Share News

Red Balloon Aerospace: సరుకుల రవాణా బెలూన్లు వస్తున్నాయ్‌..

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:46 AM

సరుకుల రవాణా అంటే.. మనకు లారీలు, రైళ్లు, విమానాలు, నౌకలు గుర్తొస్తాయి. వీటికి ఇప్పుడు బెలూన్లు కూడా తోడవ్వనున్నాయి. ఎయిర్‌బస్‌ విమానానికి....

Red Balloon Aerospace: సరుకుల రవాణా బెలూన్లు వస్తున్నాయ్‌..

  • 2029 కల్లా ‘రెడ్‌ బెలూన్‌’ కార్గో సేవలు

  • హైడ్రోజన్‌తో నడిచే ఎయిర్‌షిప్‌

  • తక్కువ వ్యయంతో రవాణాకు వీలు

  • ఆర్‌టీఐహెచ్‌ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా విజయవాడ కంపెనీ

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సరుకుల రవాణా అంటే.. మనకు లారీలు, రైళ్లు, విమానాలు, నౌకలు గుర్తొస్తాయి. వీటికి ఇప్పుడు బెలూన్లు కూడా తోడవ్వనున్నాయి. ఎయిర్‌బస్‌ విమానానికి మూడింతలు ఉండే బెలూన్లు త్వరలోనే ఆకాశంలో ఎగురుతూ కనిపించనున్నాయి. గ్రీన్‌హైడ్రోజన్‌తో నడిచే ఈ బెలూన్లు 2029 కల్లా కా ర్గో సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడకు చెందిన డీప్‌ టెక్‌ స్టార్టప్‌ కంపెనీ రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హెలిక్స్‌ పేరుతో కార్గో బెలూన్‌లను రూపొందిస్తోంది. ఏఐ తో పనిచేసే ఇలాంటి బెలూన్లు దేశీయంగా తయారు చేయడం ఇదే మొదటిసారి. వా ణిజ్య, రక్షణ అవసరాల కోసం వీటిని అభివృద్ధి చేస్తున్నారు. బుధవారం మంగళగిరిలోని రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌(ఆర్‌టీఐహెచ్‌) ప్రారంభోత్సవం సందర్భంగా ఏ ర్పాటు చేసిన స్టార్టప్‌ స్టాల్స్‌లో రెడ్‌బెలూన్‌ నమూనాను ప్రదర్శించారు. స్టాల్‌లో విమానం ఆకారంలో ఉన్న తెల్లటి బెలూన్‌ను అందరూ ఆసక్తిగా చూశారు.


Air-balloon.jpg

అంతరిక్షరంగంలో పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న డాక్టర్‌ సీవీఎస్‌ కిరణ్‌, శిరీష్‌ పల్లికొండ రెడ్‌ బెలూన్‌ సంస్థను స్థాపించారు. ఈ బెలూన్‌ డిజైన్‌నూ కూడా వారే రూపొందించారు. సహజంగా ఎయిర్‌బస్‌ విమానం చాలా పెద్దది గా ఉంటుంది. దానికి మూడింతల సైజు లో కార్గో బెలూన్‌ ఉంటుంది. అతి తక్కువ గ్రౌండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌తో కార్గో బెలూన్లను నిర్వహించవచ్చు. రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ప్రకృతివైపరీత్యాల ప్రభావిత ప్రాంతాలకు సులువుగా సరుకులు రవాణా చేయవచ్చు. సంస్థ ప్రతినిధులు కిరణ్‌, శిరీష్‌ పలు ఆసక్తికర అంశాలు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఈ బెలూన్‌లను రిమోట్‌ సాయంతో 20 నుం చి 100 కిలోమీటర్ల పరిధిలో వస్తువులను చేరవేయచ్చన్నారు. కిలో బరువుకు రూ.80 నుంచి రూ. 100 దాకా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు శిరీష్‌ వివరించారు. రైలు, రోడ్డు రవాణా కంటే తక్కువ వ్యయం అవుతుందన్నారు. రెడ్‌బెలూన్‌ కార్గో సేవలు రాష్ట్రంలో 2029 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 07:19 AM