని దేశాలకు ఎగుమతులు పంపేందుకు యోచిస్తున్నామన్నారు. ఇందుకు గాను రైతులు పండించే రొయ్యలు గ్లోబల్‌ ప్రమాణాలకు తగిన విఽధంగా పండించాలన్నారు. మత్స్య సహకార సంఘాలు ఇందుకు చొరవ చూపాలని కోరారు. ఎన్‌ఎఫ్‌డీపీ కింద నమోదు చేస్తే పీఎఫ్‌ఎంఎస్‌ స్కీం కింద ఇన్సూరెన్స్‌ కవరేజి వచ్చే అవకాశం ఉందన్నారు. క్లస్టర్‌ స్థాయిలో రైతులను చైతన్య పరచాలన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సాగయ్యే కొత్తరకం రొయ్యలను తీసుకుని వస్తున్నామన్నారు. మోడల్‌ హేచరీల్లో నాణ్యత గల రొయ్యల పిల్లలను పెంచి రైతులకు అందించాల్సి ఉందన్నారు. రొయ్యల పిల్లలకు వచ్చే వ్యాధులను గుర్తించేందుకు సైంటిస్టులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వివరించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన వర్తింప జేసేందుకు అధికారులందరూ సహకరించాలన్నారు. ఐరోపా, జపాన్‌, సౌత కొరియా, ఆస్ర్టేలియా, మిడిల్‌ ఈస్ట్‌లకు ఎగుమతి చేసేందుకు ఎంపెడా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ ఏ.నాగరాజా తదితరులు మాట్లాడారు. కాగా సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆశించినంతగా ఆక్వా సాగు నమోదు కావడం లేదని, సాగర మిత్రలు, ఎఫ్‌డీవోలు కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌లోని ఇబ్బందులను సరిచేసి వేగవంతంగా నమోదు చేసేందుకు కృషి చేస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Oct 16 , 2025 | 12:49 AM