Share News

Regional Transport Authority: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కేసులు

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:31 AM

కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

 Regional Transport Authority: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కేసులు

  • నిబంధనలు ఉల్లంఘించిన 289 బస్సులపై చర్యలు

  • ‘కర్నూలు’ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ ప్రత్యేక తనిఖీలు

అమరావతి, విశాఖపట్నం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా బస్సులు నడుపుతున్న పలు ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలకు శనివారం భారీ షాక్‌ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఇక్కడ బస్సుల్ని పరుగులు పెట్టించే ట్రావెల్‌ ఆపరేటర్లకు చెక్‌ పెట్టారు. ఒక్కరోజే 289 ట్రావెల్‌ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో అగ్నిమాపక పరికరాలు లేని బస్సులు 103 ఉన్నట్లు వెల్లడైంది. రవాణా చట్టాన్నే లెక్క చేయకుండా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్‌ బస్సులను సీజ్‌ చేసినట్లు రవాణాశాఖ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా తెలిపారు. అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి 127కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనధికారిక మార్పులు చేసిన 45, ప్రయాణికుల జాబితాలేని 34, వాణిజ్య వస్తువులు సరఫరా చేస్తున్న 10, కనీస రికార్డులు లేని 8 బస్సులపై ఎంవీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు సిన్హా చెప్పారు. అగ్నిమాపక పరికరాలు లేని వాహనాలకు భారీ జరిమానా విధించామని, ఇతర ఉల్లంఘనలపై రూ.7.08 లక్షల వరకు ఫైన్‌ వేశామన్నారు. అత్యధికంగా ఏలూరులో 55, తూర్పు గోదావరిలో 17, కోనసీమలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, నంద్యాల జిల్లాలో 4 కేసులు నమోదయినట్టు వివరించారు. చట్టవిరుద్ధంగా వాహనాలను నడిపినా, ప్రయాణికుల భద్రత పట్టించుకోకపోయినా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. పర్మిట్‌ నిబంధనలు పాటించి ప్రయాణికులకు భద్రత కల్పించేవరకూ ఈ ప్రక్రియను కొనసాగిస్తామని సిన్హా స్పష్టం చేశారు.


కాగా, విశాఖ నుంచి బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్‌ బస్సులను రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు తనిఖీ చేశాయి. సీబుక్‌లో ఉన్న సీటింగ్‌ను మార్చి అదనపు బెర్త్‌లు ఏర్పాటుచేయడం, అత్యవసర ద్వారం మూసేసి అక్కడ అదనంగా సీట్లు ఏర్పాటుచేయడం, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచకపోవడం, పర్మిట్‌ ముగిసినా బస్సును తిప్పుతుండడం వంటి ఉల్లంఘనలకు 10 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.2.5 లక్షల చొప్పున జరిమానా విధించారు. పర్మిట్‌ ముగిసిన బస్సును సీజ్‌ చేశారు.

Updated Date - Oct 26 , 2025 | 06:21 AM