Deputy CM Pawan: సంస్కరణల ఫలాలు గ్రామీణులకందాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:39 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
1 నుంచి డీడీఓ కార్యాలయాల ప్రారంభం
ఏనుగులతో ఇబ్బందులు.. నియంత్రించాలి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోనని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబరు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు(డీడీఓ) కార్యాలయాలను ప్రారంభించాలని ఆదేశించారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలందించే వెసులుబాటు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగం, పాలనా సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళికలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశా వైపు నుంచి వస్తున్న మదపుటేనుగుల సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మన్యంలో ఏనుగుల సంచారంతో జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఏనుగుల గుంపుల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుని, పంటలకు నష్టం వాటిల్లకుండా, వాటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.
గురువారం మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘మన్యం జిల్లా సరిహద్దుల్లో ఏనుగుల సంచారంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఒడిశా వైపు నుంచి ప్రవేశించిన రెండు గుంపులు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. బద్వేల్-నెల్లూరు మధ్య నాలుగు లైన్ల 67వ నంబరు జాతీయ రహదారికి 34.67 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఉంది. ఈ భూముల బదిలీకి జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి కోసం పంపనున్నాం. బెంగుళూరు-కడప- విజయవాడ కారిడార్ కోసం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్కు నుంచి 40.86 హెక్టార్ల భూమి బదిలీకి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్‌లైఫ్ ఇండియా అనుమతులతో పాటు జాతీయ వన్యప్రాణి బోర్డుకు నివేదిక అందజేయనున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 29న జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో కనిపించే అరుదైన.. తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్యప్రాణి బోర్డుకు ప్రతిపాదన చేస్తున్నాం’ అని పవన్ వివరించారు. అటవీశాఖ ప్రత్యేక సీఎస్ కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్, పీసీసీఎఫ్ చలపతిరావు పాల్గొన్నారు.