ఇద్దరు వైసీపీ సానుభూతి కాంట్రాక్టర్ల రీ ఎంట్రీ!
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:56 AM
గత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు కాంట్రాక్టర్‌లను చూసి గుడివాడ మున్సిపాల్టీలో పనిచేసే ఉద్యోగులు హడలెత్తిపోయారు. ఏ రోజుకా రోజు భయం భయంగా విధులు నిర్వర్తించేవారు. కాంట్రాక్టర్లు చేసిన అరాచకం, మాట్లాడిన బూతులు, ఉద్యోగులపై చెయ్యి చేసుకోవడం వంటి వికృత చేష్టలు ఉద్యోగులను భయాందోళనకు గురిచేశాయి. ఒకానొక సమయంలో ఉద్యోగులు కొందరు మూకుమ్మడిగా శెలవుపై వెళ్లిపోవాలని కూడా భావించారు. ఇప్పుడు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు.
- హడలిపోతున్న గుడివాడ మున్సిపల్ ఉద్యోగులు
- భయం భయంగా విధుల్లోకి మహిళా ఉద్యోగులు
- వైసీపీ హయాంలో వీరి నోటికి అడ్డేలేదు
- గతంలో మున్సిపల్ సిబ్బందిపై దాడులు
- మాట వినని వారిపై తిట్ల దండకం
- తాజాగా ఒకరికి టీడీపీ, మరొకరికి జనసేన నాయకుల మద్దతు
గత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు కాంట్రాక్టర్‌లను చూసి గుడివాడ మున్సిపాల్టీలో పనిచేసే ఉద్యోగులు హడలెత్తిపోయారు. ఏ రోజుకా రోజు భయం భయంగా విధులు నిర్వర్తించేవారు. కాంట్రాక్టర్లు చేసిన అరాచకం, మాట్లాడిన బూతులు, ఉద్యోగులపై చెయ్యి చేసుకోవడం వంటి వికృత చేష్టలు ఉద్యోగులను భయాందోళనకు గురిచేశాయి. ఒకానొక సమయంలో ఉద్యోగులు కొందరు మూకుమ్మడిగా శెలవుపై వెళ్లిపోవాలని కూడా భావించారు. ఇప్పుడు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు.
ఆంధ్రజ్యోతి - గుడివాడ:
గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ పురపాలక సంఘంలో ఇద్దరు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మున్సిపాల్టీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా సరే తాము చెప్పిన పని, తమ ఫైళ్లను వెంటనే ఓకే చేయకుంటే తమ విశ్వరూపాన్ని చూపేవారు. వయస్సు, జెండర్‌తో సంబంధం లేకుండా నోటికి వచ్చినట్టు తిట్ల పురాణం ఎత్తుకునేవారు. తన తండ్రి వయస్సు ఉన్న వారిని సైతం ఏకవచనంతో మాట్లాడేవారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఇద్దరు మున్సిపల్ ఉన్నతాధికారులపై చెయ్యి కూడా చేసుకున్నారు. ఓ మహిళా ఉద్యోగిని రాయలేని భాషతో దూషించారు. ఆ ఐదేళ్లు ఎన్నో అరాచకాలు సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరు కనిపించకుండాపోయారు. దీంతో మున్సిపల్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేసుకుంటున్న వీరికి కాంట్రాక్టర్ల రీ ఎంట్రీ షాక్‌కు గురిచేసింది. గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారిని తిరిగి తీసుకురావడంతో కూటమి నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయస్థితిలో ఉన్నారు.
ఏడాది పాటు అదృశ్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు ఇద్దరు కాంట్రాక్టర్లు అదృశ్యమయ్యారు. ఒక కాంట్రాక్టర్ తాడిగడప మున్సిపాల్టీ పరిధిలో చేరాడు. గతంలో గుడివాడలో పనిచేసి, బదిలీపై తాడిగడప మున్సిపాల్టీకి వచ్చిన వారితో ఉన్న సత్సంబంధాలతో అక్కడ అరాచకానికి తెరలేపాడని సమాచారం. ఏకంగా ఉన్నత స్థాయి ఉద్యోగిపై దాడి చేసి అంతుచూస్తానని బెదిరించి, మహిళా ఉద్యోగులను బండబూతులు తిట్టిన మరో కాంట్రాక్టర్ ఏడాది క్రితం వరకు గుడివాడలో సైలెంట్ మోడ్‌లో ఉన్నాడు. ఈ కాంట్రాక్టర్ తండ్రి ప్రస్తుతం వైసీపీ గుడివాడ పట్టణ కమిటీలో ముఖ్య నాయకుడిగా చెలామణి అవుతున్నాడు.
ముఖ్య నాయకుల సిఫారసుతో..
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోని ఓ నాయకుడి మద్దతుతో ఒక కాంట్రాక్టర్, బంధుత్వం సాకుతో జనసేన నాయకుడి సిఫారసుతో మరో కాంట్రాక్టర్ గుడివాడ మున్సిపాల్టీలోకి రీ ఎంట్రీ కొట్టారని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లు వైసీపీ హయాంలో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన వారికి మళ్లీ ఎలా అవకాశం ఇస్తారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
నెలరోజులుగా మళ్లీ మున్సిపాల్టీకి..
గత నెల రోజులుగా ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు మళ్లీ మున్సిపాల్టీకి వస్తుండటంతో ఉద్యోగులు హడలిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా వారు సాగించిన దమనకాండను ఉద్యోగులు మరచిపోలేకపోతున్నారు. వారి ద్వారా ఇబ్బందులు పడ్డ వారు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి నిరసనకు సమాయత్తమవ్వాలని నిశ్చయించుకున్నారు. వారిద్దరిని మున్సిపల్ కార్యాలయంలోకి రాకుండా బహిష్కరించాలని ఉద్యోగుల్లో డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కల్పించుకుని తమను ఇబ్బందులకు గురిచేసిన కాంట్రాక్టర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని మున్సిపల్ ఉద్యోగులు కోరుతున్నారు.