Share News

Cyclone: ఉత్తర కోస్తాకు రెడ్‌ అలర్ట్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 05:27 AM

మయన్మార్‌, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

Cyclone: ఉత్తర కోస్తాకు రెడ్‌ అలర్ట్‌

  • నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

  • నాలుగు జిల్లాలకు అతిభారీ వర్షాలు

  • కోస్తాలో ఐదో తేదీ వరకు వానలే

  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: విపత్తుల సంస్థ

విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): మయన్మార్‌, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇంకా మయన్మార్‌ నుంచి ఉత్తర ఒడిశా వరకూ ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ద్రోణిలో వాయవ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం విలీనమైంది. వీటన్నింటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు వీస్తుండటంతో సోమవారం ఉత్తరకోస్తాలో భారీవర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుర్లలో 7.6, లావేరులో 6.5, జియ్యమ్మవలసలో 6.3, చీపురుపల్లి, పెద్దనడిపల్లిల్లో 6.1, నరసింగపల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరకోస్తాకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని, ఒకటిరెండుచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే, బుధవారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరం వెంబటి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44.4 అడుగులు ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11.91 లక్షల క్యూసెక్కులు ఉంది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులు ఉంది.

Updated Date - Sep 02 , 2025 | 05:29 AM