ACB Record Case: ఏసీబీ చరిత్రలోనే అవినీతి రికార్డు
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:36 AM
ఇప్పటి వరకూ రూ.4 లక్షలు, రూ.6 లక్షలు లంచాలు డిమాండ్ చేసి స్వల్ప మొత్తంలో నగదు తీసుకుంటున్న వారిని ఏసీబీ పట్టుకుంది. తాజాగా ఏకంగా 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి...
ఆఫీసులోనే 25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గిరిజన శాఖ ఈఎన్‌సీ శ్రీనివాస్
ఇంత భారీ సొమ్ముతో దొరకడం తొలిసారి
బిల్లుల మంజూరుకు ఏకంగా 5 కోట్ల డిమాండ్.. ఇవ్వనందుకు కాంట్రాక్టరుకు 35 కోట్లు పెండింగ్
గతంలోనూ రెండుసార్లు చిక్కిన వైనం
రిటైర్మెంట్‌కు 3 వారాల ముందు మళ్లీ జైలుకు
అమరావతి/విజయవాడ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ రూ.4 లక్షలు, రూ.6 లక్షలు లంచాలు డిమాండ్ చేసి స్వల్ప మొత్తంలో నగదు తీసుకుంటున్న వారిని ఏసీబీ పట్టుకుంది. తాజాగా ఏకంగా 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి రూ.25 లక్షలు టోకెన్ నగదు తీసుకుంటున్న అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాస్ తన చాంబర్‌లో ఓ కాంట్రాక్టరు నుంచి ఈ మేరకు డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద ట్రాప్. విశాఖకు చెందిన సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్‌సీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్టును విశాఖపట్నానికి చెందిన శ్రీసత్యసాయి కన్‌స్ట్రక్షన్స్ అధినేత సీహెచ్ కృష్ణంరాజు దక్కించుకున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏకలవ్య పాఠశాల భవనాలను నిర్మించారు. ఒక్కో భవనం అంచనా వ్యయం రూ.12 కోట్లు కాగా, నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.15 కోట్లకు చేరింది.
ఈ భవనాలకు సంబంధించి కృష్ణంరాజుకు రూ.35.50 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా శ్రీనివాస్ ఏదో ఒకవిధంగా కొర్రీలు పెడుతున్నారు. చివరకు కొద్దిరోజుల క్రితం ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. రూ.35.50 కోట్ల బిల్లులు చేయాలంటే రూ.5 కోట్లు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు. ముందుగా రూ.25లక్షలు ఇవ్వాలని షరతు విధించారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కృష్ణంరాజు విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడి చేయాలని నిర్ణయించారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరుగా ఆఫీసులోకి తీసుకొచ్చి లంచం ఇవ్వమని శ్రీనివాస్ ఫోన్‌లో బాధిత కాంట్రాక్టరుకు చెప్పారు. కృష్ణంరాజు తన స్నేహితుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకుని బ్యాగ్‌లో పెట్టి శ్రీనివా్‌సకు అందజేశారు. ఆయన ఈఎన్‌సీ చాంబర్‌లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు, శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్లు భాస్కరరావు, నాగరాజు శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివా్‌సను ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి జైలుకు తరలించారు. మరో మూడు వారాల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఆత్మహత్యే శరణ్యమన్నా..
కృష్ణంరాజును ఈఎన్‌సీ శ్రీనివాస్ వైసీపీ హయాం నుంచి లంచాల కోసం వేధిస్తున్నారు. డీవియేషన్ (అదనపు పని)కి అమనుతులు ఇవ్వడం కోసమే భారీగా డబ్బు డిమాండ్ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేపట్టిన కృష్ణంరాజు.. అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆస్తుల వేలానికి నోటీసులిచ్చాయి. తన పరిస్థితిని కృష్ణంరాజు ఈఎన్‌సీకి వివరించారు. బిల్లులు మంజూరు చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘చస్తే చావు’ అని సమాధానం ఇచ్చారు. ఈఎన్‌సీ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఇది మూడోసారి. 2001లో విశాఖపట్నం ఎస్‌ఈ కార్యాలయంలో ఏఈగా మొదటిసారి, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ 2014లో రెండో దఫా ఏసీబీకి పట్టుబడ్డారు. సబ్బవరపు శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ పోస్టుకు అనర్హుడని గత ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రుల ద్వారా వ్యవహారాలను చక్కబెట్టి ఆయన ఆ కుర్చీలో కూర్చున్నారు. ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఇంకా ఈ సీటులో కొనసాగడానికి ప్రయత్నాలు చేశారు.
మరో కోటి డిమాండ్
కేంద్ర ప్రభుత్వం లంబసింగిలో రూ.35 కోట్లతో గిరిజన మ్యూజియం నిర్మించాలని నిర్ణయించింది. టెండర్ ప్రక్రియలో కృష్ణంరాజుకు కాంట్రాక్టు దక్కింది. మ్యూజియం సెంట్రింగ్ స్థాయికి వచ్చేసరికి ఇసుక కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. దీన్ని అవకాశంగా మార్చుకున్న ఈఎన్‌సీ శ్రీనివాస్ కృష్ణంరాజును తప్పించి, మరో కాంట్రాక్టరుకు పనులు అప్పగించారు. దీనిపై కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయడానికి కృష్ణంరాజు నుంచి శ్రీనివాస్ రూ.కోటి లంచం డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను కాంట్రాక్టరు మంత్రి లోకేశ్‌కు మెయిల్ ద్వారా తెలియజేశారు. ఆ మర్నాడే లోకేశ్ కార్యాలయం నుంచి కృష్ణంరాజుకు ఫోన్ వెళ్లింది. మొత్తం ఆధారాలను పరిశీలించిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Varamahalakshmi Vratham 2025: ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి
Gold And Silver Rates Today: ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..