Heavy Rains: 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:25 AM
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి...
విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమలో కుంభవృష్టి కురిసే అవకాశం
అల్పపీడనం.. వాయుగుండమయ్యే చాన్స్
ఓడరేవుల్లో మూడో నంబరు హెచ్చరిక
మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచన
విపత్తుల సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 విడుదల
విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించనుంది. రుతుపవన ద్రోణి తూర్పుభాగం ఆదివారం నాటికి జగదల్‌పూర్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఛత్తీస్‌గఢ్‌లోని మరో అల్పపీడనం ఆదివారం విదర్భ వద్ద కేంద్రీకృతమైంది. ఇంకా బంగాళాఖాతంలోని అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర, ఛత్తీస్‌గఢ్, విదర్భ, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు తూర్పు, పడమర ద్రోణి విస్తరించింది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలపడి బంగాళాఖాతం నుంచి కొస్తాంధ్ర పైకి భారీగా తేమగాలులు వీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు యానాంకు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం ఉదయం వరకు ఆ జిల్లాలతోపాటు పలు జిల్లాల్లో కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలోనూ వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కుంభవృష్టి, కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా రాయలసీమలోని తిరుపతిలో భారీగా, మిగిలిన జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్టపట్నంలో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
అధికారులూ అప్రమత్తం!
అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అత్యవసర సేవల కోసం జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాలని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యవసరమైతే విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లో సంప్రదించాలని కోరారు.